వందేళ్లనాటి శ్రీకృష్ణుడి ఆలయం.. అలంకరణకు 100 కోట్ల విలువైన ఆభరణాలు
Sri Krishna Janmashtami 2024 : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఓ శ్రీకృష్ణుడి ఆలయానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ఆలయంలో వంద కోట్ల విలువైన ఆభరణాలతో రాధాకృష్ణులను అలంకరించారు. ఈ ఆభరణాలు కూడా పురాతనమైనవి.
దేశవ్యాప్తంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో ఈ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. జన్మాష్టమి రోజున గ్వాలియర్‌లోని ఫూల్ బాగ్ కృష్ణుడి ఆలయంలో రాధాకృష్ణులను 100 కోట్ల విలువైన ఆభరణాలతో అలంకరిస్తారు.
100 కోట్ల విలువైన ఆభరణాలు
ప్రతీ ఏటా జన్మాష్టమిని పురస్కరించుకుని గ్వాలియర్‌లోని రాధాకృష్ణుల ఆలయాన్ని రూ.100 కోట్ల విలువైన ఆభరణాలతో అలంకరిస్తారు. సింధియా సంస్థానం కాలానికి చెందిన ఈ బంగారు ఆభరణాలలో వజ్రం, నీలమణి, ఎమరాల్డ్, రుబీస్ వంటి విలువైన రత్నాలు ఉన్నాయి.
వందేళ్ల ఆలయం
గ్వాలియర్‌లోని శ్రీకృష్ణుడి ఆలయాన్ని 1921లో అప్పటి గ్వాలియర్ సంస్థాన పాలకుడు మొదటి మాధవరావు సింధియా స్థాపించారు. స్వామి వారి ఆరాధన కోసం వెండి పాత్రలు, ధరించడానికి రత్నాలతో కూడిన బంగారు ఆభరణాలను తయారు చేయించారు. వీటిలో 55 ఎమరాల్డ్ కూడిన నెక్లెస్, వజ్రాలు, రుబీలతో కూడిన బంగారు వేణువు, బంగారు ముక్కు పుడకలు, గొలుసులు, వెండి పూజా పాత్రలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం జన్మాష్టమి నాడు రాధా-కృష్ణులను ఈ ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ రూపాన్ని చూడటానికి భక్తులు ఏడాది పొడవునా వేచి ఉంటారు.
బ్యాంకులో ఆభరణాలు
అందుకే ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. విదేశీ భక్తులు కూడా ఎక్కువే వస్తారు. ఈ ఆభరణాలు పురాతనమైనవి. ఏడాది పొడవునా బ్యాంకు లాకర్లలో పెడతారు. ప్రత్యేక భద్రత ఉంటుంది. జన్మాష్టమి రోజు ఉదయం కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ బ్యాంకు లాకర్ నుంచి బయటకు తీసుకొస్తారు. ఈ ఆలయం 102 సంవత్సరాల క్రితం స్థాపించారు. పురాతన వస్తువులు, విలువైన ఆభరణాలతో అలంకరించిన ఈ ఆలయానికి భద్రత కోసం 100 మందికి పైగా సిబ్బంది ఉంటారు. ఆలయం లోపల, బయట వీధుల నుంచి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
స్వాతంత్య్రం రాకముందు
రాధాకృష్ణుల నెక్లెస్‌లో విలువైన వజ్రాలు, ముత్యాలు, నీలమణి, టోపాజ్, ఎమరాల్డ్, రూబీస్ ఉంటాయి. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఈ ఆభరణాలతో అలంకరించేవారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఆభరణాలను బ్యాంకు లాకర్‌లో ఉంచారు. 2007 జన్మాష్టమి నాడు లాకర్ నుంచి బయటకు తీయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి జన్మాష్టమి నాడు రాధాకృష్ణుడిని ఈ ఆభరణాలతో అలంకరిస్తారు.