Amritpal Singh: ఇంకా పరారీలోనే ఖలిస్థానీ లీడర్ అమృత్‍పాల్ సింగ్: "నా కొడుకుకు ఏమవుతుందో!": అమృత్‍పాల్ తండ్రి-khalistani leader amrirpal singh still fugitive father responds ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Amritpal Singh: ఇంకా పరారీలోనే ఖలిస్థానీ లీడర్ అమృత్‍పాల్ సింగ్: "నా కొడుకుకు ఏమవుతుందో!": అమృత్‍పాల్ తండ్రి

Amritpal Singh: ఇంకా పరారీలోనే ఖలిస్థానీ లీడర్ అమృత్‍పాల్ సింగ్: "నా కొడుకుకు ఏమవుతుందో!": అమృత్‍పాల్ తండ్రి

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 19, 2023 10:28 AM IST

Amritpal Singh: ఖలీస్థానీ లీడర్ అమృత్‍పాల్ సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయనను పట్టుకునేందుకు పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టినా ఫలించలేదు. పోలీసులు ఇంకా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమృత్ పాల్ సింగ్ తండ్రి మాట్లాడారు.

అమృత్‍పాల్ సింగ్ తండ్రి తర్సెం సింగ్
అమృత్‍పాల్ సింగ్ తండ్రి తర్సెం సింగ్ (ANI Photo)

Amritpal Singh: ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే (Waris Punjab De) చీఫ్ అమృత్‍పాల్ సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నారు. పంజాబ్ పోలీసులు సుమారు 100 కార్లతో ఆయనను అరెస్టు చేసేందుకు శనివారం భారీ ఆపరేషన్ చేశారు. అమృత్‍పాల్‍ను పట్టుకున్నట్టు ఓ దశలో సమాచారం వెల్లడైనా.. ఆయన తప్పించుకున్నట్టు ఆ తర్వాత పోలీసు అధికారులు స్పష్టత ఇచ్చారు. ఆదివారం కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ తరుణంలో అమృత్‍పాల్ తండ్రి తర్సెం సింగ్ (Tarsem Singh) స్పందించారు. అమృత్‍పాల్ ప్రస్తుతం ఎక్కడున్నారో తమకు తెలియదని చెప్పారు. తమ ఇంట్లో పోలీసులు 3-4 గంటలు సోదాలు చేశారని, ఎలాంటి అక్రమ విషయాలు గుర్తించలేదని తర్సెం తెలిపారు. అమృత్‍పాల్‍కు ఏం జరుగుతుందోనని తమకు ఆందోళనగా ఉందని అన్నారు.

78 మంది అరెస్టు

Amritpal Singh: అమృత్‍పాల్ సింగ్‍ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు శనివారం భారీ ఆపరేషన్ చేశారు. వందలాది వాహనాలు, వేలాది మంది పోలీసులు అమృత్‍పాల్ సింగ్‍ను చేజ్ చేశారు. పలు జిల్లాల్లో ఈ ఆపరేషన్ సాగగా.. చాలా చోట్ల సోదాలు జరిగాయి. మొత్తంగా వారిస్ పంజాబ్ దేకు చెందిన చెందిన 78 మంది అమృత్‍పాల్ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అమృత్‍పాల్‍ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తొలుత సమాచారం వచ్చినా.. అయితే ఆయన దొరకలేదని ఆ తర్వాత వెల్లడైంది. అమృత్‍పాల్ ఇంకా పరారీలోనే ఉన్నారని, చివరగా ఓ బైక్ పై వెళుతూ కనిపించారని తెలుస్తోంది. ఈ తరుణంలో అమృత్‍పాల్ తండ్రి స్పందించారు.

మాకే సరైన సమాచారం లేదు

Amritpal Singh: "అమృత్‍పాల్ సింగ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మాకే సరైన సమాచారం లేదు. రెండు - మూడు గంటల పాటు పోలీసులు మాఇంట్లో సోదాలు చేశారు. అక్రమమైనవి వారికి ఏమీ దొరకలేదు. ఉదయమే అమృత్‍పాల్ ఇంటి నుంచి బయటికి వెళ్ళారు. అప్పుడే పోలీసులు అరెస్ట్ చేయాల్సింది" అని తర్సెం సింగ్ అన్నారు. అమృత్‍పాల్ సరెండర్ కావాలంటూ పోలీసులు తమకు చెప్పారని అన్నారు.

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఉన్నందుకే..

Amritpal Singh: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అమృత్‍పాల్ పోరాడుతున్నారని, అందుకే అతడిని అరెస్ట్ చేయాలనే ఒత్తిడి వస్తోందని తర్సెం సింగ్ చెప్పారు. "ప్రతీ ఇంట్లోనూ డ్రగ్స్ ఉన్నాయి. అయితే ఈ సమస్యపై ఎవరూ దృష్టి సారించడం లేదు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అమృత్‍పాల్ పోరాడుతున్నారు. అందుకే ఆయనను అరెస్ట్ చేయాలని రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. డ్రగ్స్ భూతాన్ని అంతం చేసేందుకు ఎవరైనా పోరాడితే వారిని అడ్డుకుంటారు" అని తర్సెం సింగ్ అన్నారు. అమృత్‍పాల్ సింగ్‍కు ఏమైనా జరుగుతుందోమోనని ఆందోళన చెందుతున్నామని ఆయన చెప్పారు.

అమృత్‍పాల్ సింగ్‍ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు శనివారం భారీ ఆపరేషన్ చేశారు. సుమారు 100 కార్లతో చేజ్ చేశారు. అయితే అమృత్‍పాల్ తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్‍లోని చాలా ప్రాంతాల్లో ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ సేవలను పోలీసులు నిలిపివేశారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ఇంటర్నెట్ నిలిపివేత ఉంటుంది. ఇది అమృత్‍పాల్ కోసం ఆపరేషన్ ఇంకా జరుగుతుండటంతో.. ఇంటర్నెట్ బంద్ పొడించే అవకాశం ఉంది.

Whats_app_banner

టాపిక్