KCR: కాంగ్రెస్‍కు కేసీఆర్ లవ్ సిగ్నల్స్.. తాత్కాలికమా.. భారీ వ్యూహమా!
KCR: కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని గత యూపీఏ పాలనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అసెంబ్లీ వేదికగా ప్రశంసలు కురిపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‍ను కీర్తించారు. అయితే కేసీఆర్ కొత్తగా ఈ రాగం ఎందుకు అందుకున్నారు? దీని వెనుక భారీ వ్యూహం ఉందా?
KCR: “మనసా నిలకడగా ఉండు.. నువ్వు మళ్లీ ప్రేమలో పడిపోతున్నావు.. ఓ హృదయమా.. పదిలంగా ఉండు.. నువ్వు మళ్లీ ప్రేమలో మునిగిపోనున్నావ్..” అనే అర్థంతో ఓ బాలీవుడ్ పాట ఉంది. ప్రేమలో పడే ముందు ఎలా ఉంటుందో వర్ణించేందుకో.. లేకపోతే వాలెంటైన్స్ రోజున ప్రేమ గురించి చెప్పేందుకో మీకు ఈ లిరిక్స్‌ను గుర్తుచేయడం లేదు. భారత రాష్ట్ర సమితి (BRS) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (KCR) అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలన(2004-14)ను ప్రశంసిస్తున్న సమయంలో.. ఈ పాట తలపుల్లోకి వచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ను, ఆయన నేతృత్వంలో సాగిన 10ఏళ్ల యూపీఏ (UPA) పాలనపై కేసీఆర్ ఇన్నాళ్ల తర్వాత పొగడ్తల వర్షం కురిపించారు. 2004-14 మధ్య ప్రధానిగా మన్మోహన్ సింగ్ సాధించిన విజయాలను, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్లుగా చేస్తున్న పాలనతో పోల్చారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ఎన్నో ప్రశ్నలకు, అంచనాలకు దారి తీశాయి.
ఇంత హఠాత్తుగా ఎందుకు?
ఎంతో హఠాత్తుగా, ఎవరూ ఊహించని విధంగా, ఇన్నేళ్ల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంను ప్రశంసించడం కేసీఆర్ వ్యూహంలో భాగమేనని, ఆయన చాలా లెక్కలు వేసుకొనే ఇలా చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీలో తన ప్రసంగంలో మన్మోహన్ సింగ్ నేతృతంలోని యూపీఏ పాలనపై పొగడ్తల వర్షం కురిపించడం ఇందులో భాగమేనని అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్‍లో కలవరం
యూపీఏ పాలనపై కేసీఆర్ సడన్‍గా ప్రశంసలు కురిపించడం ఇప్పడు కాంగ్రెస్‍ను ఆశ్చర్యానికి, కలవరపాటుకు గురి చేస్తోంది. ఎందుకంటే, ఇంతకు ముందెప్పుడు యూపీఏ పాలనను కేసీఆర్ మరీ ఇంతలా పొడిగిన సందర్భాలు లేవు. ఆయన వ్యూహమేంటో అంతుచిక్కక హస్తం పార్టీ సతమతమవుతోంది.
మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో సాధించిన విజయాలను కాంగ్రెస్ నేతలు ఎన్నడూ బలంగా చెప్పలేకపోయారు. కేసీఆర్ ఇప్పుడు చేసిన పనిని హస్తం పార్టీ ఇంతకు ముందు సమర్థవంతంగా చేయలేకపోయింది. మన్మోహన్ సింగ్‍ను అత్యంత బలహీనమైన ప్రధాని అని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ విమర్శిస్తున్నా.. కాంగ్రెస్ నేతలు బలంగా తిప్పికొట్టలేకపోయారు. ఈ విషయంలో హస్తం పార్టీ నాయకులు పూర్తిగా విఫలమయ్యారు.
బీజేపీపై దాడికి ‘మన్మోహన్ అస్త్రం’
రాజకీయాల్లో అపర చాణక్యుడైన కేసీఆర్.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీపై దాడి చేసేందుకు మన్మోహన్ సింగ్ సాధించిన విజయాలను అస్త్రాలుగా మలుచుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఈ పని చేయలేకపోయింది. గత ఎనిమిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా కమలం పార్టీని ఇరుకునపెట్టలేకపోయింది. బీజేపీ విమర్శలను తిప్పికొట్టలేకపోయింది.
