సిద్ధూకి క్లర్క్ జాబ్.. జీతం ఎంతో తెలుసా?
పటియాలా జైలులో కారాగార శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకి జైలులో క్లర్క్ ఉద్యోగం లభించింది. మొదటి మూడు నెలలు ఎలాంటి వేతనం ఉండదు. ఆ తరువాత, రోజుకు రూ.40 వేతనం లభిస్తుంది. రోజుకు రెండు షిఫ్ట్‌ల్లో పని చేయాల్సి ఉంటుంది.
1998 నాటి ఒక కేసులో పంజాబ్‌లోని పటియాలా కోర్టు సిద్ధూకి సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. 1998లో పటియాలాలో సిద్ధూతో రోడ్డుపై జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మరణించాడు. కోర్టుకు లొంగిపోయిన అనంతరం, ఆయనను పటియాలా జైలుకి తరలించారు. ప్రస్తుతం ఖైదీ నెం 241383తో ఆయన పటియాలా సెంట్రల్ జైల్‌లో ఉన్నారు.
మున్షీ లేదా క్లర్క్
జైలులో శిక్ష అనుభవిస్తున్న వారు తమ అర్హతలను బట్టి అక్కడ పని చేయాల్సి ఉంటుంది. అందుకు వారికి వేతనం కూడా లభిస్తుంది. అలా, సిద్ధూకి జైలులో మున్షీ, లేదా క్లర్క్ విధులను కేటాయించారు. ఆ విధంగా, అంతర్జాతీయ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ లీడర్, పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ పటియాలా సెంట్రల్ జైలులో క్లర్క్‌గా పని చేస్తున్నారు. అయితే, భద్రతాకారణాల దృష్ట్యా, తను ఉన్నజైలు గది `బరాక్ నెం 10` నుంచే పని చేసే అవకాశాన్ని సిద్దూకి జైలు అధికారులు కల్పించారు. సిద్ధూ ఉన్నజైలులో కొందరు కరడు గట్టిన నేరస్తులు, డ్రగ్ సిండికేట్ నేరస్తులు ఉన్నందున ఆ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సిద్ధూ పక్క సెల్‌లో పంజాబ్ మాజీ మంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ మహితియా ఉన్నారు.
జీతం ఎంత?
జైలులో క్లర్క్ లేదా మున్షీగా పనిచేస్తున్న సిద్ధూకి తొలి మూడు నెలలకు వేతనం ఉండదు. అది శిక్షణాకాలం కనుక, ఆ కాలానికి వేతనం ఉండదు. ఆ తరువాత, సిద్ధూకి కేటాయించిన పని కేటగిరీని బట్టి రోజుకి రూ. 40 ఆయనకు జీతంగా లభిస్తుందని సమాచారం. మే 24న సిద్ధూ క్లర్క్‌గా విధుల్లో చేరారు. రోజుకు రెండు షిఫ్ట్‌లో పని చేస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు. తరువాత మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు ఆయన పనివేళలు.
సిద్ధూ డైట్
జైలులో తొలిరోజు సిద్ధూ ఎలాంటి ఆహారం తీసుకోలేదు. ఆ తరువాత డాక్టర్ల సలహా మేరకు ఆయన ప్రత్యేక డైట్ అందిస్తున్నారు. అందులో ఉడకబెట్టిన కూరగాయలు, పలు రకాల పండ్లు, కేరట్ జ్యూస్, అలొవేరా జ్యూస్, టీ.. మొదలైనవి ఉన్నాయి.
టాపిక్