Ukraine Crisis | ఇళ్లపై 500 కిలోల బాంబులు.. 18 మంది మృతి-russia attacked residential areas in sumy with 500 kg bombs says ukraine ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ukraine Crisis | ఇళ్లపై 500 కిలోల బాంబులు.. 18 మంది మృతి

Ukraine Crisis | ఇళ్లపై 500 కిలోల బాంబులు.. 18 మంది మృతి

Hari Prasad S HT Telugu
Mar 08, 2022 02:57 PM IST

ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో సాధారణ పౌరులు నివసించే ఇళ్లపై రష్యా 500 కేజీల బాంబులు వేసిందని ఉక్రెయిన్‌ సాంస్కృతిక శాఖ వెల్లడించింది. రష్యన్‌ ఆర్మీ మరో నేరానికి పాల్పడిందని ఆరోపించింది.

<p>ఉక్రెయిన్ జనావాసాలపై రష్యా వేసిన 500 కిలోల పేలని బాంబు</p>
ఉక్రెయిన్ జనావాసాలపై రష్యా వేసిన 500 కిలోల పేలని బాంబు (Kuleba Twitter)

కీవ్‌: ఉక్రెయిన్‌లోని జనావాసాలపైనా రష్యా బాంబుల వర్షం కురిపిస్తోందని గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌ ఆరోపిస్తూ వస్తున్న విషయం తెలుసు కదా. తాజాగా రష్యన్‌ ఆర్మీ అక్కడి సుమీ నగరంలోని ఇళ్లపై ఏకంగా 500 కిలోల బాంబులు వేసిందని ఉక్రెయిన్‌ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్‌లో వెల్లడించింది. 

ఇందులో ఇద్దరు చిన్నారులు సహా 18 మంది మరణించినట్లు చెప్పింది. ఇది రష్యన్‌ ఆర్మీ చేసిన మరో నేరమని మండిపడింది. ఇలాంటిదే 500 కేజీల బాంబుకు సంబంధించిన ఫొటోను ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రీ కులేబా కూడా ట్విటర్‌లో షేర్‌ చేశారు. చెన్నిహివ్‌లో రష్యన్‌ ఆర్మీ ఈ బాంబు వేసింది. అయితే ఈ బాంబు పేలలేదు. 

అయితే ఇలాంటి బాంబులతో ఎంతోమంది అమాయకులను రష్యా చంపుతోందని, రష్యా చేస్తున్న ఈ అనాగరిక చర్యల నుంచి తమ పౌరులను రక్షించుకునేందుకు సాయం చేయాలని ఆ ట్వీట్‌లో కులేబా కోరారు. ఉక్రెయిన్‌ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని, తమకు కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఇవ్వాలని కోరారు. సోమవారం రాత్రి తూర్పు, మధ్య ఉక్రెయిన్‌లో రష్యా బాంబు దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్‌ అధికారులు చెప్పారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్