మైక్రోసాఫ్ట్ మెగా బొనాంజా.. ఉద్యోగుల సాలరీ డబుల్!
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు గొప్ప శుభవార్త. వారి వేతనాలకు సంబంధించి కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల వేతనాలు దాదాపు రెండింతలు పెంచే దిశగా సాలరీ బడ్జెట్‌ను డబుల్ చేయనుంది.
ఏ కంపెనీకైనా నిపుణులైన ఉద్యోగులే పెద్ద ఆస్తి. మెరుగైన సాలరీ, ఇతర సదుపాయాల కోసం ఉద్యోగులు జాబ్స్ మారుతూ ఉంటారు. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇది మరింత సాధారణం. అందువల్ల ఉద్యోగులు వెళ్లిపోకుండా సాఫ్ట్ వేర్ కంపెనీలు వారికి పలు ప్రయోజనాలు కల్పిస్తుంటుంది. ఆ దిశగానే సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ `మైక్రోసాఫ్ట్` కీలక నిర్ణయం తీసుకుంది.
డబుల్ సాలరీ
నిపుణులైన ఉద్యోగులు కంపెనీని విడిచి వెళ్లకుండా, ఎంప్లాయి టర్నౌవుట్‌ను తగ్గించుకునే దిశగా మైక్రోసాఫ్ట్ తన బడ్జెట్ ప్రణాళికలో ముఖ్యమైన మార్పుకు సిద్దమైంది. ఉద్యోగుల వేతనాలను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. అందుకోసం కంపెనీ `సాలరీ బడ్జెట్`ను దాదాపు రెండింతలు చేయాలనుకుంటోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో, నిత్యావసర ఖర్చులు భారీగా పెరగడాన్ని దృష్టిలో పెట్టుకుని, మెరుగైన వేతనాల కోసం ఉద్యోగులు వేరే కంపెనీలకు వెళ్లకుండా మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, కొందరు ఉద్యోగులకు కంపెనీ షేర్లను ఇచ్చే `స్టాక్ కంపెన్సేషన్`ను కనీసం 25 శాతం మేరకు పెంచాలని నిర్ణయించింది. వేతన పెంపు నిర్ణయంతో తక్కువ నుంచి మధ్య స్థాయి అనుభవం ఉన్న ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా చూస్తామని కంపెనీ ప్రకటించింది. ప్రపంచ స్థాయి నైపుణ్యత కలిగిన ఉద్యోగులున్న కంపెనీగా, ప్రపంచ స్థాయి న్యాణ్యతతో కూడిన సేవలు అందించే కంపెనీగా మైక్రోసాఫ్ట్‌కు పేరుందని తెలిపింది.
కంపెనీల మధ్య పోరు
నిపుణులైన ఉద్యోగుల కోసం కంపెనీలు సదా వేట కొనసాగిస్తూనే ఉంటాయి. ఉత్తమ స్థాయి నిపుణులను తమ కంపెనీలకు తీసుకోవాలని, అవసరమైతే వారికి ప్రస్తుత కంపెనీ ఇస్తున్న వేతనం, ఇతర ప్రయోజనాల కన్నా ఎక్కువ వేతనం, ఇతర ప్రయోజనాలు అందించేందుకు సిద్ధంగా ఉంటాయి. మెరుగైన ఉద్యోగుల కోసం సాగే ఈ పోటీలో మైక్రోసాఫ్ట్‌తో ఆమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్ యాజమాన్య సంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ తదితర కంపెనీలు ప్రధానంగా ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ, ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్), మెటావర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో నిపుణులైన వారికి ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది.
1.81 లక్షలు
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌లో జూన్ 30, 2021 నాటికి దాదాపు 1.81 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఈ కంపెనీ సాలరీ ప్యాకేజ్‌లో ప్రధానంగా బేస్ సాలరీ, బోనస్, స్టాక్స్ ఉంటాయి. కంపెనీ షేర్ల అలాట్మెంట్‌లో పెంపుదల కంపెనీ ఇంటర్నల్ స్కేల్‌లో లెవెల్ 67 లేదా ఆ లోపు లెవెల్‌లో ఉన్న ఉద్యోగులకు వర్తిస్తుందని కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల వెల్లడించారు. కాగా, మరో దిగ్గజ కంపెనీ ఆమెజాన్.. తమ ఉద్యోగుల బేస్ సాలరీని డబుల్ చేయనున్నట్లు ఈ ఫిబ్రవరిలోనే ప్రకటించడం గమనార్హం.
టాపిక్