WWE రేంజ్లో 'పిల్లో ఫైటింగ్' ఛాంపియన్షిప్.. వీడియో వైరల్
Pillow fight championship | అమెరికాలోని ఫ్లోరిడాలో పిల్లో ఫైటింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. పోటీదారులు.. బాక్సింగ్ రింగ్‌లోకి వెళ్లి పిల్లోలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. అంపైర్ కూడా ఉన్నారు. దీనిపై నెటిజెన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
'పిల్లో ఫైట్..' అన్నదమ్ములు, అక్కాచెళ్లెల్లు తెగ ఆడేసుకునే ఆట! ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. చిన్నపిల్లలు అలా ఆడుకుంటూ కనిపిస్తే.. పెద్దలు సంబరపడిపోతారు. అయితే ఇదే పిల్లో ఫైట్‌ను అమెరికా సీరియస్‌గా తీసుకుంది. ఏకంగా.. డబ్ల్యూడబ్ల్యూఈ రేంజ్లో పిల్లో ఫైటింగ్ ఛాంపియన్షిప్(పీఎఫ్సీ) నిర్వహించేసింది.
ఫ్లోరిడాలో జనవరి 29న ఈ పీఎఫ్సీ జరిగింది. 24మంది ఇందులో పోటీపడ్డారు. వీరిలో 16మంది పురుషులు, 8మంది మహిళలు. ఈ ఫైట్ కోసం ప్రత్యేకంగా పిల్లోలు తయారు చేశారు. పోటీదారులు శిక్షణ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత.. బాక్సింగ్ రింగ్‌లోకి వెళ్లి, రెండు చేతుల్లో పిల్లోను పట్టుకుని, ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఈ పోటీలకు అంపైర్లు, కామెంట్రీ కూడా ఉండటం విశేషం. చివరికి.. మహిళల పోటీల్లో ఎస్టెలా నూనెస్, పురుషుల విభాగంలో హోలీ టెల్మాన్ విజేతలుగా నిలిచారు. వీరికి 5వేల డాలర్లతో పాటు ఓ బెల్ట్ కూడా దక్కింది.
పే-పర్-వ్యూ పద్ధతిలో పోటీలను వీక్షించేందుకు అనుమతులిచ్చారు. మంచి ఆదరణ లభించింది. ఫలితంగా భవిష్యత్తులో ఇలాంటి పోటీలు మరిన్ని ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ఆసక్తిగా ఉన్నారు.
'పిల్లో ఫైట్' వార్త విన్న నెటిజెన్లు.. తెగ సంబరపడిపోతున్నారు. పోటీలకు అనుకూలంగా స్పందిస్తున్నారు. 'ఇన్నేళ్లుగా నేను దేవుడిని కోరుకుంటున్నది ఇదే,' అంటూ ఒకరు ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఇండియాలో ఈ పోటీలు ఎప్పుడు జరుగుతాయి? అని ఇంకో నెటిజన్ సరదా ప్రశ్న విసిరాడు.