`Maha` political crisis.. live | మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం.. లైవ్ అప్‌డేట్స్
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పతనం అంచున ఉంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే వెనుక 33 మంది సేన ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. లైవ్ అప్‌డేట్స్.. మీ కోసం!
Wed, 22 Jun 202205:08 PM IST
మళ్లీ `మాతోశ్రీ`కి ఉద్ధవ్
పార్టీలో, ప్రభుత్వంలో సంక్షోభం ఎదుర్కొంటున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అధికారిక నివాసం నుంచి తిరిగి స్వగృహం మాతోశ్రీ`కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు బుధవారం, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన `మాతో శ్రీ`కి వెళ్లారు. మాతో శ్రీకి వెళ్లనున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే బుధవారం ఉదయమే ప్రకటించారు. శివసేనలో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు నేపథ్యంలో ఉద్ధవ్ అధికారిక నివాసం నుంచి వెళ్లిపోవడం సంచలనంగా మారింది. కార్లో `మాతోశ్రీ`కి ఉద్ధవ్ వెళ్తున్న దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయబోవడం లేదని శివసేన నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. మరోవైపు, శివసేనకు చెందిన మరో నలుగురు ఎమ్మెల్యేలు షిండే క్యాంప్‌లో చేరారు.
Wed, 22 Jun 202203:52 PM IST
ఆ అసహజ మైత్రి వీడాలి
మహారాష్ట్ర ప్రయోజనాల కోసం అధికార కూటమి నుంచి శివసేన వైదొలగాలని తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే డిమాండ్ చేశారు. సైద్ధాంతికంగా ప్రత్యర్థి పక్షమైన కాంగ్రెస్, ఎన్సీపీలతో శివసేనది సహజ మైత్రి కాదని, అది అసహజ కూటమి అని ఆయన ఒక ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. మహా వికాస్ అఘాడీ పాలనలో కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలే లాభపడ్డారని, శివసైనికులు అన్ని రకాలుగా నష్టపోయారని విమర్శించారు. మహారాష్ట్రలో శివసేన నిలబడాలంటే కాంగ్రెస్, ఎన్సీపీలకు దూరం కావాల్సిందేనన్నారు.
Wed, 22 Jun 202202:53 PM IST
శివసేన నాదే: ఏక్‌నాథ్ షిండే
శివసేనలో మెజారిటీ ఎమ్మెల్యేలు తనవైపే ఉన్నారని ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. ఈ మేరకు తిరుగుబాటు ఎమ్మెల్యేలు గవర్నర్‌కు లేఖ రాశారు. ఆ లేఖపై 34 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తమవైపు ఉన్నందున నిజమైన శివసేన తమదేనని షిండే తేల్చిచెప్పారు. అందువల్ల, ఎమ్మెల్యేలంతా బుధవారం సాయంత్రం సమావేశానికి హాజరుకావాలని ఉద్ధవ్ ఠాక్రే ఇచ్చిన ఆదేశాలు చెల్లబోవన్నారు. ఆ సమావేశానికి కూడా చట్టబద్ధత లేదన్నారు. పార్టీకి న్యాయమైన నాయకుడిని తానేనని గవర్నర్‌కు పంపిన లేఖలో షిండే పేర్కొన్నారు. అయితే, శివసేనకు చట్టబద్ధమైన నాయకుడిగా గుర్తింపు లభించాలంటే షిండేకు కనీసం 37 మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి.
Wed, 22 Jun 202201:59 PM IST
`రాజీనామా పత్రం రెడీగా ఉంది`
ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడడం లేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. రాజీనామా పత్రం సిద్ధంగా ఉందని, ఎప్పుడు అవసరమైతే, అప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. శివసైనికులు ఎవరైనా సీఎం కావచ్చని స్పష్టం చేశారు. కాగా, సంక్షోభం నేపథ్యంలో.. బుధవారం రాత్రి పార్టీ నేతలు సుప్రియ సూలే, జితేంద్ర ఆవడ్‌లతో కలిసి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వచ్చారు.
Wed, 22 Jun 202201:21 PM IST
`హిందుత్వ`ను వీడలేదు
హిందుత్వ సిద్ధాంతాన్ని, హిందుత్వ మార్గాన్ని శివసేన వదిలేసిందన్న ఆరోపణలు సరికాదని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ``ఇది బాలా సాహెబ్ శివసేన కాదని కొందరు అంటున్నారు. బాలాసాహెబ్ ఆలోచనలేమిటో వారికి తెలియదు. శివసేన ఎన్నటికీ మారదు. అప్పటి శివసేననే ఇప్పుడూ ఉంది. హిందుత్వం శివసేన ప్రాణం. హిందుత్వం శివసేన ఆదర్శం. ఆ మార్గాన్ని శివసేన ఎన్నటికీ వీడదు. హిందుత్వనే శివసేన బలం, సిద్ధాంతం, గుర్తింపు`` అని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. శివసైనికుడిగా తాను ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదన్నారు. కానీ, సొంత మనుషులే ఇప్పుడు తనకు వ్యతిరేకంగా మాట్లాడడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Wed, 22 Jun 202201:16 PM IST
`సీఎం కావాలనుకోలేదు`
2019లో తాను సీఎం కావాలనుకోలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నన్ను సీఎంగా ఉండాలన్నారు. అప్పటివరకు నాకు ఆ ఆలోచన లేదు. అప్పుడు, ఆ తరువాత కూడా శరద్ పవార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాకు ఎంతో సహకరించారు` అని ఠాక్రే పేర్కొన్నారు. ఇప్పుడు కూడా తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరైనా తన ముందుకు వచ్చి చెబితే.. సీఎం పదవే కాదు శివసేన అధ్యక్ష పదవి కూడా వదులుకుంటానని స్పష్టం చేశారు. సూరత్‌లోనో, అస్సాంలోనే క్యాంప్ వేయాల్సిన అవసరం ఏమిటని తిరుగుబాటు ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.
