‘ఆ మహాశివుడే మమ్మల్ని కాపాడాలి’.. ఉక్రెయిన్ రాయబారి నోట మహా శివరాత్రి మాట!
రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో అనేకమంది అమాయక పౌరులు ప్రాణాలు కాపాడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఉక్రెయిన్ రాయబారి మహా శివరాత్రిని గుర్తు చేస్తూ కాపాడాలంటూ పరమశివుడ్ని వేడుకుంటున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
New Delhi | రష్యా చేస్తున్న భీకర దాడితో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండు వైపులా ప్రాణనష్టం భారీగా పెరుగుతోంది. ఇరు వర్గాల మధ్య సోమవారం జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఇద్దరూ తగ్గడం లేదు. ఫలితంగా రష్యా దండయాత్ర ఆరవ రోజుకు చేరింది. ఈ యుద్ధంలో అమాయక పౌరులు మరణిస్తున్నారు. మంగళవారం ఓ భారతీయ విద్యార్థి కూడా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో.. ఈ భారీ వినాశనాన్ని ఎవరు ఆపగలరు? అని ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠత నెలకొన్న సమయంలో ఇక ఆ మహా శివుడే మమ్మల్ని కాపాడాలి అని వేడుకుంటున్నారు. ఇంతకీ.. ఇలా కోరుకున్నది భారతీయులో లేక శివ భక్తులో కాదు స్వయానా ఉక్రెయిన్ రాయబారి ఈ మాట అన్నారు. మహా శివరాత్రి రోజున మహాదేవుడిపై ఆయన అమితమైన విశ్వాసాన్ని చూపించారు.
భారత్ లోని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పోలిఖా (Igor Polikha) మంగళవారం ఇండియన్ మీడియాతో మాట్లాడుతూ.. "ఈరోజు మహా శివరాత్రి అని నాకు తెలుసు. ఆ పరమశివుడు మీ అందరిలో కొలువుదీరి ఉంటాడు. దయచేసి ఉక్రెయిన్‌లో జరుగుతున్న హింసను ఆపేలా ఆయనను మీరంతా ప్రార్థించండి.. మా ఆర్తనాదాలు శివుడు వినేలా చూడండి" అంటూ వ్యాఖ్యానించారు.
మహా శివరాత్రి రోజున ఒక విదేశీ రాయబారి మహా శివుడ్ని వేడుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 'మా శివుడు లయకారుడైనా.. పిలిస్తే పలికే భోళా శంకరుడు.. తప్పకుండా ఈ మానవ నాశనాన్ని అడ్డుకుంటాడు.. అమాయక పౌరులను కాపాడతాడు' అంటూ నెటిజన్స్ ట్వీట్స్, కమెంట్స్ చేస్తున్నారు.
కాగా, ఇగోర్ పోలిఖా ఈరోజు భారత రాయబార కార్యాలయంను విడిచి వెళ్లారు.
టాపిక్