Pakistan suicide blast: పాకిస్తాన్ లో మరో ఆత్మాహుతి దాడి; 62 మంది మృతి
Pakistan suicide blast: బలూచిస్తాన్ లో ఆత్మాహుతి దాడి జరిగిన కొన్ని గంటల్లోపే మరో ఆత్మాహుతి దాడి పాకిస్తాన్ ను వణికించింది. బలూచిస్తాన్ పేలుడులో సుమారు 52 మంది ప్రాణాలు కోల్పోగా, ఖైబర్ ఫక్తుంఖ్వా రాష్ట్రంలో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో 10 మంది వరకు చనిపోయినట్లు సమాచారం.
Pakistan suicide blast: పాకిస్తాన్ లో మిలాదున్నబీ ఉత్సవాలు లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే రెండు రాష్ట్రాల్లో భారీ బాంబు దాడులు జరిగాయి. రెండు కూడా శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదుల సమీపంలో జరిగాయి.
మిలాదున్నబీ ఉత్సవాలు..
పాకిస్తాన్ లో మొహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్న ప్రజలపై వరుసగా బాంబు దాడులు జరుగుతున్నాయి. కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్, ఖైబర్ ఫక్తుంఖ్వా రాష్ట్రాల్లో ఆత్మాహుతి దాడులు జరిగాయి. మొదటి దాడి బెలూచిస్తాన్ లోని మస్తుంగ్ లోని మదీనా మసీదు సమీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. అక్కడ నిలిచి ఉన్న పోలీసు కారు పక్కన నిల్చుని ఆత్మహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ పేలుడులో అక్కడ విధుల్లో ఉన్న డీఎస్పీ సహా 52 మంది ప్రాణాలు కోల్పోయారు. మిలాదున్నబీ పండుగ సందర్భంగా ర్యాలీ తీయడం కోసం అక్కడ భారీగా జనం గుమికూడడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది.
రెండోది కూడా మసీదులోనే..
కొన్ని గంటల తరువాత ఖైబర్ ఫక్తుంఖ్వా రాష్ట్రంలోని హంగు నగరంలో మరో బాంబు దాడి జరిగింది. హంగు నగరంలోని ఒక మసీదు సమీపంలో శుక్రవారం ప్రార్థనల కోసం వచ్చిన ప్రజలు లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మస్తుంగ్ జిల్లాలో గురువారం ఒక ఐసిస్ (ISIS) ఉగ్రవాదిని కౌంటర్ టెర్రరిజం దళాలు హతమార్చాయి. దీనికి ప్రతీకారంగానే ఈ ఆత్మాహుతి దాడులు జరుగుతున్నాయని భావిస్తున్నారు.