Lord Rama: సొంత చర్మంతో చెప్పులు తయారు చేసి.. తల్లికి బహుమతిగా ఇచ్చిన గ్యాంగ్ స్టర్; శ్రీరాముడే స్ఫూర్తి అని వ్యాఖ్య
Influenced by Lord Rama: సొంత చర్మం వలచి తల్లికి చెప్పులు కుట్టించి ఇచ్చాడు మధ్య ప్రదేశ్ కు చెందిన ఒక గ్యాంగ్ స్టర్. రామాయణంలో రాముడు చెప్పిన మాటలు స్ఫూర్తిగా ఈ పని చేశానని చెబుతున్నాడు మధ్యప్రదేశ్ కు చెందిన ఈ గ్యాంగ్ స్టర్. ఇతడు క్రమం తప్పకుండా రామాయణాన్ని పఠిస్తాడు. నిత్యం శ్రీరాముడిని కొలుస్తాడు.
Influenced by Lord Rama: మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన ఓ హిస్టరీ షీటర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అతను తన తల్లి పట్ల కృతజ్ఞతగా చేసిన పని విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.
చర్మం వలిచి, చెప్పులు కుట్టి..
మధ్య ప్రదేశ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ రౌనక్ గుర్జార్. ఆయన ఇటీవల తన తల్లికి ఒక అసాధారణ బహుమతిని సమర్పించాడు. తన స్వంత చర్మం నుండి రూపొందించిన పాదరక్షలను తన తల్లికి దక్షిణగా అందించాడు. ఉజ్జయినిలోని సందీపానీ నగర్ లోని అఖాడా మైదానంలో ఏడు రోజుల పాటు జరిగిన భగవత్ కథ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
శ్రీరాముడి మాటలు స్ఫూర్తిగా
ఒకసారి గ్యాంగ్ స్టర్ రౌనక్ గుర్జార్ కాలిపై పోలీసులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఆ సమయంలో, చికిత్స సందర్భంగా తన తొడలోని చర్మాన్ని తొలగించడానికి గుర్జార్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. తరువాత అతను ఆ చర్మాన్ని ఒక చెప్పులు తయారు చేసే వ్యక్తికి ఇచ్చి, ఆ చర్మంతో తన తల్లికి చెప్పులు కుట్టి ఇవ్వాలని కోరాడు. ఆ వ్యక్తి ఆ చర్మంతో నైపుణ్యంగా ఒక జత పాదరక్షలు తయారు చేశాడు. వాటిని గుర్జార్ తన మాతృమూర్తికి బహుమతిగా ఇచ్చాడు. ‘‘నేను క్రమం తప్పకుండా రామాయణాన్ని పఠిస్తాను. శ్రీరాముడి పాత్ర నన్ను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. సొంత చర్మంతో చెప్పులు కుట్టించి ఇచ్చినా.. తల్లి రుణం తీరదు అని శ్రీరాముడే స్వయంగా చెప్పాడు. కాబట్టి, ఈ ఆలోచన నా మనస్సులోకి వచ్చింది. దాంతో, నేను నా చర్మం నుండి పాదరక్షలను తయారు చేసి నా తల్లికి బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’’ అని గుర్జార్ వివరించారు. తల్లిదండ్రుల పాదాల వద్దనే స్వర్గం ఉందని సమాజానికి చెప్పాలనుకుంటున్నానని గుర్జార్ పేర్కొన్నారు.
తల్లి భావోద్వేగం
జితేంద్ర మహారాజ్ మార్గదర్శకత్వంలో ఉజ్జయినిలోని సందీపానీ నగర్ లోని అఖాడా మైదానంలో ఏడు రోజుల పాటు జరిగిన భగవత్ కథ కార్యక్రమాల్లో గుర్జార్ తన సొంత చర్మంతో తయారు చేసిన పాదరక్షలతో తన తల్లి పాదాలను అలంకరించారు. తన కుమారుడు చేసిన పనితో ఆ తల్లి భావోద్వేగానికి గురైంది. ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. 'రోనక్ లాంటి కొడుకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భగవంతుడు అతడిని అన్ని కష్టాల నుంచి కాపాడాలని, ఎలాంటి దుఃఖం లేని జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను' అని గుర్జార్ తల్లి పేర్కొన్నారు.