Russia Ukraine War | చర్చలే పరిష్కారం అంటూ భద్రతా మండలి తీర్మానానికి ఇండియా దూరం
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తీవ్రంగా ఖండించింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. అయితే అమెరికా ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి ఇండియా డుమ్మా కొట్టింది. చర్చలే అన్నింటికీ పరిష్కారం అని తేల్చి చెప్పింది.
యునైటెడ్ నేషన్స్: "వెంటనే ఉద్రిక్తతలకు తెరదించాలి. వివాదాలను పరిష్కరించడానికి చర్చలే పరిష్కారం" అంటూ రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై భద్రతా మండలి ప్రవేశపెట్టిన తీర్మానానికి దూరంగా ఉంది ఇండియా.
ఈ తీర్మానాన్ని అమెరికా ప్రవేశపెట్టింది. దీనికి ఇండియాతోపాటు చైనా, యూఏఈ దూరంగా ఉండగా.. అల్బేనియా, బ్రెజిల్, ఫ్రాన్స్, గాబన్, ఘనా, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే, యూకే, యూఎస్ ఈ తీర్మానానికి మద్దతు తెలిపాయి. అయితే ఫిబ్రవరిలో ఈ సెక్యూరిటీ కౌన్సిల్‌కు అధ్యక్ష బాధ్యతలు వహిస్తున్న శాశ్వత సభ్య దేశం రష్యా తన వీటో పవర్‌ను ఉపయోగించి ఈ తీర్మానాన్ని అడ్డుకుంది.
ఈ తీర్మానానికి దూరంగా ఉండటంపై యూఎన్‌లో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి స్పందించారు. "ప్రస్తుతం ఉక్రెయిన్‌లో చోటుచేసుకున్న పరిణామాలు భారత్‌ను తీవ్రంగా కలచివేశాయి. హింస, ఉద్రిక్తతలను వెంటనే నిలిపేయడం కోసం అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని తిరుమూర్తి చెప్పారు. ఇక ఉక్రెయిన్‌లో ఉన్న భారత విద్యార్థులు, పౌరుల భద్రతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మనుషులు ప్రాణాలు పోతుంటే ఎలాంటి తీర్మానం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. విభేదాలు, వివాదాలను పరిష్కరించడానికి చర్చలు ఒక్కటే పరిష్కారం అని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దౌత్యమార్గాన్ని పక్కనపెట్టేయడం చింతించాల్సిన విషయమన్నారు. కచ్చితంగా ఆ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉన్నదని, ఈ కారణాలన్నింటి వల్లే తాము ఈ తీర్మానానికి దూరంగా ఉన్నట్లు తిరుమూర్తి చెప్పారు. అంతర్జాతీయ చట్టం, అన్ని దేశాల సార్వభౌమత్వం, ఆయా ప్రాంతాల సమగ్రత, యూఎన్ చార్టర్‌ను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు.
రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించి ఈ తీర్మానాన్ని విఫలమయ్యేలా చేసింది. ఇది నిజానికి ముందుగా ఊహించిందే. అయితే ఈ తీర్మానం ద్వారా ప్రపంచంలో రష్యా ఒంటరిగా మిగిలిపోయిందని చాటి చెప్పినట్లు పశ్చిమ దేశాలు చెబుతున్నాయి. అయితే రష్యాతో ఇండియాకు మంచి సంబంధాలు ఉండటంతో ఈ తీర్మానంపై మన దేశం ఎలా స్పందిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. చివరికి ఇందులో పాల్గొనకూడదని ఇండియా నిర్ణయించడం గమనార్హం.
సంబంధిత కథనం