Traitors Day: ‘‘జూన్ 20వ తేదీని ద్రోహుల దినోత్సవంగా ప్రకటించండి’’: ఐరాసకు ఎంపీ వ్యంగ్య వినతి-just as june 21 is world yoga day rauts plea to un for world traitors day ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Traitors Day: ‘‘జూన్ 20వ తేదీని ద్రోహుల దినోత్సవంగా ప్రకటించండి’’: ఐరాసకు ఎంపీ వ్యంగ్య వినతి

Traitors Day: ‘‘జూన్ 20వ తేదీని ద్రోహుల దినోత్సవంగా ప్రకటించండి’’: ఐరాసకు ఎంపీ వ్యంగ్య వినతి

HT Telugu Desk HT Telugu
Jun 20, 2023 03:28 PM IST

జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అమెరికాలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా శివసేన ఎంపీ ఐక్యరాజ్య సమితికి ఒక వింత వినతిని చేశారు.

శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్
శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్

జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన విధంగానే.. జూన్ 20వ తేదీని అంతర్జాతీయ ద్రోహుల దినోత్సవం (World Traitors Day) గా ప్రకటించాలని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ ఐక్యరాజ్య సమితిని కోరారు. ఈ మేరకు ఆయన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటొనియో గ్యుటెరస్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖను ట్విటర్ లో షేర్ చేశారు. ఆ ట్వీట్ కు ఐరాస, బీజేపీ, పీఎంఓ, యూనిసెఫ్, యూఎన్ఇండియా, ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్.. తదితరులను ట్యాగ్ చేశారు.

జూన్ 20 ద్రోహుల దినోత్సవం

అంతర్జాతీయ ద్రోహుల దినోత్సవం (World Traitors Day) గా జూన్ 20వ తేదీనే ప్రకటించాలని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేయడం వెనుక ఒక కారణముంది. గత సంవత్సరం జూన్ 20వ తేదీన శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో సుమారు 40 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసి, ఆయనను సీఎం పదవి నుంచి దించేశారు. ఆ సమయంలో దాదాపు 10 రోజుల పాటు మహారాష్ట్రలో హై డ్రామా చోటు చేసుకుంది. షిండే నాయకత్వలో ఆ తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీ అధికారంలో ఉన్న అస్సాంలోని ఒక రిసార్ట్ లో బస చేశారు. ఆ తిరుగుబాటు కారణంగా, ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవిని కోల్పోవడమే కాకుండా, శివసేన కూడా రెండు ముక్కలయింది. శివసేన (షిండే వర్గం) నేత ఏక్ నాథ్ షిండే బీజేపీ మద్ధతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఈ మొత్తం కుట్రకు బీజేపీదే ప్రణాళిక అని శివసేన ఆరోపించింది. ఈ ఘటనను ప్రస్తావిస్తూ తాజాగా శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ జూన్ 20వ తేదీని ద్రోహుల దినోత్సవంగా ప్రకటించాలని వ్యంగ్యంగా ఐరాసను కోరారు. నాడు బీజేపీ ఆర్థిక సహకారంతో ఉద్ధవ్ ఠాక్రేను మోసం చేసిన ఒక్కొక్క తిరుగుబాటు ఎమ్మెల్యేకు రూ. 50 కోట్ల చొప్పున పంచారని రౌత్ ఆరోపించారు. ‘‘జూన్ 21 వ తేదీని యోగా దినోత్సవంగా ప్రకటించిన విధంగానే.. జూన్ 20వ తేదీని ద్రోహుల దినోత్సవంగా ప్రకటించాలి. ఇది కచ్చితంగా చేయాలి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ద్రోహులందరినీ గుర్తుంచుకోవడానికి ఇది తోడ్పడుతుంది.’’ అని రౌత్ ఆ ట్వీట్ లో వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు.

బీజేపీ స్పందన

రౌత్ ట్వీట్ కు బీజేపీ స్పందించింది. ఆ పార్టీ బీజేపీ ఎమ్మెల్యే నితిశ్ రాణే మాట్లాడుతూ.. అతి పెద్ద ద్రోహి ఉద్ధవ్ ఠాక్రేనేనని ఆరోపించారు. తండ్రి సిద్ధాంతాలకు, హిందుత్వకు, మరాఠీలకు, బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే ద్రోహం చేశాడని విమర్శించారు. అందువల్ల, ఒక వేళ ద్రోహుల దినోత్సవాన్ని ప్రకటించాలనుకుంటే, ఉద్ధవ్ ఠాక్రే పుట్టిన రోజైన జులై 27వ తేదీని ద్రోహుల దినోత్సవంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.