Maoist links case : 'మావోయిస్ట్ లింక్స్ కేసులో సాయిబాబా నిర్దోషి..'
Maoist links case GN Saibaba : మావోయిస్ట్ లింక్స్ కేసులో జైలులో ఉన్న దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు ఊరట! కేసులో ఆయన నిర్దోషి అని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.
GN Saibaba case : మావోయిస్టుల లింక్స్ కేసులో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు తాజాగా.. నిర్దోషులుగా ప్రకటించింది. 2017లో జీఎన్ సాయిబాబా తదితరులను దోషులుగా నిర్ధారిస్తూ నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్ఏ మెనెజ్లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
వాస్తవానికి ఇదే కేసుపై హైకోర్టులో ఒకసారి విచారణ జరిగింది. 2022 అక్టోబర్‌లో.. వికలాంగుడైన ప్రొఫెసర్ని నాటి ధర్మాసనం నిర్దోషిగా ప్రకటించింది. కానీ ఈ వ్యవహారంపై మళ్లీ విచారణ జరిగింది. తాజాగా వెలువడిన కోర్టు తీర్పు కూడా.. జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా తేల్చింది.
నిందితులపై ‘అనుమానాల’కు మించి కేసును రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందని, అందుకే.. వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) నిబంధనల కింద నిందితులపై అభియోగాలు మోపడానికి ప్రాసిక్యూషన్ పొందిన అనుమతి చెల్లదని తేల్చిచెప్పింది.
కోర్టు ఆదేశాలపై స్టే విధించాలని ప్రాసిక్యూషన్ అడగలేదు కానీ.. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేసింది.
54ఏళ్ల జీఎన్ సాయిబాబా 99శాతం వికలాంగుడు! పూర్తిగా వీల్ ఛైర్‌కే పరిమితయ్యారు. ప్రస్తుతం ఆయన నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.
ఇదీ అసలు కథ..
Maoist links case Bombay high court : 2017లో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సెషన్స్ కోర్టు సాయిబాబాతో పాటు ఓ జర్నలిస్టు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సహా మరో ఐదుగురిని మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై, దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించారంటూ దోషులుగా నిర్ధారించింది. యూఏపీఏ, ఇండియన్ పీనల్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద ట్రయల్ కోర్టు వీరిని దోషులుగా తేల్చింది.
యూఏపీఏ కింద చేసిన విచారణ చర్యలు చెల్లవని పేర్కొంటూ 2022 అక్టోబర్ 14న సాయిబాబాను బాంబే హైకోర్టుకు చెందిన బెంచ్ నిర్దోషిగా ప్రకటించింది.
ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అదే రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తొలుత ఈ ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. ఆ తర్వాత 2023 ఏప్రిల్లో హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేసి సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ని కొత్తగా విచారించాలని ఆదేశించింది.
సంబంధిత కథనం