Wed, 22 Jun 202201:12 PM IST
`నేను చేసిన నేరమేంటి?`
మహారాష్ట్ర ప్రభుత్వంలో, శివసేన పార్టీలో నెలకొన్న సంక్షోభంపై ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బుధవారం సాయంత్రం స్పందించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల ఆరోపణలను ఆయన తిప్పి కొట్టారు. ఒక్క ఎమ్మెల్యే కాదన్నా.. ముఖ్యమంత్రిగానే కాదు.. శివసేన చీఫ్‌గా కూడా కొనసాగబోనని తేల్చి చెప్పారు. తన వద్దకు వచ్చి, మాట్లాడాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలను కోరారు. తాను చేసిన నేరమేమిటో తనకే వివరించాలని కోరారు. కొందరు తిరుగుబాటు ఎమ్మెల్యేలు టచ్‌లోకి వచ్చారని, తమను బలవంతంగా తీసుకువెళ్లారని ఆరోపించారని సీఎం ఠాక్రే వెల్లడించారు. అనారోగ్య కారణాలతో కొన్నాళ్లుగా ఎవరినీ కలవలేదని, ఇకపై అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
Wed, 22 Jun 202211:49 AM IST
ఉద్ధవ్ ఠాక్రే కరోనా టెస్ట్ నెగటివ్
మహారాష్ట్రలో ఒకవైపు రాజకీయ సంక్షోభం తలెత్తగా, మరోవైపు కరోనా విజృంభిస్తోంది. తాజాగా, గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ కరోనా బారిన పడ్డారు. కోష్యారీకి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన బుధవారం ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేరారు. మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు కూడా కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు బుధవారం ఉదయం రాపిడ్ యాంటిజెన్ కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఒక్కసారిగా శివసేన వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఒకవైపు ప్రభుత్వం కూలిపోయే స్థాయిలో సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో ముఖ్య నేతకు కరోనా సోకితే, ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఎలా అన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే, ఆ తరువాత ఠాక్రేకు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలో ఆయనకు కరోనా నెగటివ్‌గా తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Wed, 22 Jun 202211:40 AM IST
`ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోంది`
శివసేన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పార్టీ నాయకత్వంపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రభుత్వంలో అవినీతి దారుణమైన స్థాయికి చేరిందని, సైద్ధాంతికంగా శత్రువులైన వారితో కలిసి అధికారాన్ని పంచుకోవడం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని బుధవారం ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానంపై 34 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. క్షేత్రస్థాయిలో శివసేన కార్యకర్తలపై ఎన్సీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వంలో నెలకొన్న అవినీతిపై ఎమ్మెల్యేలు, ప్రజలు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉందని వివరించారు. నేర, అవినీతి ఆరోపణలపై జైళ్లో ఉన్న మంత్రులు అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్‌ల ఉదాహరణలను వారు తీర్మానంలో చూపారు. ప్రత్యర్థి పక్షంతో అధికారం పంచుకుని శివసేన సిద్ధాంతాలపై రాజీపడ్డారని ఉద్ధవ్ పై ఆరోపణలు చేశారు.
Wed, 22 Jun 202209:24 AM IST
సేనతో చర్చల ఆలోచన లేదు
ఏక్‌నాథ్ షిండే సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నమన్న శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై షిండే స్పందించారు. ఇప్పటికైతే, శివసేన నాయకులతో చర్చల ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జరిగే శివసేన ఎమ్మెల్యేల భేటీకి ఎమ్మెల్యేలంతా హాజరుకావాలన్న సేన ఆదేశాల పర్యవసానాలపై చర్చించడానికి, అస్సాంలోని గువాహటిలోని ఒక హోటల్ లో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు.
Wed, 22 Jun 202209:20 AM IST
కేబినెట్ భేటీలో ప్రశాంతంగా సీఎం ఠాక్రే
మహారాష్ట్రలో కేబినెట్ భేటీ ముగిసింది. అసెంబ్లీని రద్దు చేయాలని గవర్నర్‌ను కోరాలనే ప్రతిపాదనపై చర్చించారు. కానీ, నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. సమావేశంలో సీఎం ప్రశాంతంగా కనిపించారని, ఆయనలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని పలువురు మంత్రులు తెలిపారు. కాగా, ఈ కేబినెట్ భేటీకి ఏక్‌నాథ్ షిండే సహా 8 మంది మంత్రులు గైర్హాజరయ్యారు. మరోవైపు, ఈ రోజు 5 గంటలకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసంలో శివసేన ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని, హాజరు కాని పక్షంలో, పార్టీని ధిక్కరించినట్లుగా భావించాల్సి వస్తుందని శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు స్పష్టంచేశారు.