Earthquake today : ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు.. హడలెత్తిపోయిన ప్రజలు!-magnitude of 6 2 earthquake today jolts western afghanistan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Earthquake Today : ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు.. హడలెత్తిపోయిన ప్రజలు!

Earthquake today : ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు.. హడలెత్తిపోయిన ప్రజలు!

Sharath Chitturi HT Telugu
Oct 07, 2023 01:40 PM IST

Earthquake today : ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన భూకంపాలు.. ప్రజలను భయపెట్టాయి. అఫ్గానిస్థాన్​, నేపాల్​, మెక్సికోలో భూప్రకంపనలు సంభవించాయి.

మూడు దేశాలను భయపెట్టిన భూకంపం..!
మూడు దేశాలను భయపెట్టిన భూకంపం..!

Earthquake today : గడిచిన కొన్ని గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు సంభవించాయి. అఫ్గానిస్థాన్​, మెక్సికో, నేపాల్​లోని ప్రజలు.. భూ ప్రకంపనలకు హడలెత్తిపోయారు.

అఫ్గానిస్థాన్​లో ఇలా..

పశ్చిమ అఫ్గానిస్థాన్​ హెరాత్​కు 40కి.మీల దూరం,​ స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11:00 ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేల్​పై భూప్రకంపనల తీవ్రత 6.2గా నమోదైందని అమెరికా జియోలాజికల్​ సర్వే వెల్లడించింది.

Afghanistan earthquake today : భూకంపం సంభవించిన కొన్ని నిమిషాలకు.. 5.5 తీవ్రతతో మరోమారు భూమి కంపించింది. ఈ పరిణామాల మధ్య ఇళ్లు, దుకాణాల్లోని ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా.. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదని తెలుస్తోంది. పెద్దగా ఆస్థి నష్టం కూడా అవ్వలేదని సమాచారం.

అఫ్గానిస్థాన్​లోని పక్తికా రాష్ట్రంలో గతేడాది జూన్​లో 5.9 తీవ్రతతో సంభవించిన భూకంపాన్ని అక్కడి ప్రజలు ఇంకా మరచిపోలేదు. నాడు.. 1000మందికిపైగా ప్రజలు మరణించగా.. 10వేలకుపైగా మంది నిరాశ్రయులయ్యారు.

మెక్సికోలో..

మెక్సికోలోని ఓక్సాకా అనే ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేల్​పై దీని తీవ్రత 6.0గా నమోదైంది. భూకంపం ధాటికి పలు భవనాలు ధ్వంసమైనట్టు, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్​ సేవలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది.

Mexico earthquake : అయితే.. మెక్సికోలో భూకంపం ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఓక్సాకాలోని ఓ ఆసుపత్రి గోడకు బీటలువారినట్టు వెల్లడించారు.

2017 సెప్టెంబర్​లో 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపం.. మెక్సికోను భయపెట్టేసింది. నాడు.. 369మంది మరణించారు. ఇక 1985లో వెలుగుచూసిన అతి భయానక భూకంపం (8.1 తీవ్రత) ధాటికి 10వేల మంది ప్రాణాలు విడిచారు.

నేపాల్​లో..

నేపాల్​లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11:30 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేల్​పై దీని తీవ్రత 4.9గా నమోదైంది. భూమికి 10కి.మీల లోతున భూ ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. ఎన్​సీఎస్​ (నేషనల్​ సెంటర్​ ఫర్​ సిస్మోలాజీ) వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదని సమాచారం.

Nepal earthquake today : నేపాల్​లో భూకంపాల తీవ్రత చాలా ఆందోళనకరంగా ఉంటుంది. ఈ వారంలో ఇప్పటికే రెండుసార్లు భూమి కంపించింది. ఇక్కడి ప్రజలు నిత్యం భయం-భయంగా జీవిస్తుంటారు.

Whats_app_banner

సంబంధిత కథనం