Tripura Assembly Election: ఈ ఏడాది తొలి ‘పోల్’ దంగల్: త్రిపురలో పోలింగ్ ప్రారంభం: టాప్-5 పాయింట్స్-tripura assembly election polling starts cpi congress alliance taking on bjp ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Tripura Assembly Election: ఈ ఏడాది తొలి ‘పోల్’ దంగల్: త్రిపురలో పోలింగ్ ప్రారంభం: టాప్-5 పాయింట్స్

Tripura Assembly Election: ఈ ఏడాది తొలి ‘పోల్’ దంగల్: త్రిపురలో పోలింగ్ ప్రారంభం: టాప్-5 పాయింట్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 16, 2023 08:23 AM IST

Tripura Assembly Elections Polling: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది.

Tripura Assembly Election: త్రిపుర ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Tripura Assembly Election: త్రిపుర ఎన్నికల పోలింగ్ ప్రారంభం (HT_PRINT)

Tripura Assembly Elections Polling: ఈ ఏడాది (2023) ఎన్నికల సమరం ఆరంభమైంది. మొత్తంగా ఈ సంవత్సరం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. త్రిపురతో పోలింగ్ యుద్ధం మొదలైంది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు (ఫిబ్రవరి 16) జరుగుతోంది. నేటి ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. 60 స్థానాలు ఉన్న త్రిపురలో అధికార భారతీయ జనతా పార్టీ (BJP), ‘సీపీఎం - కాంగ్రెస్’ (Congress - CPI(M)) కూటమికి మధ్య ప్రధాన పోటీ ఉంది. దశాబ్ధాల సీపీఎం పాలనకు తెరదించి 2018లో త్రిపురలో అధికారాన్ని కైవసం చేసుకున్న కషాయ దళం మళ్లీ గెలుపు సాధించాలని పట్టుదలగా ఉంది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పటిష్ఠమైన భద్రత మధ్య జరుగుతోంది. ముఖ్యమైన వివరాలు ఇవే.

60 స్థానాలు.. 3,337 పోలింగ్ కేంద్రాలు

Tripura Assembly Poll: త్రిపురలోని 60 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. మొత్తంగా 28.14లక్షల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఇందులో మహిళలు 14,15,233 మంది, పురుషులు 13,99,289 మంది ఉన్నారు. 62 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తంగా 3,337 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

పార్టీల పొత్తులివే..

Tripura Assembly Poll: 60 అసెంబ్లీ స్థానాలల్లో మొత్తంగా 259 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ముఖ్యంగా అధికార బీజేపీ, ‘సీపీఎం - కాంగ్రెస్’ కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంది. త్రిపురలో గతంలో సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉండేది. అయితే బీజేపీని అడ్డుకునేందుకు ఈసారి కాంగ్రెస్‍తో జతకట్టింది సీపీఎం. వామపక్షాలు, కాంగ్రెస్ కూటమిగా పోటీకి వచ్చాయి. ఇక పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(IPTF)తో కలిసి బరిలోకి దిగుతోంది కాషాయ పార్టీ. ఇక కొత్తగా ఏర్పాటైన పార్టీ తిప్రా మోత ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.

సీట్ల పంపకాలు

Tripura Assembly Elections: పొత్తుల్లో భాగంగా త్రిపురలో వామపక్షాలు 47 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగాయి. 13 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక అధికార బీజేపీ 55 స్థానాల్లో తమ అభ్యర్థులు బరిలోకి దింపింది. ఐపీఎఫ్‍టీకి ఐదు సీట్లను కేటాయించింది. సీఎం మాణిక్ సాహా.. బర్డోవాలి నుంచి పోటీలో ఉన్నారు.

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా!

Tripura Assembly Elections: త్రిపురను సీపీఎం పార్టీ సుమారు మూడు దశాబ్దాలు పరిపాలించింది. అయితే 2018 ఎన్నికల్లో బీజేపీ 36 స్థానాలు సాధించి అధికారం చేపట్టింది. దీంతో ఈ ఎన్నికల్లోనూ తిరిగి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ కీలక నేతలంతా ఈసారి త్రిపురలో ముమ్మరంగా ప్రచారం చేశారు.

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడతాయి. కాగా, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీకి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. వాటి ఫలితాలు కూడా మార్చి 2నే వస్తాయి.

ఏడాది ఫస్ట్ పోల్

Tripura Assembly Elections: 2023లో దేశంలోని 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, రాజస్థాన్, చత్తీస్‍గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మిజోరంలో ఎన్నికలు జరగనున్నాయి. త్రిపురతో 2023 ఎన్నికల పోల్ దంగల్ మొదలైంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం