Kim Jong Un cries: కన్నీళ్లు పెట్టుకున్న నియంత నేత కిమ్..
Kim Jong Un cries: నియంత నేతగా, కఠిన హృదయమున్న దేశాధ్యక్షుడిగా పేరుగాంచిన ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదీ ఒక బహిరంగ వేదికపై. ఈ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Kim Jong Un cries: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కన్నీళ్ల పెట్టుకున్నాడు. నియంతగా పేరుగాంచిన కిమ్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ కిమ్ అంతగా బాధ పడడానికి కారణం ఏంటి..?
తల్లులను అభ్యర్థిస్తూ..
ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో, గత కొంత కాలంగా జనాభా పెరుగుదలపై కిమ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా, ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆ దేశాధ్యక్షుడు కిమ్ దేశంలోని మహిళలను అభ్యర్థించాడు. ఈ సందర్భంగానే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. దేశంలో యువ శక్తి తగ్గిపోతోందని, అందువల్ల సాధ్యమైనంత ఎక్కువగా పిల్లలకు జన్మనివ్వాలని ఆయన తన దేశంలోని తల్లులకు పిలుపునిచ్చారు. ప్యాంగ్యాంగ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తగ్గిపోతున్న జనన రేటుపై కిమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వడమే కాకుండా వారికి మంచి చదువును, భవిష్యత్తును ఇద్దామని అన్నారు.
1.8 శాతమే..
ఐరాస నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియాలో 2023లో ఒక తల్లి సగటున జన్మనిచ్చే పిల్లల సంఖ్య 1.8 గా ఉంది. 1970- 80 దశకంలో ఉత్తర కొరియాలో జనాభా వృద్ధిని తగ్గించే కఠినమైన గర్భ నిరోధక విధానాలను అవలంబించారు. దాంతో, అప్పటినుంచి దేశ జనాభా క్రమంగా తగ్గుతూ వచ్చింది. మరోవైపు, 1990 లలో వచ్చిన కరువు కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో, జననాల రేటును పెంచడానికి ప్రభుత్వం నడుం బిగించింది. ముగ్గురు లేదా ఆపై పిల్లలకు జన్మనిచ్చిన కుటుంబాలకు ప్రత్యేక ప్రయోజనాలను ప్రకటించింది. ఉచిత నివాసం, ఉచిత ఔషధాలు, ఉచిత విద్య, ఉచితంగా నిత్యావసరాలు.. మొదలైన ప్రయోజనాలు అందులో ఉన్నాయి.