“అధికారాన్ని కోల్పోకముందే మన్మోహన్ సింగ్ పాలనపై అప్రతిష్ట ముద్ర పడింది. ప్రస్తుతం నరేంద్ర మోదీ హయాంతో పోలిస్తే మన్మోహన్ సింగ్ హయాంలో నాటి పాలన ఎంతో మెరుగ్గా ఉండేది. ఆయన తర్వాత వచ్చిన మోదీ.. భారత చరిత్రలోనే అత్యంత విఫల ప్రధానిగా నిరూపితమవుతున్నారు. ఛాతిని చరుచుకోవడం, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం తప్ప దేశానికి మోదీ చేసింది ఏమీ లేదు. ఎంతో అత్యుత్తమంగా పని చేసినా.. మోదీకి వచ్చిన పేరు మన్మోహన్ సింగ్‍కు రాలేదు” అని గత వారం అసెంబ్లీ వేదికగా కేసీఆర్ అన్నారు. ప్రధాని మోదీపై విమర్శల దాడిని మరింత పెంచారు.
యూపీఏ హయాంను కేసీఆర్ ప్రశంసించడంతో తెలంగాణ బీజేపీ రంగంలోకి దిగింది. కాంగ్రెస్‍తో కేసీఆర్ పార్టీకి పొత్తు ఉందనే రాగం అందుకున్నారు కషాయ పార్టీ నేతలు.
కేసీఆర్ సిగ్నల్స్ ఇవేనా..
బీజేపీని విమర్శించేందుకు యూపీఏ ప్రభుత్వ హయాంను కేసీఆర్ అస్త్రంగా వాడుకున్నారని ఇప్పుడు భావించినా.. భవిష్యత్తులో అవసరమైతే బీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమి సాధ్యమవుతుందనేలా ఆయన ఓ సిగ్నల్స్ పంపినట్టు అనిపిస్తోంది. కేసీఆర్ రాజకీయ తంత్రాలు, ఎత్తుగడల గురించి తెలిసిన వారు ఈ విషయాన్ని “అవును” అనే అంగీకరిస్తారు. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2024 లోక్‍సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‍తో బీఆర్ఎస్ జత కట్టే అవకాశాన్ని కొట్టిపారేయలేకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్‍తో పొత్తు వాదనను కేసీఆర్ సహా ఆయన పార్టీ నేతలు ప్రస్తుతం పూర్తిగా కొట్టిపారేయలేకున్నారు. అలాగే అవసరమైతే జాతీయస్థాయిలో హస్తం పొత్తుకు కేసీఆర్ విముఖత వ్యక్తం చేయకపోవచ్చు.
తెలంగాణలో ఇలా..
ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే పొత్తు గురించిన సంకేతాలను కాంగ్రెస్‍కు కేసీఆర్ పంపకపోవచ్చు. రాష్ట్రంలో బీజేపీని తికమకపెట్టేందుకు ఇదో రకమైన ఎత్తుగడగా ఉండొచ్చు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ విజయాలను అస్త్రంగా చేసుకొని ప్రధాని మోదీ, బీజేపీపై తీవ్రంగా దాడి చేసిన కేసీఆర్.. తాత్కాలిక రాజకీయ ఎత్తుగడతోనే ఇలా చేశారా.. లేక వారి పార్టీ స్టాండ్ ఇదేనా అన్నది త్వరలోనే తెలుస్తుంది. ఎందుకంటే 2024 ఎన్నికల కోసం బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల కూటమి ఎలా ఉంటుందన్న విషయంలోనే త్వరలోనే స్పష్టత రావొచ్చు. అప్పుడు కేసీఆర్ అసలు ఉద్దేశమేంటో స్పష్టం కావొచ్చు.
అయితే, 2014 నుంచి ఇటీవలి వరకు కేసీఆర్, ఆయన పార్టీ టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్).. బీజేపీ ప్రవేశపెట్టిన చాలా పాలసీలకు మద్దతు తెలిపింది. ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో బీజేపీ తీసుకొచ్చిన కీలకమైన బిల్లులకు మద్దతుగా ఓటేశారు. దీంతో బీజేపీకి టీఆర్ఎస్ బీ-టీమ్ అని, అధికార కూటమిలో ఉన్న పార్టీల కన్నా నమ్మదగిన భాగస్వామి అంటూ ఎన్నో వాదనలు వినిపించాయి. అనేక విషయాలపై విపక్షాలన్నీ బీజేపీని తీవ్రంగా ఎండగడుతున్న సమయంలోనూ.. టీఆర్ఎస్ నేతలు కొందరు నరేంద్ర మోదీని గతంలో వెనకేసుకొచ్చారు. ఈ జాబితాలో కేసీఆర్ కూడా ఉన్నారు. నోట్ల రద్దును సమర్థించేలా గతంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ ‘రూటు’ మార్చింది ఇందుకే!
