attack on RTI activist: ఆర్టీఐ కార్యకర్తను కారుతో ఢీకొట్టిన ఇసుక వ్యాపారి..
attack on RTI activist: అక్రమ ఇసుక వ్యాపారి, భూముల కబ్జా ఆరోపణలు ఉన్న ఓ వ్యక్తి ఆర్టీఐ కార్యకర్త ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈఘటనలో ఆర్టీఐ కార్యకర్త కుమారుడు మరణించాడు.
భుజ్, అక్టోబరు 6: సమాచార హక్కు చట్టం కార్యకర్త ప్రయాణిస్తున్న స్కూటర్‌ను అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి ఎస్‌యూవీతో ఢీకొట్టడంతో ఆ కార్యకర్త కుమారుడు అక్కడికక్కడే మరణించాడు. ఆర్టీఐ కార్యకర్త తీవ్ర గాయాలపాలయ్యాడు. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో అక్టోబరు 3న ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడిని అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
లఖ్‌పత్ తహసీల్‌లోని మేఘపర్ గ్రామానికి చెందిన ఆర్టీఐ కార్యకర్త రమేష్ బలియా అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారంటూ నవల్‌సిన్హ్ జడేజాపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అక్టోబర్ 3న బలియా, అతని కుమారుడు నరేంద్ర సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో దయాపర్ గ్రామాన్ని సందర్శించి ఇంటికి తిరిగి వస్తుండగా, జడేజా ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ వారిని వెనుక నుండి ఢీకొట్టి వారిపైకి దూసుకెళ్లింది.
నరేంద్ర బలియా అక్కడికక్కడే మృతి చెందగా, అతని తండ్రిని చికిత్స కోసం భుజ్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు నారా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎ మహేశ్వరి తెలిపారు.
జడేజాపై హత్య ఆరోపణతో పాటు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
ఘటన జరిగిన ఒక రోజు తర్వాత స్థానిక క్రైమ్ బ్రాంచ్ బృందం జడేజాను అరెస్టు చేసింది. కోర్టు బుధవారం అతడిని ఒకరోజు పోలీసు కస్టడీకి పంపిందని పోలీసు అధికారి తెలిపారు.
అక్రమ ఇసుక తవ్వకాలపై స్థానిక గనులు, ఖనిజాల శాఖలో తనపై ఫిర్యాదు చేసినందుకు జడేజా బలియాపై పగ పెంచుకున్నాడని ఇన్‌స్పెక్టర్ మహేశ్వరి తెలిపారు. జడేజాపై భూకబ్జా ఆరోపణలు కూడా ఉన్నాయని, తదుపరి విచారణ కొనసాగుతోందని ఆయన చెప్పారు.
టాపిక్