Sri Lanka Crisis : రెండు రోజులుగా పెట్రోల్ బంకులో శ్రీలంక క్రికెటర్ పడిగాపులు!
Sri Lanka Crisis : శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నే.. రెండు రోజుల పాటు పెట్రోల్ బంకులో పడిగాపులు కాశారు. పెట్రోల్ దొరకక ప్రాక్టీస్‌కు ఇబ్బంది పడుతున్నట్టు వెల్లడించారు.
Sri Lanka crisis : శ్రీలంక సంక్షోభంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. పెట్రోల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తాజాగా.. ఈ జాబితాలోకి శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నే కూడా చేరారు. కొలంబోలోని ఓ పెట్రోల్ బంకులో తన కారుతో రెండు రోజులుగా ఇంధనం కోసం ఎదురుచూశారు.
"ఇక్కడ ఇంధన కొరత చాలా ఉంది. రెండు రోజులు క్యూలో నిలబడిన తర్వాత లక్కీగా పెట్రోల్ దొరికింది. క్రికెట్ ప్రాక్టీస్‌కి కూడా వెళ్లలేకపోతున్నా," అని చమిక కరుణరత్నే అన్నారు.
ఈ ఏడాది ఆగస్టులో ఆసియా కప్‌కు శ్రీలంక ఆతిథ్యం వహించనుంది. కానీ ప్రస్తుతం శ్రీలంక సంక్షోభం పరిస్థితులు తీవ్రంగా ఉంది. పెట్రోల్ దొరకడం లేదు. క్రికెటర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు.
Chamika Karunaratne : "ముందు ముందు చాలా సిరీస్‌లు, లంక ప్రీమియం లీగ్‌లు ఉన్నాయి. ఆసియా కప్ కూడా వస్తోంది. కానీ పెట్రోల్ దొరకడం లేదు. ప్రాక్టీస్ కోసం కొలంబోతో సహా వివిధ ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తుంది. కానీ నేను ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను. గత రెండు రోజులు ఎక్కడికి వెళ్లలేదు. క్యూలో నిలబడ్డాను. 10వేల రూపాయిల పెట్రోల్ కొట్టించినా, రెండు- మూడు రోజులకే వస్తుందేమో!" అని చమిక కరుణరత్నే వివరించారు.
శ్రీలంక సంక్షోభంపైనా కురణరత్నే స్పందించారు.
"శ్రీలంక సంక్షోభం గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను. కానీ పరిస్థితులు సరిగ్గా లేవు. సరైన నేతను ఎన్నుకుంటే పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నా. అంతర్జాతీయ దేశాల నుంచి మద్దతు తీసుకుంటే దేశం మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది," అని శ్రీలంక క్రికెటర్ అన్నారు.
ఒక పక్క శ్రీలంక సంక్షోభం రోజురోజుకి ముదురుతున్నా.. మరో పక్క ఆ దేశంలో క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే శ్రీలంకలో ఆస్ట్రేలియా జట్టు పర్యటించింది. మూడు ఫార్మాట్లలోనూ మ్యాచ్‌లు జరిగాయి. టెస్టు సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. వన్డే సిరీస్ 3-2తో శ్రీలంక గెలుచుకుంది. టీ20 సిరీస్ 2-1తో ఆస్ట్రేలియా వశమైంది.
శ్రీలంక సంక్షోభం వేళ.. ఆ దేశంలో 1948 తర్వాత తొలిసారి ఈ స్థాయిలో ఇంధం కొరత ఏర్పడింది. దేశంలోని 10శాతం మందికి మాత్రమే రోజువారీగా ఇంధనం లభిస్తోంది.
సంబంధిత కథనం