అయితే, బీజేపీ విషయంలో కేసీఆర్ ఒక్కసారిగా వ్యూహాన్ని మార్చుకునేందుకు దారి తీసిన పరిస్థితులేంటి? దీనికి సులభమైన సమాధానం ఏటంటంటే - “తెలంగాణలో బీజేపీ బలపడుతుండడం” అని చెప్పవచ్చు. కాంగ్రెస్‍కు ప్రత్యామ్నాయంగా.. వేగంగా.. అంతకు మించిన బలంతో తెలంగాణలో బీజేపీ ఎదుగుతోంది. దీంతో రాష్ట్రంలో కషాయ పార్టీని అడ్డుకునేందుకు.. జాతీయస్థాయిలోనూ యుద్ధం చేసేందుకే కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది.
ఎక్కువ మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి లాగేసి తెలంగాణలో కాంగ్రెస్‍ను కేసీఆర్ ఎప్పుడో కోలుకోలేని దెబ్బకొట్టారు. తెలంగాణలో హస్తం పార్టీ మనుగడకే ప్రమాదాన్ని తెచ్చారు. ఈ క్రమంలో బీజేపీ నుంచి ఉన్న ముప్పును ఆయన గుర్తించలేకపోయారు.
వాస్తవాన్ని కొంతకాలం క్రితం గ్రహించిన కేసీఆర్.. కాషాయ పార్టీపై యుద్ధం ప్రకటించారు. తన సొంత గేమ్‍ను తనకే రుచిచూపిస్తున్న బీజేపీతో కయ్యానికే కాలు దువ్వారు.
ఎప్పటికైనా ‘ముప్పే’ అని..
బీజేపీ పట్ల అనుకూల ధోరణి కనబరచడం, అంటకాగడం వల్ల తనకు, తన పార్టీకి మంచిది కాదని రాజకీయాల్లో ఆరితేరిన కేసీఆర్ గుర్తించారు. బీజేపీ వల్ల తెలంగాణలో బీఆర్ఎస్‍కు ముప్పు తప్పదని ఆలోచించిన కేసీఆర్.. ఇక దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టి.. దాన్ని ముందుండి నడిపించాలని నిశ్చయించుకున్నారు.
అయితే, బీఆర్ఎస్ జాతీయ లక్ష్యాలను, ప్రతిపక్షాలకు చెందిన ఇతర ప్రాంతీయ పార్టీల స్థానిక ప్రయోజనాలను బ్యాలెన్స్ చేయలేకపోతున్నట్టు కేసీఆర్ గ్రహిస్తున్నారు. ఈ కారణంగానే వామపక్షాలు సహా కొన్ని ప్రాంతీయ పార్టీల నేతల నుంచి తన ‘జాతీయ కూటమి’కి సరైన స్పందన రావడం లేదనే విషయాన్ని కేసీఆర్ గుర్తించారు. అందుకే తన పార్టీకి ముప్పుగా పరిణమిస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు ఆయన కొత్త వ్యూహాన్ని అమలు చేసేందుకు ఆలోచిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల అవగాహన అవసరమైనా.. ఆయన దాన్ని కూడా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.
రాష్ట్రంలో ‘నో’
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‍తో నేరుగా పొత్తు పెట్టుకునేందుకు కేసీఆర్ విముఖత వ్యక్తం చేయొచ్చు. ఒకవేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిస్తే.. మార్పు కోసం తమ పార్టీని ఎన్నుకోవాలంటూ, తామే ఏకైక ప్రత్యామ్నాయంటూ బీజేపీ చెప్పుకునే అవకాశం వస్తుంది. ఇది కేసీఆర్‌కు బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కేసీఆర్ + కాంగ్రెస్ స్ట్రాటజీ తెలంగాణలో బీజేపీకే లాభిస్తుంది. రాజకీయాల్లో చతురమైన ఎత్తుగడలకు పేరుగాంచిన కేసీఆర్.. ఒకవేళ ఈ విషయాన్ని విస్మరిస్తే నష్టమే ఎదురుకావొచ్చు.
