Old Pension Scheme: ఓపీఎస్ కోసం గళమెత్తిన ఉద్యోగులు: ఉజ్జయినిలో భారీగా పెన్షన్ మహా కుంభమేళా
Pension Kumbh mela: ఉజ్జయినిలో పెన్షన్ మహా కుంభమేళా జరిగింది. పాత పెన్షన్ పథకాన్ని (OPS)ను పునరుద్ధరించాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గళమెత్తారు. తెలంగాణ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Pension Kumbh mela: పాత పెన్షన్ పథకం (Old Pensions Scheme - OPS) పునరుద్ధరణ కోసం దేశంలో ఆందోళనలు క్రమంగా పెరుగుతున్నాయి. సీపీఎస్‍ను రద్దు చేసి.. మళ్లీ ఓపీఎస్ అమలు చేయాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేడు మధ్యప్రదేశ్‍లోని ఉజ్జయిని వేదికగా పెన్షన్ మహా కుంభమేళా నిర్వహించారు. ఉజ్జయినిలోని చరక్ భవన్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి సీపీఎస్ యూనియన్‍ల ప్రతినిధులు హాజరయ్యారు. పూర్తి వివరాలు..
సీపీఎస్ ముక్త్ భారత్ కావాలి
దేశవ్యాప్తంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేసి, ఓపీఎస్‍ను పునరుద్ధరించాలని నేషనల్ మూవ్‍మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో వచ్చే ఎన్నికల్లో ఈ అంశం ప్రధానం అవుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉద్యోగులందరూ సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్నారని చెప్పారు. దేశం నుంచి కొత్త పెన్షన్ పథకాన్ని (NPS) రద్దు చేసి సీపీఎస్ ముక్త్ భారత్ చేయాలని అన్నారు. ఓపీఎస్ ఇచ్చే పార్టీకే వచ్చే ఎన్నికల్లో మద్దతునిస్తామంటూ మధ్యప్రదేశ్ ఉద్యోగులతో వోట్ ఫర్ ఓపీఎస్ ప్రతిజ్ఞ చేయించారు.
“సీపీఎస్ రద్దు గురించి ప్రభుత్వాలు స్పందించడం లేదు. పైగా ఓపీఎస్ వల్ల ఆర్థిక నష్టం వాటిల్లుతుందని చెప్పటం విడ్డూరంగా ఉంది. బ్యాంకులకు లక్షల కోట్ల రుణాలను రద్దు చేస్తే రాని నష్టం.. ఉద్యోగులకు ఓపీఎస్ ఇస్తే వస్తుందా. ఓపీఎస్‍కు మద్దతునిచ్చే వారికే వచ్చే ఎన్నికల్లో ఓటు వేద్దాం” అని స్థితప్రజ్ఞ అన్నారు.
ఉజ్జయిని వేదికగా జరిగిన ఈ పెన్షన్ కుంభమేళా కార్యక్రమంలో తెలంగాణ నుంచి సీపీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేశ్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుచ్చన్న, ఉపేందర్, నరేందర్ రావు, బాలస్వామి, చంద్రకాంత్, నటరాజ్, సాయితో పాటు మరికొందరు పాల్గొన్నారు. ఉత్తర ప్రదేశ్ నుంచి విజయ్ కుమార్ బంధు, మహారాష్ట్ర నుంచి వితేశ్ కండెల్కర్ సహా మరికొన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.