Yana Mir ‘‘నేను మలాలాను కాదు.. నా దేశంలో నేను సేఫ్ గా ఉన్నాను’’ - ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కశ్మీరీ యాక్టివిస్ట్ స్పీచ్-i am not malala who is yana mir whos speech in uk went viral ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Yana Mir ‘‘నేను మలాలాను కాదు.. నా దేశంలో నేను సేఫ్ గా ఉన్నాను’’ - ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కశ్మీరీ యాక్టివిస్ట్ స్పీచ్

Yana Mir ‘‘నేను మలాలాను కాదు.. నా దేశంలో నేను సేఫ్ గా ఉన్నాను’’ - ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కశ్మీరీ యాక్టివిస్ట్ స్పీచ్

HT Telugu Desk HT Telugu
Feb 23, 2024 07:45 PM IST

Yana Mir speech in UK parliament: యూకే పార్లమెంట్లో ఇటీవల కశ్మీరీ యాక్టివిస్ట్, జర్నలిస్ట్ యానా మీర్ చేసిన ప్రసంగం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఆమె ప్రసంగం వీడియోను లక్షలాది భారతీయులు తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తున్నారు.

యూకే పార్లమెంట్లో ప్రసంగిస్తున్న కశ్మీరీ యాక్టివిస్ట్ యానా మీర్
యూకే పార్లమెంట్లో ప్రసంగిస్తున్న కశ్మీరీ యాక్టివిస్ట్ యానా మీర్

కశ్మీరీ యాక్టివిస్ట్, జర్నలిస్ట్ యానా మీర్ (Yana Mir) యూకే పార్లమెంటులో ఇటీవల ప్రసంగించారు. అక్కడ మాట్లాడుతూ తాను మలాలా యూసఫ్జాయ్ ని కాదని, ఎప్పటికీ మలాలా యూసఫ్జాయ్ ని కాబోనని ఆమె ఆ ప్రసంగంలో పేర్కొన్నారు. తన స్వదేశమైన భారత్ లో భాగమైన కశ్మీర్లో తాను పూర్తిగా సురక్షితంగా, స్వేచ్ఛగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. ఆమె ప్రసంగం ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.

యానా మీర్ ప్రసంగంలో ఏముంది?

యూకే పార్లమెంట్లో ఇటీవల 'సంకల్ప్ దివస్' నిర్వహించారు. ఆ సందర్భంగా కశ్మీరీ యాక్టివిస్ట్, జర్నలిస్ట్ యానా మీర్ (Yana Mir) అక్కడ ప్రసంగించారు. ‘‘నేను మలాలా యూసుఫ్ జాయ్ ను కాదు.. కాబోను. ఎందుకంటే నేను నా మాతృ దేశం భారత లో భాగమైన మాతృ భూమి కాశ్మీర్ లో స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నాను. మలాలా యూసఫ్ జాయ్ లాగా నేను నా మాతృభూమిని వదిలి పారిపోయి మీ దేశంలో ఆశ్రయం పొందాల్సిన అవసరం నాకు లేదు. అభివృద్ధిలో దూసుకుపోతున్న నా దేశాన్ని అణచి వేస్తున్న దేశం అంటూ మలాలా యూసుఫ్ జాయ్ కించపరిచేలా మాట్లాడారు. భారతీయులను మత ప్రాతిపదికన పోలరైజ్ చేయడం మానుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి మేము మిమ్మల్ని అనుమతించము’’ అని యానా మీర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 21న మీర్ తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది.

నా దేశాన్ని కించపరచడం మానేయండి..

యూకే పార్లమెంట్ లో యానా మీర్ దాదాపు మూడు నిమిషాలు ప్రసంగించారు (Yana Mir speech in UK parliament). ఆమె ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘‘సోషల్ మీడియా, అంతర్జాతీయ మీడియా నుండి వచ్చిన టూల్‌కిట్ సభ్యులెవరూ కూడా కాశ్మీర్‌ను సందర్శించాలనుకోరు. కానీ అక్కడ అణచివేత జరుగుతోందని కథనాలను రూపొందిస్తుంటారు’’ అని ఆమె విమర్శించారు. ‘‘ఈ సంవత్సరం సంకల్ప్ దివస్ రోజున, యూకే, పాకిస్తాన్లో నివసిస్తున్న మా దేశ వ్యతిరేకులు అంతర్జాతీయ మీడియాలో లేదా అంతర్జాతీయ మానవ హక్కుల వేదికలపై నా దేశాన్ని కించపరచడం మానేస్తారని నేను ఆశిస్తున్నాను. అవాంఛిత సెలెక్టివ్ ఆగ్రహాన్ని ఆపండి. మీ యుకె లివింగ్ రూమ్స్ నుండి భారతీయ సమాజాన్ని జడ్జ్ చేయడం మానేయండి. ఉగ్రవాదం కారణంగా ఇప్పటికే వేలాది మంది కశ్మీరీ తల్లులు తమ కుమారులను కోల్పోయారు. మా వెంట పడడం మానేయండి. నా కశ్మీరీ సమాజం ప్రశాంతంగా బతకనివ్వండి. థాంక్యూ అండ్ జై హింద్' అని యానా మీర్ (Yana Mir) తన ప్రసంగాన్ని ముగించారు.

ఎవరు ఈ యానా మీర్?

యానా మీర్ కాశ్మీర్ యాక్టివిస్ట్, జర్నలిస్ట్. ఆల్ జేకే యూత్ సొసైటీ (AJKYS)కు ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ విషయాలు ఆమె ట్విటర్ బయోలో ఉన్నాయి. అందులో ఆమె తనను తాను టెడ్ఎక్స్ స్పీకర్ గా అభివర్ణించుకున్నారు. తన యూట్యూబ్ చానెల్ లో తాను కశ్మీరీ పొలిటికల్ ఎనలిస్ట్ అని పేర్కొన్నారు. యూకేలో జరిగిన ఈ సంకల్ప్ దివస్ కార్యక్రమంలో జమ్ముకశ్మీర్ ప్రాంతంలో వైవిధ్యాన్ని ప్రోత్సహించినందుకు గానూ యానా మీర్ డైవర్సిటీ అంబాసిడర్ అవార్డును అందుకున్నారు.

ఆమె ప్రాణాలకు ముప్పు..

యూకే పార్లమెంట్లో యానా మీర్ (Yana Mir) ప్రసంగిస్తున్న వీడియోను కశ్మీర్ బీజేపీ మీడియా ఇంచార్జ్ సాజిద్ యూసుఫ్ షా శుక్రవారం షేర్ చేశారు. ఆ ప్రసంగం వైరల్ అయిన కారణంగా యానా మీర్ కు ఇప్పటికే బెదిరింపులు వచ్చాయని ఆయన ఆరోపించారు. ‘‘యూకే పార్లమెంట్లో యానా మీర్ మాట్లాడిన రెండు నిమిషాల వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. యానా మీర్ కు పాకిస్తాన్, దాని ప్రచార యంత్రాంగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. గత 48 గంటలుగా ఇంటర్నెట్ లో యాక్టివ్ గా ఉన్న టూల్ కిట్ గ్యాంగ్ ఆమెను బెదిరింపులకు గురిచేసే పనిలోనే ఉంది. ఈ బెదిరింపులను ఎదుర్కోవడానికి మీకు దేవుడు మరింత శక్తినివ్వాలి యానా'’’అని ఆయన ట్వీట్ చేశారు.

IPL_Entry_Point