Ramdev's sexist comment sparks row: మహిళలపై బాబా రామ్ దేవ్ చిల్లర వ్యాఖ్యలు
Ramdev's sexist comment sparks row: యోగా గురు బాబా రామ్ దేవ్ మరోసారి అనుచిత వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. ఈ సారి మహిళలను అవమానించేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
Ramdev's sexist comment sparks row: మహారాష్ట్రలోని థానెలో శుక్రవారం ఒక యోగా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా యోగా గురు బాబా రామ్ దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళలపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. వేదికపై పక్కన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృత ఫడణవీస్ ఉండగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Ramdev's sexist comment sparks row: వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు
యోగా కార్యక్రమానికి వచ్చిన మహిళల వస్త్రధారణపై బాబా రామ్ దేవ్ అభ్యంతర కర వ్యాఖ్యలు చేశారు. ‘మీరు చీర ధరించినా బావుంటారు. అమృతజీలాగా సల్వార్ సూట్ ధరించినా అందంగా ఉంటారు. అలాగే, ఏం ధరించకపోయినా బావుంటారు’ అని బాబా రామ్ దేవ్ అక్కడ ఉన్న మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో వేదికపై బాబా రామ్ దేవ్ పక్కన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృత ఫడణవీస్ కూడా ఉన్నారు. అలాగే, ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే కూడా అప్పుడు అక్కడే ఉన్నారు.
Ramdev's sexist comment sparks row: రామ్ దేవ్ క్షమాపణలు చెప్పాలి
మహిళలు నగ్నంగా ఉన్నా అందంగా ఉంటారంటూ బాబా రామ్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలీవాల్ మండిపడ్డారు.యోగా క్యాంప్ లో బాబా రామ్ దేవ్ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అయింది. ఆ వీడియోను షేర్ చేస్తూ మహిళలను అవమానించిన బాబా రామ్ దేవ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని స్వాతి మలీవాల్ డిమాండ్ చేశారు. రామ్ దేవ్ వ్యాఖ్యలను అందరూ ఖండించాలన్నారు. ఈ ఘటనపై శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ స్పందించారు. రామ్ దేవ్ అనుచిత వ్యాఖ్యలను అప్పుడు అక్కడే ఉన్న అమృత ఫడణవీస్ ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు. ‘‘శివాజీపై గవర్నర్ అనుచిత వ్యాఖ్యలు చేసినా మాట్లాడరు. మహారాష్ట్ర గ్రామాలను లాక్కుంటామని కర్నాటక బెదిరించినా మాట్లాడరు. ఇప్పుడు బాబా రామ్ దేవ్ మహిళలను అవమానించినా మాట్లాడరు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమ నాలుకలను ఢిల్లీలో తాకట్టు పెట్టి వచ్చారా?’’ అని సంజయ్ రౌత్ మండిపడ్డారు.
టాపిక్