Loans Written off: రూ.10లక్షల కోట్లకుపైగా రుణాలను బ్యాంకులు మాఫీ చేశాయి: కేంద్రం
Loans Written off: గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.10లక్షల కోట్లకుపైగా రుణాలను బ్యాంకులు మాఫీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు లోక్‍సభలో వివరాలను వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman).
₹10 lakh Crore Loans Written off: దేశంలో బడా కార్పొరేట్ల రుణాలను బ్యాంకులు ఇష్టానుసారం మాఫీ చేస్తూ.. సామాన్య ప్రజలపై భారం వేస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దేశంలోని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు రూ.10.09లక్షల కోట్లపై పైగా విలువైన రుణాలను మాఫీ చేశాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్..(Nirmala Sitharaman) లోక్‍సభలో సోమవారం వెల్లడించారు. అయితే, రుణాలు తీసుకొని బకాయి పడిన వారి నుంచి వసూలు చేసే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. నిరర్థక ఆస్తుల (NPA) అకౌంట్లలో రికవరీ అనేది నిరంతరం సాగే ప్రక్రియ అని వెల్లడించారు.
ప్రభుత్వ బ్యాంకుల రికవరీ ఇలా..
Bank Loans Written off: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గణాంకాల ప్రకారం, గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ బ్యాంకులు రూ.4,80,111 కోట్లు వసూలు చేశాయని ఆర్థిక మంత్రి చెప్పారు. అందులో రూ.1,03,045 కోట్లు మాఫీ చేసిన వాటి నుంచి రికవరీ చేశాయని వెల్లడించారు.
మాఫీ అయినా వసూలు
Loans Written off: “ఆర్బీఐ నుంచి అందిన సమాచారం ప్రకారం, ఐదు ఆర్థిక సంవత్సరాల్లో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు రూ.10,09,511 కోట్ల రుణాలను మాఫీ చేశాయి. అయితే రుణాలు మాఫీ అయినా, వాటిని తీర్చే బాధ్యత ఇంకా రుణం తీసుకున్న వారిపై ఉంటుంది. ఆ బకాయిలను తిరిగి వసూలు చేసే ప్రక్రియ కొనసాగుతుంది” అని లోక్‍సభ క్వశ్చన్ హవర్‌లో ఎదురైన ఓ ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా మాఫీ అయిన రుణాలను కూడా రికవరీ చేసేందుకు బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయని ఆమె చెప్పారు. మాఫీ వల్ల రుణం తీసుకున్న వారికి బెనిఫిట్ ఉండదనేలా చెప్పారు. మొండి బకాయిలను నిర్ణీత కాలపరిమితి తర్వాత బ్యాంకులు నిరర్థక ఆస్తులుగా పరిగణిస్తాయి.
ఆర్బీఐ మార్గదర్శకాలు, బ్యాంకుల బోర్డులు ఆమోదించిన పాలసీల ప్రకారం నాలుగేళ్లు పూర్తయిన ఎన్‍పీఏలను బ్యాలెన్స్ షీట్‍ల నుంచి మాఫీల ద్వారా బ్యాంకులు తొలగిస్తాయి. బ్యాలెన్స్ షీట్‍లను ప్రక్షాణళ చేసేందుకు, పన్ను ప్రయోజనాలను పొందేందుకు, మూలధనాన్ని సరిచేసుకోవడంలో భాగంగా ఈ రుణ మాఫీల ప్రభావాన్ని బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయని ఆర్థిక మంత్రి చెప్పారు. ఆస్తులను జప్తు చేసే సమయంలో బ్యాంకులకు చాలాసార్లు న్యాయపరమైన ప్రక్రియ ఆలస్యమవుతోందని ఆమె అన్నారు. జప్తు చేసిన ఆస్తులకు ఎక్కువ మంది హక్కుదారులు ఉన్న సమయంలో మరింత క్లిష్టంగా ఉంటోందని చెప్పారు.
కాగా, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశంలోని కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు మాఫీ చేస్తున్నాయని కాంగ్రెస్‍తో పాటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సామాన్య ప్రజల నుంచి ముక్కు పిండి అప్పులు వసూలు చేసే బ్యాంకులు.. బడా వ్యాపారవేత్తలకు రుణాలను మాఫీ చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి.
టాపిక్