Balochistan blast: బలూచిస్తాన్ లో 34 మందిని బలి తీసుకున్న బాంబు బ్లాస్ట్; ఆత్మాహుతి దాడిగా అనుమానం
Balochistan blast: బలూచిస్తాన్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది.శుక్రవారం ఉదయం మదీనా మసీదు సమీపంలో.. మిలాద్ ఉన్న నబీ పర్వదినం సందర్భంగా తీస్తున్న ర్యాలీలో పాల్గొంటున్న ప్రజల మధ్య ఈ పేలుడు జరగడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించింది.
Balochistan blast: బలూచిస్తాన్ లో శుక్రవారం ఉదయం భారీ బాంబు పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ రాష్ట్రంలోని మస్తుంగ్ లోని ప్రముఖ మదీనా మసీదు సమీపంలో ఈ శక్తిమంతమైన బాంబు పేలింది.
34 మంది మృతి
మసీదు సమీపంలో శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించడంతో ప్రాణ నష్టం అత్యధికంగా ఉంది. మహమ్మద్ ప్రవక్త జన్మదినం అయిన మిలాద్ ఉన్ నబీ పర్వదినం సందర్భంగా ర్యాలీ తీయడం కోసం అక్కడ భారీగా జనం గుమికూడారు. ఈ ఘటనలో 34 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 130 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. బాంబు పేలుడు ధాటికి ఆ చుట్టుపక్కల భవనాలు కంపించాయి. ఆ ప్రాంతమంతా చెల్లచెదురుగా పడిన మృతదేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో భీతావహంగా మారింది. ఈ పేలుడులో చనిపోయిన వారిలో మాస్తుంగ్ డీఎస్పీ నవాజ్ గష్కోరీ కూడా ఉన్నారు. ర్యాలీలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూసేందుకు ఆయన అక్కడికి వెళ్లారు.
ఆత్మాహుతి దాడి..
అయితే, ఈ బాంబు దాడిని ఆత్మాహుతి దాడిగా పోలీసులు భావిస్తున్నారు. మాస్తుంగ్ డీఎస్పీ నవాజ్ గష్కోరీ కారు పక్కనే నిల్చుని ఆ సూయిసైడ్ బాంబర్ తనను తాను పేల్చేసుకున్నట్లు తెలుస్తోందని స్థానిక పోలీస్ అధికారి జావేద్ లేహ్రీ వెల్లడించారు. కాగా, ఘటనా స్థలానికి అదనపు సహాయ బృందాలను పంపిస్తున్నట్లు బలూచిస్తాన్ హోం మంత్రి తెలిపారు. విదేశాల మద్దతుతో బలూచిస్తాన్ లో మత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.