‘పెళ్లి చేసుకోకండి.. ‘సింగిల్స్ ’ ఉద్యమంలో చేరండి’
Temjen Imna Along : సింగిల్ గా ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇమ్నా అలోంగ్. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్‌గా మారింది.
Temjen Imna Along : ఇంకో ఏడాదిలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలుస్తుందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ నేపథ్యంలో 'సింగిల్'గా ఉండండి అంటూ మెసేజ్ ఇస్తున్నారు నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇమ్నా అలోంగ్.
"ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మనం కొన్ని విషయాల గురించి ఆలోచించాలి. జనాభా వృద్ధి, పిల్లల పెంపకం సమస్యల గురించి చాలా ఆలోచించాలి. అలా కాదు అనుకుంటే.. నాలా సింగిల్‌గా ఉండిపోండి. అందరం కలిసి భవిష్యత్తు కోసం మన వంతు కృషి చేద్దాము. సింగిల్స్ ఉద్యమంలో నాతో కలిసి నడవండి," అని టెంజెన్ ఇమ్నా ట్వీట్ చేశారు.
ఇమ్నా చమత్కారంపై నెటిజన్లు నవ్వుకుంటున్నారు. 'సీరియస్ విషయాలను చాలా సింపుల్‌గా, నవ్వు తెప్పించే విధంగా చెప్పడం మీకు మాత్రమే సాధ్యం,' అని కొందరు అంటున్నారు. 'సల్మాన్ ఖాన్ తర్వాత మీరే మోస్ట్ ఎలిజెబుల్ బ్యాచిలర్,' అని ఇంకొందరు జోక్ చేస్తున్నారు.
ఇమ్నా ట్వీట్లు వైరల్‌గా మారడం ఇది కొత్తేమీ కాదు. 'చిన్న కళ్లు ఉంటే చాలా లాభం,' అని ట్వీట్ చేసి గతంలో చాలా మందిని నవ్వించారు. 'చిన్న కళ్లు ఉంటే.. దుమ్ము తక్కువగా లోపలికి వెళుతుంది. చిన్న కళ్లు ఉంటే.. అవి తెరుచుకుని ఉన్నాయా, మూసుకుని ఉన్నాయా చెప్పడం కష్టం. అందువల్ల.. స్టేజీ మీద, బోరింగ్ కార్యక్రమాల్లో నేను పడుకున్నా ఎవరికి తెలియదు,' అని ఓసారి అన్నారు. ఈశాన్య భారతంలోని ప్రజల కళ్లు చాలా చిన్నగా ఉంటాయి అన్న జోకులపై తనదైన శైలిలో ఈ విధంగా స్పందించారు ఇమ్నా.
అత్యధిక జనాభా..
World Population Day : వచ్చే ఏడాది భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమిస్తుందని ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి వెల్లడించిన నివేదిక అంచనా వేసింది.
యునైటెడ్ నేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ ద్వారా వెలువడిన వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022 నివేదిక అంచనాల ప్రకారం నవంబర్ 15, 2022 నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లకు చేరుకుంటుంది.
కాగా ప్రపంచ జనాభా 2030లో 8.5 బిలియన్లకు, 2050లో 9.7 బిలియన్లకు, 2100లో 10.4 బిలియన్లకు పెరగవచ్చని ఐక్యరాజ్యసమితి తాజా అంచనాలు సూచిస్తున్నాయి.
తూర్పు, ఆగ్నేయ ఆసియా జనాభా 2030ల మధ్య నాటికి క్షీణించడం ప్రారంభించవచ్చని, కాబట్టి 2037 నాటికి మధ్య, దక్షిణాసియా ప్రాంతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంగా అవతరించగలదని భావిస్తున్నారు.
రెండు అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలు ప్రస్తుతం ఏషియాలోనే ఉన్నాయి. చైనా, భారతదేశం ఒక్కొక్కటి 1.4 బిలియన్ల కంటే ఎక్కువ జనాభాను కలిగి ఉన్నాయి.
చైనా జనాభా 1.426 బిలియన్లతో పోలిస్తే 2022లో భారతదేశ జనాభా 1.412 బిలియన్లకు చేరుకుందని నివేదిక పేర్కొంది. 2050లో భారతదేశం 1.668 బిలియన్ల జనాభాను కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. అప్పటికి చైనాలో 1.317 బిలియన్ల జనాభా ఉంటుంది.
1965 తర్వాత ప్రపంచ జనాభా పెరుగుదల సగానికిపైగా మందగించిందని, సంతానోత్పత్తి స్థాయిలు తగ్గుముఖం పట్టాయని నివేదిక పేర్కొంది.
భారతదేశంలో 2100లో సంతానోత్పత్తి రేటు 1.29గా ఉంటుందని అంచనా వేసింది. దీని ఫలితంగా శతాబ్దం చివరిలో ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం జనాభా 433 మిలియన్లు తక్కువగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2022లో మహిళల (49.7 శాతం) కంటే పురుషుల (50.3 శాతం) సంఖ్య కొంచెం ఎక్కువగా ఉంది. ఈ సంఖ్య శతాబ్ద కాలంలో రివర్స్ అవుతుందని అంచనా. 2050 నాటికి స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్యకు సమానంగా ఉంటుందని అంచనా.
1950 తర్వాత మొదటిసారిగా 2020లో జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 1 శాతం కంటే తక్కువకు పడిపోయింది. ఇక ప్రపంచ జనాభాపై వలసల ప్రభావం కూడా ఉంది.
సంబంధిత కథనం