Aryan Khan | డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్‌చిట్‌!-no evidence aryan khan was part of conspiracy finds ncbs sit ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Aryan Khan | డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్‌చిట్‌!

Aryan Khan | డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్‌చిట్‌!

HT Telugu Desk HT Telugu
Mar 02, 2022 11:30 AM IST

గతేడాది డ్రగ్స్‌ కేసులో చిక్కుకొని అరెస్టయిన బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌కు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు తెలిసింది. దర్యాప్తుకు సంబంధించి కీలక సమాచారాన్ని సిట్‌ అధికారులు హిందుస్థాన్‌ టైమ్స్‌తో పంచుకున్నారు.

గతేడాది ఎన్సీబీ ఆఫీస్ దగ్గర ఆర్యన్ ఖాన్
గతేడాది ఎన్సీబీ ఆఫీస్ దగ్గర ఆర్యన్ ఖాన్ (Anshuman Poyrekar/HT PHOTO)

ముంబై: బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ఖాన్‌ అరెస్ట్‌ గతేడాది ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు కదా. ముంబై తీరంలో ఓ క్రూయిజ్‌ షిప్‌లో జరుగుతున్న రేవ్‌ పార్టీపై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో చేసిన దాడిలో ఆర్యన్‌ పట్టుబడ్డాడు. అతని దగ్గర డ్రగ్స్‌ కూడా దొరికినట్లు అప్పట్లో ఎన్సీబీ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి కొన్నాళ్లు జైలుకు కూడా వెళ్లాడు. 

అయితే కొన్ని నెలల దర్యాప్తు తర్వాత ఈ కేసులో కీలక సమాచారాన్ని రాబట్టింది స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌). డ్రగ్స్‌ కుట్రలో ఆర్యన్‌ ఖాన్‌ పాత్ర ఉన్నట్లు లేదా అంతర్జాతీయ డ్రగ్స్‌ రవాణా సిండికేట్‌తో అతనికి సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని సిట్‌ తెలిపింది. అంతేకాదు ఎన్సీబీ జరిపిన ఆ దాడిలో కొన్ని అక్రమాలు కూడా జరిగినట్లు సిట్‌ చెప్పడం గమనార్హం. 

అసలు ఆ సమయంలో ఆర్యన్‌ ఖాన్‌ దగ్గర ఎలాంటి డ్రగ్స్‌ లేవని, అలాంటప్పుడు అతడు తన ఫోన్‌ను సరెండర్‌ చేయాల్సిన అవసరంగానీ, అతని ఫోన్‌ చెక్‌ చేయాల్సిన అవసరంగానీ లేదని కూడా సిట్‌ చెప్పింది. ఇక ఆర్యన్‌ఖాన్‌ జరిపిన ఫోన్‌ చాట్‌లు అంతర్జాతీయ డ్రగ్స్‌ సిండికేట్‌ గురించి ఏమీ బయటపెట్టలేదని సిట్‌ తెలిపింది. ఆర్యన్‌కు బెయిల్‌ ఇచ్చే సమయంలో బాంబే హైకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పింది. 

ఇక ఎన్సీబీ మాన్యువల్ ప్రకారం.. దాడులను వీడియో రికార్డింగ్‌ చేయాలని, క్రూయిజ్‌ షిప్‌ విషయంలో మాత్రం అలా చేయలేదని కూడా సిట్‌ చెప్పింది. ఆర్యన్‌ఖాన్‌ విషయంలో సిట్‌కు ఎలాంటి ఆధారాలు లభించకపోయినా.. ఈ కేసులో సిట్‌ విచారణ ఇంకా పూర్తి కాలేదు. మరో రెండు నెలల్లో ఎన్సీబీ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌కు సిట్‌ తన రిపోర్ట్‌ అందజేయనుంది. గతేడాది అక్టోబర్‌ 2న ఆర్యన్‌ఖాన్‌ను ఎన్సీబీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

IPL_Entry_Point

టాపిక్