దేశవ్యాప్త సమ్మె .. ఆ రోజుల్లో బ్యాంకు సేవలు బంద్!-trade unions give call for nationwide strike on march 28 and 29 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  దేశవ్యాప్త సమ్మె .. ఆ రోజుల్లో బ్యాంకు సేవలు బంద్!

దేశవ్యాప్త సమ్మె .. ఆ రోజుల్లో బ్యాంకు సేవలు బంద్!

HT Telugu Desk HT Telugu
Mar 24, 2022 07:41 AM IST

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యాయి కేంద్ర కార్మిక సంఘాలు. ఈ మేరకు ఈనెల 28, 29 తేదీల్లో సమ్మె చేపట్టనున్నాయి. ఫలితంగా బ్యాంకింగ్ రంగంతో పాటు పలు సేవలకు అంతరాయం ఏర్పడనుంది.

<p>దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు</p>
దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు (HT)

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె తలపెట్టినట్లు కేంద్ర కార్మిక సంఘాలు వెల్లడించాయి. ఈనెల 28, 29 తేదీల్లో సమ్మె నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల ఐక్య వేదిక వెల్లడించింది. టెలికాం, ఉక్కు, ఆదాయపుశాఖ,  విద్యుత్, రైల్వే, రక్షణ రంగంలోని పలు యూనియన్లు సమ్మెకు మద్దతు తెలిపాయి.  

ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ సమ్మెలో పలు బ్యాంకు యూనియన్లు పాల్గొననున్నాయి. దీంతో 28 , 29 తేదీల్లో బ్యాంకింగ్ రంగ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. వీటికి ముందు నాలుగో శనివారం (26), ఆదివారం (27) సెలవులతో బ్యాంకులు మూసి ఉండనున్నాయి.  మొత్తంగా వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇక సమ్మె కారణంగా బ్యాంకింగ్​ రంగ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఎస్ బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెలో భాగంగా పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నాయి. ప్రభుత్వ రంగం బ్యాంకులను బలోపేతం చేయడంతో పాటు.. గ్యాస్, కిరోసిన్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈపీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపుపై  కేంద్రం తీరును తప్పుబడుతున్నాయి.  ప్రభుత్వ ఆస్తులను మానిటైజ్‌ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కార్మిక సంఘాల ఐక్య వేదిక తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ 28, 29న తలపెట్టిన సమ్మెలో ఉద్యోగులు, కార్మిక సంఘాలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

Whats_app_banner