Tomato flu: టొమాటో ఫ్లూపై కేంద్రం అప్రమత్తత; మార్గదర్శకాల జారీ
క్రమంగా విస్తరిస్తున్న టొమాటో ఫ్లూ వ్యాధిపై కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. వైరల్ ఇన్‌ఫెక్షన్ టొమాటో ఫ్లూ ఐదేళ్ల లోపు పిల్లలపై పెను ప్రభావం చూపుతోంది.
శరీరంపై దద్దుర్లుగా ప్రారంభమై, క్రమంగా చిన్నపాటి టొమాటో పండు సైజుకు పెరిగే భాధాకరమైన పొక్కులు ఈ టొమాటో ఫ్లూ ప్రధాన లక్షణం. ఈ పొక్కులతో పాటు జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలు మొదలైన లక్షణాలు కూడా ఉంటాయి.
Tomato flu | కేంద్రం హెచ్చరిక
ఈ టొమాటో ఫ్లూ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ టొమాటో ఫ్లూను గుర్తించే, నిరోధించే మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపించింది. లక్షణాలు బయటపడగానే కనీసం వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలని సూచించింది. భారత్‌లో మొదట ఈ ఫ్లూను కేరళలోని కొల్లాంలో గుర్తించారు.
Tomato flu | కేరళలో 82 కేసులు
ఇప్పటివరకు కేరళలో 82 టొమాటో ఫ్లూ కేసులు బయటపడ్డాయి. వీరిలో మెజారిటీ ఐదేళ్ల లోపు చిన్నారులే. మరోవైపు ఒడిశాలో దాదాపు 26 మంది చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఒడిశాలో ఈ వైరస్ సోకిన వారిలో 9 ఏళ్ల లోపు పిల్లలు కూడా ఉన్నారు. ఈ వైరస్ సోకిన వారితో సన్నిహితంగా ఉన్న పెద్దలకు కూడా ఇది సోకుతుంది. అదృష్టవశాత్తూ ఇది ప్రాణాంతకం కాదని వైద్యులు తెలిపారు. కేరళలో కొల్లాంతో పాటు ఆంచల్, ఆర్యన్‌కావు, నెడువుర్‌ల్లో కూడా ఈ కేసులు బయటపడ్డాయి. అలాగే, తమిళనాడు, కర్నాటకల్లోనూ ఈ కేసులను గుర్తించారు. ఈ రాష్ట్రాలను మినహాయిస్తే.. ఇప్పటివరకు మరే రాష్ట్రంలోనూ ఈ కేసులను గుర్తించలేదు.