Cobra in a cockpit: పైలట్ సీటు కిందే విష నాగు; గాలిలో ప్రయాణికుల ప్రాణాలు-south african pilot safely lands plane after cobra shows up in cockpit ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cobra In A Cockpit: పైలట్ సీటు కిందే విష నాగు; గాలిలో ప్రయాణికుల ప్రాణాలు

Cobra in a cockpit: పైలట్ సీటు కిందే విష నాగు; గాలిలో ప్రయాణికుల ప్రాణాలు

HT Telugu Desk HT Telugu
Apr 06, 2023 06:49 PM IST

Cobra in a cockpit: దక్షిణిఫ్రికా (South Africa)లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. విమానంలోని కాక్ పిట్ లో పైలట్ సీట్ కిందనే విష నాగు (Cape cobra) ముడుచుకుని ఉంది. విమానం మార్గమధ్యంలో ఉంది. ఆ పైలట్ పై ప్రాణాలు పైననే పోయాయి.

 ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Cobra in a cockpit: వివిధ వాతావరణ పరిస్థితులు, ఇంజిన్ సమస్యలు, మొదలైనవి ఎదురైన సమయాల్లో ఎలా వ్యవహరించాలని పైలట్లకు శిక్షణ సమయంలో నేర్పిస్తారు. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలని ఏ శిక్షణలోనూ నేర్పించరు. విమాన ప్రయాణంలో, మార్గ మధ్యంలో.. కాక్ పిట్ లో అదీ తాను కూర్చున్న సీటు కిందనే అత్యంత విషపూరితమైన నాగు పాము (Cape cobra) ఉందని గుర్తించిన సమయంలో పైలట్ ఎలా వ్యవహరించాలనేది భవిష్యత్తులో ఈ ఉదంతం ద్వారా పైలట్లకు శిక్షణనిస్తారు కావచ్చు.

Cobra in a cockpit: సీటుకిందనే నాగుపాము..

దక్షిణాఫ్రికా (South Africa) లో రుడాల్ఫ్ ఎరాస్మస్ (Rudolf Erasmus) ప్రైవేట్ పైలట్ (Pilot). శిక్షణ పొందిన, వందల గంటలు విమానాలు నడిపిన అనుభవం ఉన్న పైలట్. సోమవారం అతడు ఒళ్లు గగుర్పొడిచే అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఒక చిన్న విమానంలో నలుగురు ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తుండగా, తన సీటు కిందనే ఒక విష పూరితమైన నాగుపాము (Cape cobra) ఉన్నట్లు గుర్తించాడు. తన సీటు పక్కనే పెట్టుకునే వాటర్ బాటిల్ కోసం చూడగా, తన సీటు కింద ముడుచుకు కూర్చుని ఉన్న ఆ కోబ్రా (Cape cobra) కనిపించింది. సాధారణంగా ఎవరైనా ఆ సమయంలో భయాందోళనలకు గురవుతారు. తన ప్రాణాలు ఎలా కాపాడుకోవాలనే ఆలోచిస్తారు. విమానంపై నియంత్రణ కోల్పోతారు. కానీ, రుడాల్ఫ్ ఎరాస్మస్ (Rudolf Erasmus) అలా చేయలేదు. ఈ విషయాన్ని విమానంలో ప్రయాణిస్తున్న వారికి చెప్పాలా? వద్దా? అని ఒక్క క్షణం ఆలోచించాడు. నిబంధనల ప్రకారం, ఏదైనా సమస్య తలెత్తితే, ఆ విషయాన్ని ప్రయాణికులకు వివరించాలి. అందువల్ల, ఈ విషయాన్ని తనతో పాటు ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు వివరించాడు. వారిని భయపడవద్దని, గట్టిగా అరవవద్దని సూచించాడు. దగ్గర్లో ఉన్న జోహనస్ బర్గ్ విమానాశ్రయ ఏటీఎస్ ను సంప్రదించి, ఎమెర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి కోరాడు.

Cobra in a cockpit: ప్రతికూల వాతావరణంలో..

అదే సమయంలో అక్కడ దారుణమైన ప్రతికూల వాతావరణం నెలకొని ఉంది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంది. చిమ్మచీకటి నెలకొని ఉంది. ఏటీఎస్ నుంచి అనుమతి వచ్చిన తరువాత తన నైపుణ్యాన్నంతా ఉపయోగించి, క్షేమంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. మొదట ప్రయాణికులను విమానం నుంచి దింపేశాడు. ఆ తరువాత తాను దిగాడు. ఇంత దారుణ మైన పరిస్థితుల్లో విమానాన్ని క్షేమంగా ల్యాండ్ చేయడంపై రుడాల్ఫ్ ఎరాస్మస్ (Rudolf Erasmus) కు పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. ట్విస్ట్ ఏంటంటే, ఆ కోబ్రా (Cape cobra) ను పట్టుకోవడానికి విమానాశ్రయ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అది మళ్లీ మాయమయింది.

Whats_app_banner