Manipur Violence: మళ్లీ మండుతున్న మణిపూర్; ఆ పోలీస్ ఆఫీసర్ మళ్లీ వెనక్కు..-manipur violence srinagars top police recalled to state amidst unrest ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Manipur Violence: మళ్లీ మండుతున్న మణిపూర్; ఆ పోలీస్ ఆఫీసర్ మళ్లీ వెనక్కు..

Manipur Violence: మళ్లీ మండుతున్న మణిపూర్; ఆ పోలీస్ ఆఫీసర్ మళ్లీ వెనక్కు..

HT Telugu Desk HT Telugu
Sep 28, 2023 03:13 PM IST

Manipur Violence: మణిపూర్ లో మళ్లీ హింస ప్రజ్వరిల్లుతోంది. గత కొన్ని రోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ ఘర్షణలు, హింసాత్మక ఘటనలు ప్రారంభమయ్యాయి.

ఇంఫాల్ లో భద్రతా దళాల పహారా
ఇంఫాల్ లో భద్రతా దళాల పహారా (PTI)

Manipur Violence: చల్లారాయనుకున్న మణిపూర్ మంటలు మళ్లీ ప్రారంభమయ్యాయి. మైతేయి తెగకు చెందిన ఇద్దరు విద్యార్థుల హత్య విషయం వైరల్ కావడంతో మళ్లీ ఆ ఈశాన్య రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇంటర్నెట్ రాకతో..

రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు మళ్లీ అందుబాటులోకి రావడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. జులై నెల నుంచి కనిపించకుండా పోయిన మైతేయి తెగకు చెందిన ఇద్దరు విద్యార్థుల హత్య విషయం వైరల్ కావడంతో మళ్లీ ఆ ఈశాన్య రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటి నుంచి వెళ్లిన ఆ విద్యార్థులు కుకీ తెగ ప్రజల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లడంతో, అక్కడి వారు ఆ విద్యార్థులను కిడ్నాప్ చేసి, చిత్ర హింసలు పెట్టి హత్య చేశారు. ఇంటర్నెట్ సేవలు ప్రారంభం కావడంతో ఆ విద్యార్థుల మృతదేహాలు వైరల్ గా మారాయి. దాంతో, మరోసారి మైతేయి, కుకీ వర్గాల మద్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఆ ఇద్దరు విద్యార్థుల హత్యకు సంబంధించిన కేసును కూడా మణిపూర్ పోలీసులు సీబీఐ కి అప్పగించారు. రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే మైతేయిలు రోడ్లపైకి వచ్చి నిరసనలు ప్రారంభించారు. వారిని పోలీసులు, ఆర్ఏఎఫ్ దళాలు అడ్డుకున్నాయి. పోలీసుల లాఠీ చార్జిలో 30 మంది వరకు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. అలాగే రాష్ట్రంలో మరో 6 నెలల పాటు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం అమలును పొడగించింది.

ఆ ఐపీఎస్ కు బాధ్యతలు..

మణిపూర్ లో మళ్లీ హింస ప్రజ్వరిల్లుతున్న నేపథ్యంలో.. కేంద్ర హోం శాఖ కశ్మీర్ లోని శ్రీనగర్ లో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేశ్ బల్వాల్ ను మళ్లీ మణిపూర్ కు బదిలీ చేసింది. ప్రస్తుతం ఆయన శ్రీనగర్ సీనియర్ ఎస్పీగా ఉన్నారు. రాకేశ్ బల్వాల్ మణిపూర్ కేడర్ ఐపీఎస్ అధికారి. ఆయనను జమ్మూకశ్మీర్ కు బదిలీ చేశారు. 2021 లో శ్రీనగర్ ఎస్ఎస్పీ గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు, ఆయన ఎన్ఐఏలో సీనియర్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపిన బృందంలో కీలక సభ్యుడిగా ఉన్నారు.

Whats_app_banner