Sri Lanka crisis : నిరసనల మధ్య ఇంటిని విడిచి పారిపోయిన అధ్యక్షుడు!-sri lanka crisis president gotabaya rajapaksa flees after protesters surround residence ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sri Lanka Crisis : నిరసనల మధ్య ఇంటిని విడిచి పారిపోయిన అధ్యక్షుడు!

Sri Lanka crisis : నిరసనల మధ్య ఇంటిని విడిచి పారిపోయిన అధ్యక్షుడు!

Sharath Chitturi HT Telugu
Jul 09, 2022 01:45 PM IST

Sri Lanka crisis : శ్రీలంకలో మరోమారు నిరసనలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. తన అధికార నివాసాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

నిరసనకారులను అదుపుచేసేందుకు పోలీసుల చర్యలు
నిరసనకారులను అదుపుచేసేందుకు పోలీసుల చర్యలు (REUTERS)

Sri Lanka crisis : శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో నిరసనలు మరోమారు భగ్గుమన్నాయి. ఆందోళనకారుల చర్యలు ఈసారి ఏకంగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకే తగిలాయి! నిరసనకారులను తప్పించుకుని ఆయన పారిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.

అధ్యక్షుడు నివాసంలోకి..!

గత కొంతకాలంగా శ్రీలంక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాకు ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు. ఇప్పటికే అనేకమార్లు నిరసనలు చేపట్టారు. కానీ ఆయన మాత్రం వెనకడుగు వేయలేదు. తాజాగా.. గొటబాయ రాజీనామా కోసం నిరసనకారులు.. ఆయన అధికార నివాసం ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. వారిని అదుపుచేసేందుకు సైన్యం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

ఈ క్రమంలోనే గొటబాయను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు.

మరోవైపు శ్రీలంక సంక్షోభం వేళ.. అధ్యక్షుడి నివాసం ఎదుట గుమిగూడిన నిరసనకారులను అదుపు చేసేందుకు సైన్యం.. గాలిలోకి కాల్పులు జరిపింది. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా.. సైన్యాన్ని సైతం లెక్కచేయకుండా నిరసనకారులు ముందుకు వెళుతున్నారు. పోలీసు బ్యారికేడ్లను ధ్వంసం చేసిన ఆందోళనకారులు.. అధ్యక్షుడి నివాసంలోకి చొచ్చుకెళ్లినట్టు సమాచారం.

శుక్రవారం వరకు శ్రీలంక రాజధాని కొలంబోలో కర్ఫ్యూ ఉండేది. కోర్టుకు వెళతామని ప్రతిపక్ష నేతలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు హెచ్చరించడంతో పోలీసులు కర్ఫ్యూను ఎత్తివేశారు. ఆ వెంటనే నిరసనలు మరింత తీవ్ర రూపం దాల్చాయి.

వాస్తవానికి నిరసనలను అడ్డుకునేందుకు.. బస్సు, రైళ్ల సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. కానీ ఆందోళనకారులు డ్రైవర్లను బెదిరిస్తున్నారు. తమను కొలంబోకి తీసుకెళ్లాలని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా ఎన్ని ఆంక్షలు ఉన్నా.. లక్షలాది మంది ప్రజలు కొలంబో వీధుల్లో దర్శనమిస్తున్నారు.

ఎందుకు ఈ సంక్షోభం..

Gotabaya Rajapaksa : కరోనా కారణంగా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ చతికిలపడింది. ఆ వెంటనే ప్రభుత్వం తన విధానాలను మార్చింది. అవి దెబ్బకొట్టాయి. ఈ పరిణామాలతో దేశంలో విదేశీ మారకం నిల్వలు అడుగంటాయి. ఫలితంగా నిత్యావసర వస్తువులను కూడా కొనుగోలు చేయలేని స్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. పరిస్థితి విషమించడంతో దేశంలోని అనేక ప్రాంతాలు అంధకారంలోకి జారుకున్నాయి. ఇంధనం దిగుమతులకు ప్రభుత్వం వద్ద నిధులు లేవు. ఫలితంగా ప్రజలు తమ ఆగ్రహాన్ని బయటపెట్టడం మొదలుపెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి, రాజపక్సను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని పదవికి మహింద రాజపక్స రాజీనామా చేశారు. అనంతరం విక్రమసింఘే ఆ బాధ్యతలు చేపట్టారు.

నెలలు గడిచినా, శ్రీలంక సంక్షోభంలో మార్పులు రావడం లేదు. ప్రజలు నిరసనలు చేస్తూనే ఉన్నారు.. సంక్షోభం ముదురుతూనే ఉంది. సాధారణ జీవితం మళ్లీ ఎప్పుడు తిరిగి వస్తుంది? అని అందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్