INDIA name and Nitish Kumar: విపక్ష కూటమికి పెట్టిన ఇండియా’ పేరు నితీశ్ కుమార్ కు నచ్చలేదట.. నితీశ్ మరో పేరు సూచించారట..-nitish kumar was not on board with india name as if all of you are okay ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India Name And Nitish Kumar: విపక్ష కూటమికి పెట్టిన ఇండియా’ పేరు నితీశ్ కుమార్ కు నచ్చలేదట.. నితీశ్ మరో పేరు సూచించారట..

INDIA name and Nitish Kumar: విపక్ష కూటమికి పెట్టిన ఇండియా’ పేరు నితీశ్ కుమార్ కు నచ్చలేదట.. నితీశ్ మరో పేరు సూచించారట..

HT Telugu Desk HT Telugu
Jul 19, 2023 12:08 PM IST

బెంగళూరు లో జులై 18న భేటీ అయిన విపక్ష నేతలు బీజేపీని ఎదుర్కొనేందుకు తాము ఏర్పాటు చేసిన కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆ పేరు ఆ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్ కు నచ్చలేదట. ఆయన ఇండియన్ మెయిన్ ఫ్రంట్ - ఐఎంఎఫ్ (Indian Main Front) అనే పేరు సూచించారట.

బెంగళూరులో జులై 18 న జరిగిన విపక్ష కూటమి సమావేశం సందర్భంగా రాహుల్ గాంధీతో నితీశ్ కుమార్ కరచాలనం
బెంగళూరులో జులై 18 న జరిగిన విపక్ష కూటమి సమావేశం సందర్భంగా రాహుల్ గాంధీతో నితీశ్ కుమార్ కరచాలనం

బెంగళూరు లో జులై 18న భేటీ అయిన విపక్ష నేతలు బీజేపీని ఎదుర్కొనేందుకు తాము ఏర్పాటు చేసిన కూటమికి ‘ఇండియా (INDIA)’ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆ పేరు ఆ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్ కు నచ్చలేదట. ఆయన ఇండియన్ మెయిన్ ఫ్రంట్ - ఐఎంఎఫ్ (Indian Main Front) అనే పేరు సూచించారట.

పెద్ద చర్చే నడిచింది..

విపక్ష కూటమికి ఏ పేరు పెట్టాలనే విషయంలో ప్రతిపక్ష నేతల మధ్య పెద్ద చర్చనే జరిగినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వివిధ పార్టీల నాయకులు వేర్వేరు పేర్లను సూచించారు. ఆయా పేర్లపై నాయకులు చర్చించారు. ఏకాభిప్రాయంతోనే పేరు నిర్ణయం జరగాలని నాయకులు భావించారు. మరోవైపు, సేవ్ ఇండియా అలయన్స్ లేదా సెక్యులర్ ఇండియా అలయన్స్ పేరును వీసీకే నేత తొల్కప్పియన్ తిరుమవలన్, ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ పేరును ఎండీఎంకే నేత వైకో సూచించారు. సీపీఎం నాయకుడు సీతారాం యేచూరి వి ఫర్ ఇండియా (We for India) అనే పేరును సూచించారు.

నితీశ్ కు ‘ఇండియా’ పేరు నచ్చలేదు..

కాగా, సమావేశంలో పాల్గొన్న వారిలో కీలక నాయకుల్లో ఒకరైన నితీశ్ కుమార్ కు విపక్ష కూటమికి ‘ ఇండియా (Indian National Developmental Inclusive Alliance) అనే పేరు నచ్చలేదు. అందుకు ఆయన రెండు కారణాలు చెప్పారు. ఒకటి, ఆ ఇండియా (INDIA) లో ఎన్ డీఏ (NDA) అనే పదాలు ఉన్నాయి. రెండోది, ఎన్డీయే లో డీ అండే డెమొక్రాటిక్.. ఇండియాలో కూడా డీ అంటే డెమొక్రాటిక్ అని మొదట్లో నిర్ణయించారు. దాంతో, రెండింటిలో డీ (D) అంటే డెమొక్రాటిక్ అని ఉండడం నితీశ్ కుమార్ కు నచ్చలేదు. ఇండియా అనే పేరుకు బదులుగా ఆయన ఇండియన్ మెయిన్ ఫ్రంట్ - ఐఎంఎఫ్ (Indian Main Front) అనే పేరు సూచించారు. అయితే, మిగతా నేతలంతా, ఇండియా అనే పేరుకే మొగ్గు చూపడంతో.. ‘ఇండియా అనే పేరుకే మీరంతా ఓకే అంటే నాకు కూడా అభ్యంతరం లేదు’ అని నితీశ్ చెప్పారు. ఆ తరువాత, నితీశ్ కుమార్ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని ఇండియా (INDIA) లోని డీ(D) అనే పదానికి డెమొక్రాటిక్ అనే అబ్రివేషన్ కాకుండా, డెవలప్మెంటల్ అని మార్చారు.

ఇంతకీ ‘ఇండియా’ పేరును ఎవరు సూచించారు?

విపక్ష కూటమి నాయకుల్లో ఈ ‘ఇండియా‘ అనే పేరును ఎవరు సూచించారనే విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పేరును కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మొదట సూచించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆ పేరును మొదట సూచించిన క్రెడిట్ తనకు అక్కర్లేదని రాహుల్ భావిస్తున్నారని కాంగ్రెస్ నేత సుప్రియ షినటే వివరించారు. విపక్ష కూటమికి ‘ఇండియా’ అనే పేరును తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ మొదట సూచించారని, ఆ పేరుపై ఆమె బాగా పట్టుపట్టారని కూటమి భేటీలో పాల్గొన్న ఇతర పార్టీల నాయకులు తెలిపారు.

Whats_app_banner