Storm in Saudi Arabia: భారీ వర్షాలతో అరబ్ దేశం అస్తవ్యస్తం-saudi storm closes schools cuts main road to mecca ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Storm In Saudi Arabia: భారీ వర్షాలతో అరబ్ దేశం అస్తవ్యస్తం

Storm in Saudi Arabia: భారీ వర్షాలతో అరబ్ దేశం అస్తవ్యస్తం

HT Telugu Desk HT Telugu
Nov 25, 2022 03:07 PM IST

Storm in Saudi Arabia: పశ్చిమాసియాలోని అరబ్ దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా భారీ వర్షాలతో తల్లడిల్లుతోంది. ముఖ్యంగా తీర నగరం జెడ్డాలో వర్ష బీభత్సం అధికంగా ఉంది.

సౌదీ అరేబియాలోని జెడ్డాలో భారీ వర్షాల కారణంగా రహదారులపై నిలిచిన నీరు
సౌదీ అరేబియాలోని జెడ్డాలో భారీ వర్షాల కారణంగా రహదారులపై నిలిచిన నీరు (AFP)

Storm in Saudi Arabia: సౌదీ అరేబియాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాధారణ జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. గురువారం దాదాపు రోజంతా కురిసిన కుంభ వృష్టితో రహదారులు జలమయమయ్యాయి.

Storm in Saudi Arabia: జెడ్డాపై అధిక ప్రభావం

సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఒకటైన జెడ్డా పై ఈ వర్షాల ప్రభావం అధికంగా ఉంది. భారీ వర్షాల కారణంగా నగరంలో పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. నగరంలోని విమానాశ్రయం నుంచి వెళ్లే పలు విమానాలను రద్దు చేశారు. చాలా విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. జెడ్డా నుంచి పవిత్ర మక్కా కు వెళ్లే రహదారి దాదాపు నీట మునగడంతో, ఆ రోడ్డును తాత్కాలికంగా మూసేశారు. కాలువలుగా మారిన రోడ్లు, ట్రాఫిక్ జామ్ లు, రోడ్డుపై నీటిపై సగం మునిగిపోయిన వాహనాల ఫొటోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.

Storm in Saudi Arabia: విమాన ప్రయాణీకులకు సూచన

విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతుండడంతో, ప్రయాణీకులు, ఏర్ పోర్ట్ కు బయల్దేరే ముందు సంబంధిత ఏర్ లైన్స్ తో సంప్రదించి, వివరాలు తెలుసుకోవాలని జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం సూచనలు జారీ చేసింది. రెడ్ సీ తీరంలో ఉన్న జెడ్డాతో పాటు రాబిఘ్, ఖులాయిస్ పట్టణాల్లోనూ వర్ష బీభత్సం అధికంగా ఉంది. ఆ పట్టణాల్లో కూడా పాఠశలలకు సెలవు ప్రకటించారు.

Storm in Saudi Arabia: అర్జెంటీనాపై విజయంతో..

మరో అరబ్ దేశం ఖతార్ లో ప్రస్తుతం ఫుట్ బాల్ వరల్డ్ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీల్లో అనూహ్యంగా స్టార్ టీమ్ అర్జెంటీనాపై సౌదీ అరేబియా విజయం సాధించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని సౌదీ కింగ్ సల్మాన్ ఒకరోజు సెలవు ప్రకటించాడు. ఏటా సౌదీ అరేబియాలో శీతాకాలంలో కురిసే వర్షాలు జనజీవనాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. 2009లో సౌదీలో భారీ వర్షాల కారణంగా 123 మంది చనిపోగా, 2010లో 135 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

Whats_app_banner

టాపిక్