underwater metro: కోల్ కతాలో అండర్ వాటర్ మెట్రో సర్వీస్ ప్రారంభం; హుగ్లీ నదిలో 30 మీ లోతున మెట్రో స్టేషన్
Kolkata underwater metro: భారత దేశ ప్రగతి ప్రయాణంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. నదీ గర్భాన మెట్రో రైలు మార్గాన్ని నిర్మించారు. కోల్ కతాలో హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ వరకు 4.8 కిలోమీటర్ల ఈస్ట్-వెస్ట్ మెట్రోను రూ.4,965 కోట్లతో నిర్మించారు.
పశ్చిమ బెంగాల్లోని కోల్ కతా - హౌరాలను కలిపే భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో మార్గాన్ని, దేశవ్యాప్తంగా రూ .15,400 కోట్ల విలువైన ఇతర కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ వరకు 4.8 కిలోమీటర్ల ఈస్ట్-వెస్ట్ మెట్రోను రూ.4,965 కోట్లతో నిర్మించారు. ఈ కారిడార్లో భారతదేశంలో అత్యంత లోతైన మెట్రో స్టేషన్ హౌరా - 30 మీటర్ల వద్ద ఉంటుంది.
హౌరా వద్ద 30 మీటర్ల లోతున..
"ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్ (East-West metro corridor) హుగ్లీ నది క్రింద భారతదేశంలో మొదటి నదీ రవాణా సొరంగంగా ప్రత్యేకతను కలిగి ఉంది. ఇది 520 మీటర్ల పొడవు, 13 మీటర్ల లోతున ఉంది. గరిష్టంగా హౌరా వద్ద 30 మీటర్ల లోతున ఇక్కడి మెట్రో స్టేషన్ ఉంటుంది. ప్రయాణికులకు అండర్ వాటర్ ప్రపంచం అనే భావన కలిగించేందుకు సొరంగాల లోపలి భాగాన్ని ప్రత్యేకంగా నీలిరంగు లైట్లతో ప్రకాశింపజేశారు. లోపలి గోడలపై కనీసం 40 ప్రకాశవంతమైన చేపల బొమ్మలను ఏర్పాటు చేశారు. ఈ అండర్ వాటర్ సెక్షన్ లో కొన్ని స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు" అని కోల్ కతా మెట్రో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
అండర్ వాటర్ టన్నెల్ ముఖ్యాంశాలు
• ఇది కోల్ కతాలోని ఈస్ట్-వెస్ట్ మెట్రోలో భాగం. హుగ్లీ నదికి పశ్చిమ ఒడ్డున ఉన్న హౌరా నుండి తూర్పున ఉన్న సాల్ట్ లేక్ సిటీని కలిపే మెట్రో మార్గం ఇది. ఈ రెండు స్టేషన్ల మధ్య 16.5 కిమీల దూరం ఉంటుంది.
- నీటి అడుగున రైళ్లు నడవడం భారత్ లో ఇదే తొలిసారి.
• ఈ మార్గంలో 10.8 కిలోమీటర్లు భూగర్భంలో ఉండగా, 5.75 కిలోమీటర్లు వయాడక్ట్ పై ఉంటుంది.
• 300 సంవత్సరాల చరిత్ర కలిగిన చారిత్రక నగరమైన కోల్ కతాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి దోహదపడటం దీని లక్ష్యం.
• ఈ విభాగంలో భాగమైన హౌరా మెట్రో స్టేషన్ భారతదేశంలో అత్యంత లోతైన మెట్రో స్టేషన్ అవుతుంది.
• హుగ్లీ నది కింద ఉన్న 520 మీటర్ల దూరాన్ని మెట్రో 45 సెకన్లలో చేరుకోగలదు.
PM Modi: వారం రోజుల్లో రెండు సార్లు ప్రధాని పర్యటన
రాబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi) ఈ నెలలో రెండవసారి కోల్ కతాలో పర్యటించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మార్చి 1న బెంగాల్ వచ్చిన ప్రధాని మోదీ హుగ్లీ జిల్లా ఆరాంబాగ్, నదియా జిల్లాలోని కృష్ణానగర్లో జరిగిన రెండు భారతీయ జనతా పార్టీ (BJP) ర్యాలీల్లో ప్రసంగించారు. ఇదే సందర్భంగా భారతదేశం అంతటా పలు కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. వీటిలో తూర్పు కోల్ కతాలోని కవి సుభాష్ నుండి హేమంత ముఖోపాధ్యాయ వరకు 5.4 కిలోమీటర్ల కొత్త మెట్రో కారిడార్, మజేర్హట్ వరకు పర్పుల్ లైన్ మెట్రో 1.2 కిలోమీటర్ల పొడిగింపు మొదలైనవి ఉన్నాయి. పింప్రి చించ్వాడ్ మెట్రో-నిగ్డి మధ్య పూణే మెట్రో రైల్స్ ప్రాజెక్టు ఫేజ్ 1 విస్తరణకు ఆయన శంకుస్థాపన చేశారు.
హౌరా మైదాన్ నుంచి సాల్ట్ లేక్ సెక్టార్ 5 వరకు
హౌరా మైదాన్ నుంచి సాల్ట్ లేక్ సెక్టార్ 5 వరకు మొత్తం ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్ (Kolkata underwater metro) త్వరలోనే అందుబాటులోకి రానుందని కోల్ కతా మెట్రో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రెండు రైల్వే స్టేషన్లైన సీల్దా మరియు హౌరా స్టేషన్లను కలుపుతుంది. కోల్ కతా మెట్రో (Kolkata metro) భారతదేశంలో మొట్టమొదటి మెట్రో వ్యవస్థ, ఇది 1984 అక్టోబర్ 24 న అందుబాటులోకి వచ్చింది.