Funds to Prashant kishor: జగన్ సహా పాత క్లయింట్ల నుంచి పీకేకు ఆర్థిక సాయం-prashant kishor hints that he is being aided by former clients ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Funds To Prashant Kishor: జగన్ సహా పాత క్లయింట్ల నుంచి పీకేకు ఆర్థిక సాయం

Funds to Prashant kishor: జగన్ సహా పాత క్లయింట్ల నుంచి పీకేకు ఆర్థిక సాయం

HT Telugu Desk HT Telugu
Oct 27, 2022 08:41 AM IST

Funds to Prashant kishor: తన సాయంతో ముఖ్యమంత్రులుగా ఎదిగిన ఆరుగురి నుంచి తనకు ఆర్థిక సాయం అందుతున్నట్టు ప్రశాంత్ కిశోర్ హింట్ ఇచ్చారు.

జన్ సురాజ్ ప్రచారంలో ప్రశాంత్ కిశోర్
జన్ సురాజ్ ప్రచారంలో ప్రశాంత్ కిశోర్ (HT_PRINT)

పాట్నా: రాజకీయ వ్యూహకర్త నుండి కార్యకర్తగా మారిన ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో తన 'జన్ సురాజ్ ప్రచారానికి' తన మాజీ క్లెయింట్ల నుండి ఆర్థిక సహాయం అందుకున్నట్టు చెప్పారు. వీరిలో చాలా మంది ఇప్పుడు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నారని పేర్కొన్నారు.

బీహార్ రాజధానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండో-నేపాల్ సరిహద్దు సమీపంలో గల వాల్మీకి నగర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు.

ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2 నుండి 'పాదయాత్ర' చేస్తున్నారు. పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా పరిణామం చెందకముందే తన సొంత రాష్ట్రంలోని ప్రతి మూలనూ తాకుతూ 3,500 కిలోమీటర్లు కాలినడక చేపట్టాలని భావిస్తున్నారు.

ప్రశాంత్ కిశోర్ చేస్తున్న కార్యక్రమాలకు నిధులెక్కడివి అని బీహార్‌లోని జేడీయూ ప్రశ్నిస్తూ వస్తోంది. ఇక జేడీయూ జాతీయ అధ్యక్షుడు ఇటీవల పలు ఆరోపణలు చేశారు. రెండు నెలల క్రితమే బీహార్‌లో అధికారం కోల్పోయిన బీజేపీ నుంచే ప్రశాంత్ కిశోర్‌కు నిధులు వస్తున్నాయని ఆరోపించారు.

పరోక్షంగా వీటికి సమాధానాలు ఇస్తూ ‘గత దశాబ్ద కాలంగా, నేను కనీసం 10 ఎన్నికలకు నా సేవలను అందించాను. ఒకదానిలో మినహా అన్నింటిలో విజయం సాధించాను’ అని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు.

‘నేను గెలవడానికి సహాయం చేసిన కనీసం ఆరుగురు ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మీడియా నన్ను నమ్మకపోయినా నేను వారి నుండి డబ్బు తీసుకోలేదు. కానీ ఇప్పుడు బీహార్‌లో మేం చేస్తున్న ప్రయోగానికి నేను వారి సహాయం కోరుతున్నాను’ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

2014లో తొలిసారిగా నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ప్రశాంత్ కిశోర్ పాపులర్ అయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి సంచలన విజయాన్ని అందించడంలో ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ గత సంవత్సరం వృత్తిపరమైన రాజకీయ కన్సల్టెన్సీ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు.

అతని ఇతర మాజీ క్లయింట్‌లలో వరుసగా ఢిల్లీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు అమరీందర్ సింగ్ కూడా కాంగ్రెస్ తరపున పంజాబ్‌ ముఖ్యమంత్రిగా విజయం సాధించడంలో సహాయం చేశారు.

‘నేను బీహార్‌లో ఎవరి దగ్గరా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. హెలికాప్టర్ ప్రయాణాలు, భారీ వేదికలు ఏర్పాటు చేయడం, ప్రకటనలు ఇవ్వడం, జనాలను తరలించడం వంటి ఖర్చులు తన ప్రచారంలో లేవు. మేం ఇంకా రాజకీయ పార్టీ కాదు. కానీ మేం ఆ స్థితికి చేరుకున్న తర్వాత, బీహార్‌లోని రెండు కోట్ల కుటుంబాల నుండి కేవలం రూ. 100 విరాళం కోరుతాం. అది మాకు సహాయపడుతుంది’ అని 45 ఏళ్ల ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ఇతర పార్టీలతో చేతులు కలిపే అవకాశాన్ని తోసిపుచ్చారు.

Whats_app_banner