Maharashtra political crisis: ఏక్‌నాథ్ షిండేకు మద్దతుగా 40 మంది ఎమ్మెల్యేల సంతకం-maharashtra political crisis rebel sena mlas sign letter of support to eknath shinde likely to seek floor test ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maharashtra Political Crisis: ఏక్‌నాథ్ షిండేకు మద్దతుగా 40 మంది ఎమ్మెల్యేల సంతకం

Maharashtra political crisis: ఏక్‌నాథ్ షిండేకు మద్దతుగా 40 మంది ఎమ్మెల్యేల సంతకం

HT Telugu Desk HT Telugu
Jun 22, 2022 11:10 AM IST

ఏక్‌నాథ్ షిండేకు మద్దతుగా 40 మంది ఎమ్మెల్యేలు సంతకం చేసినట్టుగా తెలుస్తోంది. వారంత సభలో విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

<p>తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే</p>
తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే (HT_PRINT)

ముంబై, జూన్ 22: 33 మంది శివసేన, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సహా నలభై మంది మహారాష్ట్ర ఎమ్మెల్యేలు.. శివసేన తిరుగుబాటు నేత, రాష్ట్ర కేబినెట్ మంత్రి ఏక్నాథ్ షిండేకు మద్దతు తెలుపుతూ లేఖపై సంతకం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

రాష్ట్ర శాసనసభలో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ తిరుగుబాటు శాసనసభ్యులు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి లేఖ రాయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

షిండే నేతృత్వంలోని 40 మంది ఎమ్మెల్యేలు బుధవారం బీజేపీ పాలిత అసోంలోని గౌహతిలో గల ఓ లగ్జరీ హోటల్‌కు చేరుకున్నారు. శివసేనలో తిరుగుబాటు చేయడం ద్వారా మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో షిండేతో పాటు ఇతర ఎమ్మెల్యేలు బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి.

‘మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు. మేం బాలాసాహెబ్ ఠాక్రే హిందుత్వాన్ని మోస్తాం..’ అని గౌహతి చేరుకున్న తర్వాత షిండే అన్నారు.

గౌహతి విమానాశ్రయంలో శివసేన ఎమ్మెల్యేలకు బీజేపీ ఎమ్మెల్యే సుశాంత బోర్గోహైన్, బీజేపీ ఎంపీ పల్లబ్ లోచన్ దాస్ స్వాగతం పలికారు.

మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన నేపథ్యంలో షిండే.. శివసేన, స్వతంత్ర శాసనసభ్యులతో కలిసి గుజరాత్‌లోని సూరత్‌లోని ఒక హోటల్‌లో బస చేసి, ఈరోజు తెల్లవారుజామున గౌహతి చేరుకున్నారు.

గౌహతికి బయలుదేరే ముందు రెబల్ ఎమ్మెల్యేలందరూ సూరత్ హోటల్‌లో కలిసి కూర్చున్న వీడియోను విడుదల చేశారు. మరో వీడియోలో ఎమ్మెల్యేలంతా పేపర్‌పై సంతకాలు పెట్టడం కనిపించింది.

ఈ వీడియోను విడుదల చేయడం ద్వారా ఏకనాథ్ షిండే వర్గం తన బలాన్ని ప్రదర్శించిందని భావిస్తున్నారు.

కాగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తమ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్‌ను రాష్ట్రంలో ఏఐసీసీ పరిశీలకుడిగా నియమించింది.

Whats_app_banner

టాపిక్