Encounter in Maharashtra: మహారాష్ట్రలోని గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలో చత్తీస్ గఢ్ (Chhattisgarh) సరిహద్దు అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం వరకు కూడా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఒక నక్సలైట్ చనిపోయినట్లు నిర్ధారణగా తెలిసింది.
నిఘా వర్గాల సమాచారం మేరకు శనివారం ఉదయం మహారాష్ట్ర (Maharashtra) లోని గడ్చిరోలి (Gadchiroli) జిల్లా నక్సల్ వ్యతిరేక దళం సీ 60 (anti-Naxal squad C60) కి నిఘా వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం అందింది. చత్తీస్ గఢ్ (Chhattisgarh) సరిహద్దుల్లోని అబూజ్ మఢ్ (Abujhmad) అడవుల్లో నక్సలైట్లు తల దాచుకున్నట్లు తెలియడంతో నక్సల్ వ్యతిరేక దళం సీ 60 (anti-Naxal squad C60) శనివారం ఉదయం నుంచి ఆ ప్రాంతంలో కూంబింగ్ ప్రారంభించింది. భమ్రాగఢ్ తాలూకాలోని కియార్కోట్ (Kiarkoti) ప్రాంతానికి పోలీసులు చేరుకోగానే, వారిపై నక్సలైట్లు కాల్పులు జరపడం ప్రారంభించారు. పోలీసుల కాల్పుల్లో ఒక నక్సలైట్ చనిపోయాడని నిర్ధారణగా తెలిసిందని, మరికొందరు కూడా చనిపోయి ఉండవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించాయి.
మరో ఘటనలో నక్సలైట్లు ఒక ఆర్టీసీ బస్సును తగలబెట్టారు. చత్తీస్ గఢ్ (Chhattisgarh) లోని దంతేవాడ (Dantewada) జిల్లాలో మాలెవాహి, బోడ్లి పోలీస్ క్యాంప్ ల మధ్య శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. దంతేవాడ (Dantewada) నుంచి నారాయణ్ పూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును మధ్యలో నిలిపివేసి, అందులోని ప్రయాణీకులందరినీ బస్సు నుంచి దించివేసి, ఆ బస్సుకు నక్సలైట్లు నిప్పంటించారు. ముందే అందరూ దిగిపోయి ఉండడం వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ దాడిలో సాయుధులైన సుమారు 12 మంది నక్సలైట్లు పాల్గొన్నట్లు తెలిసిందని దంతేవాడ (Dantewada) ఎస్పీ ఆర్కే బర్మన్ వెల్లడించారు. సమాచారం తెలియగానే, సమీప ప్రాంతాల్లో గాలింపు ప్రారంభించామన్నారు.