Manipur violence: మణిపూర్ లో ఆగని హింస; ఒక గ్రామంలో ముగ్గురి కాల్చివేత-manipur in fresh violence 3 shot dead in their homes in bishnupur ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Manipur Violence: మణిపూర్ లో ఆగని హింస; ఒక గ్రామంలో ముగ్గురి కాల్చివేత

Manipur violence: మణిపూర్ లో ఆగని హింస; ఒక గ్రామంలో ముగ్గురి కాల్చివేత

HT Telugu Desk HT Telugu
Aug 05, 2023 01:35 PM IST

Manipur violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో హింసాగ్ని చల్లారడం లేదు. దాదాపు గత మూడు నెలలుగా మణిపూర్ మండిపోతూనే ఉంది. తాజాగా, శుక్రవారం రాత్రి ఒక గ్రామంలోకి చొరబడిన దుండగులు ముగ్గురిపై కాల్పులు జరిపి చంపేశారు.

మణిపూర్ లో పారా మిలటరీ దళాల పహారా
మణిపూర్ లో పారా మిలటరీ దళాల పహారా

Manipur violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో హింసాగ్ని చల్లారడం లేదు. దాదాపు గత మూడు నెలలుగా మణిపూర్ మండిపోతూనే ఉంది. తాజాగా, శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక గ్రామంలోకి చొరబడిన దుండగులు ముగ్గురిపై కాల్పులు జరిపి చంపేశారు. బిష్ణుపుర్ జిల్లాలోని క్వాట్క గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు.

రాక్షసంగా..

అర్ధరాత్రి దాటిన తరువాత తుపాకులు, కత్తులు తదితర ఆయుధాలతో ఊరిలోకి చొరబడిన దుండగులు ఒక ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురిని కాల్చి చంపడమే కాకుండా, ఆ తరువాత వారి మృతదేహాలను ముక్కలుగా నరికి, అక్కడి నుంచి పారిపోయారు. మృతి చెందిన వారు యుమ్నం జితిన్ మైతేయి, యుమ్నం పిశాక్ మైతేయి, అతడి కుమారుడు ప్రేమ్ కుమార్ మైతేయి అని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం కుకీల ఆధిక్యత ఉన్న పర్వత ప్రాంతాలకు, మైతేయిలు అధికంగా ఉండే లోయ ప్రాంతానికి మధ్య బఫర్ జోన్ లో ఉంటుంది. ఇక్కడ మోహరించిన కేంద్ర బలగాలను కూడా తప్పించుకుని దుండగులు గ్రామంలోకి చొరబడ్డారు.

ఉద్రిక్తత..

గత మూడు, నాలుగు వారాలుగా ఈ క్వట్క ప్రాంతం ఉద్రిక్తంగా ఉంది. గిరిజన, గిరిజనేతరుల మధ్య ఇక్కడ పలుమార్లు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. దాంతో, ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకంగా పోలీసులు, పారా మిలటరీ దళాలను మోహరించింది. తాజా ఘటనతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తత మరింత తీవ్రమైంది. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశామని బీజేపీ ఎమ్మెల్యే ఆర్ కే ఇమావ్ తెలిపారు. పారా మిలటరీ దళాలు, పోలీసులు విధుల్లో ఉండగానే, వేరే జిల్లా నుంచి సాయుధులు గ్రామంలోకి చొరబడగలగడం సాయుధ దళాల వైఫల్యమేనని, వారిపై చర్యలు తీసుకోవాలని హోం మంత్రిని కోరామన్నారు. ఆ పారా మిలటరీ దళాలు, పోలీసుల్లో కొందరు ఆ దుండగులకు సహకరించారని ఆరోపించారు.

Whats_app_banner