Ram Mandir ceremony: అయోధ్య రామాలయంలో కొలువుతీరనున్న బాల రాముడిని కనులారా చూడండి..
Ram Mandir ceremony: జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ చేసుకోబోతున్న బాల రాముడి విగ్రహం ఫొటోను విడుదల చేశారు. కళ్లకు మాత్రం గంతలు కట్టిన 51 అంగుళాల విగ్రహం ఫొటో క్షణాల్లో వైరల్ గా మారింది.
Ayodhya Ram Temple news: : అయోధ్య రామజన్మభూమి ఆలయంలో ప్రతిష్టించబోతున్న రామ్ లల్లా విగ్రహం ముఖ భాగాన్ని శుక్రవారం బహిర్గతం చేశారు. జనవరి 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో ఈ విగ్రహానికే ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుకకు కేవలం మూడు రోజుల ముందు రామ్ లల్లా విగ్రహం యొక్క మొదటి చిత్రం బయటకు వచ్చింది.
విశ్వహిందూ పరిషత్ (VHP) విడుదల చేసిన ఈ చిత్రంలో రామ్ లల్లా నిలబడి ఉన్న భంగిమలో ఉన్నారు. నల్లరాతితో చెక్కిన ఈ విగ్రహం కళ్లను పసుపు రంగు వస్త్రంతో కప్పి ఉంచారు. విగ్రహాన్ని గులాబీల దండతో అలంకరించారని VHP ఆఫీస్ బేరర్ శరద్ శర్మ తెలిపారు.
51 అంగుళాల విగ్రహం
51 అంగుళాల రాముడి విగ్రహాన్ని బుధవారం రాత్రి ఆలయానికి తీసుకువచ్చారు. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని చెక్కారు. గురువారం మధ్యాహ్నం రామజన్మభూమి ఆలయంలోని గర్భగుడిలో శ్రీరాముని కొత్త విగ్రహాన్ని ఉంచారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం, ప్రార్థనల మంత్రోచ్ఛారణల మధ్య ఇది జరిగింది.
జనవరి 22న..
జనవరి 22న రామ మందిరంలో 51 అంగుళాల బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ఆహ్వానితులు హాజరుకానున్నారు. మరుసటి రోజు నుంచి ఆలయాన్ని ప్రజల కోసం తెరవాలని భావిస్తున్నారు. ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ, జనవరి 22న మధ్యాహ్నం 12:20 గంటలకు పవిత్రోత్సవం ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 1 గంటకు పూర్తవుతుందని భావిస్తున్నామని తెలిపారు. ఆలయంలో సంప్రోక్షణ ఆచారాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.