Indian shot dead in US: అమెరికాలో భారతీయుడిని కాల్చి చంపిన దుండగులు; ఈవినింగ్ వాక్ చేస్తుండగా దారుణం
Indian shot dead in US: అమెరికాలో మరో భారతీయుడు దుండగుల కాల్పులకు బలయ్యాడు. కోల్ కతా కు చెందిన ప్రముఖ నాట్య కారుడు అమర్ నాథ్ ఘోష్ ను అమెరికాలో దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ విషయాన్ని ప్రముఖ టెలివిజన్ నటి దేవోలీనా భట్టాచార్య వెల్లడించారు.
Indian shot dead in US: అమెరికాలో మరో భారతీయుడు తుపాకీ కాల్పులకు బలయ్యాడు. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో అత్యంత నైపుణ్యం ఉన్న ప్రముఖ డాన్సర్ అమర్ నాథ్ ఘోష్ ను మిస్సోరిలో దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. అతడిపై చాలా దగ్గర నుంచి పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. అమర్ నాథ్ ఘోష్ మృతిపై ప్రముఖ టెలివిజన్ నటి దేవోలీనా భట్టాచార్జీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సాయంత్రం వాకింగ్ కు వెళ్లిన అమర్ నాథ్ ఘోష్ ను దుండగులు దారుణంగా కాల్చిచంపారని తెలియజేశారు.
ప్రధాని మోదీకి వినతి
అమర్ నాథ్ ఘోష్ మృతదేహాన్ని భారత్ కు తీసుకురావడానికి అతడి స్నేహితులు ప్రయత్నిస్తున్నారు. కానీ, అమెరికా అధికారుల నుంచి వారికి సహకారం అందడం లేదు. ఆయన హత్యకు కారణాలను కూడా యూఎస్ పోలీసులు వెల్లడించడం లేదు. ఈ నేపథ్యంలో అమర్ నాథ్ ఘోష్ హత్యకు గల కారణాలపై వివరాలు సేకరించాలని దేవోలీనా భట్టాచార్య ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని కోరారు. ఆయన మృతదేహాన్ని భారత్ కు తీసుకురావడానికి సహకరించాలని అభ్యర్థించారు.
ఒంటరివాడు..
‘‘అమెరికాలోని సెయింట్ లూయిస్ అకాడమీ పరిసరాల్లో మంగళవారం సాయంత్రం నా స్నేహితుడు అమర్ నాథ్ ఘోష్ ను కాల్చి చంపారు. ఆయన వారి కుటుంబంలో ఏకైక సంతానం. తన తల్లి మూడేళ్ల క్రితమే చనిపోయింది. చిన్నతనంలోనే ఆయన తండ్రి చనిపోయారు. అతడి కోసం పోరాడటానికి అతని కొద్దిమంది స్నేహితులు తప్ప ఎవరూ మిగలలేదు. అతను కోల్కతాకు చెందినవాడు. అద్భుతమైన డ్యాన్సర్. యూఎస్ లో పీహెచ్ డీ చేస్తున్నాడు. సాయంత్రం వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుర్తుతెలియని వ్యక్తి పలుమార్లు కాల్పులు జరిపాడు. అమెరికాలోని కొందరు స్నేహితులు శవాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ దాని గురించి ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు. వీలైతే @IndianEmbassyUSkindly చూడండి. కనీసం ఆయన హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. @DrSJaishankar @narendramodi’’ అని దేవోలీనా భట్టాచార్య ఎక్స్ లో పోస్ట్ చేశారు.
అమెరికాలో భారతీయులపై నేరాలు
ఇటీవల అమెరికాలో భారతీయులపై నేరాలు పెరిగాయి, గత రెండు నెలల్లో అనేక మరణాలు నమోదయ్యాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థి సమాజం అనేక విద్వేషపూరిత నేరాలతో సతమతమవుతోంది. వారి ఫిర్యాదులకు సరైన పరిష్కారం లభించడం లేదు. జనవరిలో జార్జియాలో హర్యానాకు చెందిన వివేక్ సైనీ దారుణ హత్యకు గురికాగా, సమీర్ కామత్ అనుకోని కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. అకుల్ ధావన్ మరణం, నీల్ ఆచార్య అనుమానాస్పద మృతి అమెరికాలోని భారతీయులకు అసురక్షిత పరిస్థితులను ఎత్తిచూపుతున్న మరికొన్ని ఉదాహరణలు.