కేసీఆర్‌ను అధికారంలో నుంచి దించేయాలన్న బీజేపీ లక్ష్యం నెరవేరాలంటే రాష్ట్రంలో కీలకమైన పరిణామాలు బలంగా జరగాలి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి మళ్లాలి లేదా టీఆర్ఎస్ ఓటు షేర్ 4 నుంచి 5 శాతం ఆ పార్టీకి దక్కాలి. లేకపోతే టీఆర్ఎస్‍కు ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకోవాల్సిందేనని ప్రజల్లో బలమైన కాంక్ష ఉండాలి. వీటిలో ఏదో ఒకటి జరిగితేనే బీజేపీ తన లక్ష్యాన్ని సాధించే ఛాన్స్ ఉంటుంది.
అయితే, ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. ఈ పరిణామాలు ఇప్పటికిప్పుడు జరిగేలా కనిపించడం లేదు. ఒకవేళ తెలంగాణలో కేసీఆర్, కాంగ్రెస్ కలిసికట్టుగా పోటీ చేయాలని నిర్ణయించుకునే భారీ తప్పిదాన్ని చేస్తే తప్ప ఇది సాధ్యమయ్యే అవకాశాలు లేనట్టే!.
అందుకే, రాష్ట్రంలో కాంగ్రెస్‍తో పొత్తు పెట్టుకోకుండా.. పాక్షికంగా వైరుధ్య భావాన్ని తగ్గించుకునే వ్యూహాన్ని కేసీఆర్ అనుసరిస్తున్నారు. ఇది లోక్‍సభ ఎన్నికలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.
కాంగ్రెస్ ‘మనుగడ’ కేసీఆర్‌కు అవసరం
తెలంగాణలో కాంగ్రెస్ మనుగడలో ఉండడం ఇప్పుడు కేసీఆర్‌కు కూడా చాలా అవసరం. అందుకే మోదీ ఎనిమిదేళ్ల పాలనను విమర్శించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని గత హయాంను కేసీఆర్ నెత్తిన ఎత్తుకున్నారు.
వ్యూహాలు, ప్రణాళికల్లో తీవ్రంగా విఫమలవుతోన్న కాంగ్రెస్‍ను తెలంగాణలో జీజేపీ మూడో స్థానానికి నెట్టేసిందనేలా ప్రస్తుత పరిస్థితి ఉంది. సొంత తప్పిదాలు హస్తం పార్టీకి ప్రతికూలంగా ఉన్నాయి. బీఆర్ఎస్‍కు తమ పార్టీయే ప్రత్యామ్నాయం అని హస్తం పార్టీ ప్రదర్శించుకోలేకపోతోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి బలం పుంజుకోవడం ఇప్పట్లో కేసీఆర్‌కు ఇబ్బంది కలిగించే విషయం కాకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను పూర్తిగా తమ వైపునకు తిప్పుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు. బీఆర్ఎస్‍కు సవాలుగా మారిన బీజేపీ స్థానాన్ని ఇప్పటికిప్పుడు హస్తం పార్టీ భర్తీ చేయలేకపోవచ్చు. కాంగ్రెస్ బలపడితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు మరింత చీలి బీఆర్ఎస్‍కు లాభిస్తుంది.
అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికిని చాటుకునేందుకు అనుమతించేందుకే కేసీఆర్ సుముఖంగా ఉన్నారు. ఈ దిశగానే మన్మోహన్ సింగ్ మంత్రాన్ని కేసీఆర్ జపించారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుకూల పవనాలను కేసీఆర్ పంపుతున్నారు.
మన్మోహన్ సింగ్‍ను, యూపీఏ పాలనను ప్రశంసిస్తూ కాంగ్రెస్‍పై కేసీఆర్ హఠాత్తుగా ప్రేమ కురిపించారు. అయితే దీనివల్ల హస్తం పార్టీకి లాభించేలా చేయాలన్నది ఆయన ఉద్దేశం కాదు. మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల, బీజేపీ నుంచి ఎదురవుతున్న సవాళ్లను తిప్పికొట్టేందుకు ఆయన కొత్త వ్యూహాన్ని చేపట్టారు. తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగినా తమకు వచ్చిన ప్రమాదం ఏమీలేదని కేసీఆర్ భావిస్తున్నారు.