Kerala governor: నడి రోడ్డుపై ధర్నాకు దిగిన గవర్నర్; రాష్ట్రప్రభుత్వంతో విబేధాలే కారణం-kerala governor sfi face off again arif mohammed stages wayside dharna ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kerala Governor: నడి రోడ్డుపై ధర్నాకు దిగిన గవర్నర్; రాష్ట్రప్రభుత్వంతో విబేధాలే కారణం

Kerala governor: నడి రోడ్డుపై ధర్నాకు దిగిన గవర్నర్; రాష్ట్రప్రభుత్వంతో విబేధాలే కారణం

HT Telugu Desk HT Telugu
Jan 27, 2024 03:09 PM IST

Kerala governor stages dharna: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళలోని వాపపక్ష ప్రభుత్వం మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. తాజాగా, అధికార సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ రోడ్డుపై ధర్నాకు దిగారు.

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ (ANI)

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ శనివారం కొల్లం జిల్లా నీలమేల్ లో రోడ్డు పక్కన ఉన్న దుకాణం వద్ద ధర్నాకు కూర్చున్నారు. తనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన ఎస్ ఎఫ్ ఐ కార్యకర్తలను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ చర్యకు ఉపక్రమించారు. ఎస్ఎఫ్ఐ (SFI) కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం అన్న విషయం తెలిసిందే.

కుర్చీ వేసుకుని..

గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ (Kerala governor Arif Mohammed Khan) తన వాహనం దిగి నీలమేల్ లోని రద్దీగా ఉండే ఎంసి రోడ్డులోని దుకాణం నుండి కుర్చీ తీసుకొని నిరసనకారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కూర్చున్నాడు. తాను ఇక్కడి నుంచి వెళ్లబోనని, పోలీసులు ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేయకుండా.. వారికి ప్రొటెక్షన్ సైతం ఇస్తున్నారని ఖాన్ ఆరోపించారు. టీవీ చానెళ్లలో ప్రసారమైన నాటకీయ దృశ్యాల్లో కోపంగా ఉన్న ఖాన్ పోలీసు సిబ్బందితో కఠినంగా మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి. పోలీసు అధికారులతో పాటు ఖాన్ వ్యక్తిగత అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సమీపంలోని కొట్టారక్కరకు వెళ్తున్న గవర్నర్ కు వ్యతిరేకంగా అధికార సీపీఎం విద్యార్థి విభాగం ఎస్ ఎఫ్ ఐ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వంతో ఫైట్

కేరళ లో అధికారంలో ఉన్న సీపీఎం ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య చాన్నాళ్లుగా విబేధాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఆమోదించిన కొన్ని బిల్లులపై ఆయన సంతకం చేయకపోవడం వంటి పలు అంశాలపై కేరళ గవర్నర్, వామపక్ష ప్రభుత్వం మధ్య విభేదాలు ఉన్నాయి. శుక్రవారం రాజ్ భవన్ లో నిర్వహించిన 'ఎట్ హోమ్' కార్యక్రమానికి ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన మంత్రివర్గ సహచరులు, ఎల్డీఎఫ్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించినా వారెవరూ రాలేదు. కేరళ ప్రభుత్వం తరఫున సాధారణ పరిపాలన శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కేఆర్ జ్యోతిలాల్ మాత్రం వచ్చారు.

పక్క పక్కనే కూర్చున్నా..

గురువారం కేరళ అసెంబ్లీలో.. సమావేశాల తొలిరోజున గవర్నర్ చేయాల్సిన పాలసీ ప్రసంగాన్ని ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కేవలం రెండు నిమిషాల్లో ముగించారు. ఆయన మొదటి, చివరి పేరాలను మాత్రమే చదివి వినిపించారు. దీనిపై ప్రభుత్వ, విపక్ష సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని, అసెంబ్లీని అవమానించడమేనని విమర్శించారు. జనవరి 26వ తేదీన రాష్ట్ర రాజధానిలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా గవర్నర్ ఖాన్, ముఖ్యమంత్రి విజయన్ పక్కపక్కనే కూర్చున్నప్పటికీ ఒకరినొకరు పట్టించుకోలేదు.

Whats_app_banner