Sanjay Raut : ‘తగ్గేదే లే..’ డైలాగ్​తో సంజయ్​ రౌత్​కు ఉద్ధవ్​ ఠాక్రే మద్దతు-uddhav thackeray sites pushpa s jhukega nahi dialogue to support sanjay raut ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sanjay Raut : ‘తగ్గేదే లే..’ డైలాగ్​తో సంజయ్​ రౌత్​కు ఉద్ధవ్​ ఠాక్రే మద్దతు

Sanjay Raut : ‘తగ్గేదే లే..’ డైలాగ్​తో సంజయ్​ రౌత్​కు ఉద్ధవ్​ ఠాక్రే మద్దతు

Sharath Chitturi HT Telugu
Aug 01, 2022 04:05 PM IST

Sanjay Raut : అరెస్టైన శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​కు మద్దతు ప్రకటించారు ఉద్దవ్​ ఠాక్రే. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలోని ఓ డైలాగ్​ను ప్రస్తావించారు.

సంజయ్​ రౌత్​ నివాసం వద్ద ఉద్దవ్​ ఠాక్రే
సంజయ్​ రౌత్​ నివాసం వద్ద ఉద్దవ్​ ఠాక్రే (PTI)

Sanjay Raut : శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే.. పార్టీ ఎంపీ సంజయ్​ రౌత్​పై ప్రశంసల వర్షం కురిపించారు. సంజయ్​ రౌత్​.. నిజమైన శివసైనికుడు అని కొనియాడారు.

భూకుంభకోణం కేసులో సంజయ్​ రౌత్​ను అరెస్ట్​ చేసిన ఈడీ అధికారులు.. సోమవారం మధ్యాహ్నం ఆయన్ని కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ పరిణామాల మధ్య ముంబైలోని సంజయ్​ రౌత్​ నివాసానికి వెళ్లిన ఉద్ధవ్​ ఠాక్రే.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. తన మద్దతును ప్రకటించారు.

అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. పుష్ప సినిమాలోని డైలాగ్​ను ప్రస్తావించారు ఉద్ధవ్​ ఠాక్రే.

"సంజయ్​ రౌత్​ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. పుష్ప సినిమాలో 'జుకేంగా నహీ' (తెలుగులో.. తగ్గేదే లే) అని ఓ డైలాగ్​ ఉంది. సంజయ్​ రౌత్​ ఇప్పుడు అదే చేస్తున్నారు. ఆయనే నిజమైన శివసైనికుడు. ఒత్తిడికి తలొగ్గము అని చెప్పిన వారందరు ఇప్పుడు అటు(బీజేపీ)వైపు ఉన్నారు. బాలాసాహెబ్​ చెప్పిన మార్గం అది కాదు. రౌతే నిజమైన శివ సైనికుడు," అని ప్రశంసించారు ఉద్ధవ్​ ఠాక్రే.

ఈ క్రమంలోనే బీజేపీపై విరుచుకుపడ్డారు శివసేన అధ్యక్షుడు. విద్వేష రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని మండిపడ్డారు.

నాలుగు రోజుల కస్టడీ..

Uddhav Thackery : మరోవైపు.. సంజయ్​ రౌత్​ను ముంబైలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన ఈడీ అధికారులు.. 8 రోజుల కస్టడీని కోరారు. కాగా.. వారికి 4 రోజుల కస్టడీని కోర్టు మంజూరు చేసింది.

సంజయ్​ రౌత్​ అరెస్ట్​ నేపథ్యంలో.. కోర్టు, ఈడీ కార్యాలయం వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. సంజయ్​ రౌత్​ మద్దతుదారులు, శివసేన కార్యకర్తలు.. ఈడీ కార్యాలయం, కోర్టుకు భారీగా తరలివెళ్లి నిరసన తెలిపారు.

అంతకుముందు.. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ముంబైలోని సంజయ్​ రౌత్​ నివాసానికి వెళ్లిన అధికారులు.. సాయంత్రం వరకు సోదాలు నిర్వహించారు. సంజయ్​ రౌత్​ నివాసంలో నుంచి లెక్కల్లో చూపించని రూ. 11.15లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం.. సాయంత్రం ఆయన్ని అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి తరలించారు. కాగా.. సోమవారం తెల్లవారుజామున సంజయ్​ రౌత్​ను అరెస్ట్​ చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఇక సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో.. సంజయ్​ రౌత్​ను ఈడీ కార్యాలయం నుంచి జేజే హాస్పిటల్​కు తీసుకెళ్లి.. వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి కోర్టుకు తరలించారు.

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రేకు.. సంజయ్​ రౌత్​ అత్యంత సన్నిహితుడు. ఇటీవలే ఆ పార్టీ సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు.. ఠాక్రేకు సంజయ్​ రౌత్​ అండగా నిలిచారు. ఇప్పుడు ఆయన అరెస్టుతో శివసేనకు షాక్​ తగిలినట్టు అయ్యింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం