Maruti Suzuki new Brezza : మారుతీ బ్రెజా న్యూ వెర్షన్ సేల్స్ బుకింగ్ ప్రారంభం
మారుతీ బ్రెజా న్యూ వెర్షన్ బుకింగ్ ప్రారంభించినట్టు, ఈ నెలాఖరుకు లాంఛ్ చేయనున్నట్టు మారుతీ సుజుకీ వెల్లడించింది.
న్యూఢిల్లీ, జూన్ 20: మారుతీ సుజుకీ కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజా (SUV Brezza) న్యూ వెర్షన్ సేల్స్ కోసం బుకింగ్ ప్రారంభించినట్టు సంస్థ సోమవారం వెల్లడించింది.
న్యూ బ్రెజా ఈనెలాఖరుకు లాంచ్ కానుంది. అధునాతన ఫీచర్లతో కొత్త బ్రెజా స్తోంది. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో పాటు కొత్త తరం మెచ్చే టెక్నాలజీ, కంఫర్ట్, కన్వీనియెన్స్, కనెక్టివిటీ ఫీచర్లు మారుతీ బ్రెజా కొత్త వెర్షన్‌లో ఉంటాయని కంపెనీ చెబుతోంది.
6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో కూడిన నెక్స్ట్ జనరేషన్ పవర్ ట్రైన్ సదుపాయం ఈ మారుతీ బ్రెజా న్యూ వెర్షన్‌లో అందుబాటులో ఉంది.
న్యూ బ్రెజాను కస్టమర్లు రూ. 11 వేలు చెల్లించి ప్రి-బుక్ చేసుకోవచ్చు. కంపెనీ వెబ్‌సైట్‌లో గానీ, ఏదైనా మారుతీ ఎరీనా షోరూమ్‌లోగానీ బుక్ చేసుకోవచ్చు.
2016లో లాంచ్ అయిన బ్రెజా కాంపాక్ట్ ఎస్‌యూవీ శ్రేణిలో కొత్త ఒరవడి సృష్టించిందని మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
‘కేవలం ఆరేళ్ల కాలంలో 7.5 లక్షల యూనిట్ల మారుతీ బ్రెజా కార్లు అమ్ముడయ్యాయి. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో బ్రెజా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పుడు సరికొత్త అవతారంలో బ్రెజా కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించబోతున్నందుకు సంతోషిస్తున్నాం..’ అని పేర్కొన్నారు.
మారుతున్న యువత ఆకాంక్షలకు అనుగుణంగా, వారి వ్యక్తిత్వాలకు తగిన రీతిలో కార్లను కోరుకుంటున్నందున, కొత్త బ్రెజాను స్టైలిష్‌గా తీర్చిదిద్దినట్టు తెలిపారు. ఇందులో వినియోగించిన టెక్నాలజీని పరిశీలిస్తే కస్టమర్ల అంచనాలకు మించి ఉంటాయని తెలిపారు.
మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (ఇంజీనీరింగ్) సీవీ రామన్ మాట్లాడుతూ న్యూ బ్రెజా సరికొత్త డిజైన్, పనితీరు, టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లతో వస్తోందని వివరించారు.