Gujarat Exit Poll Results 2022: గుజరాత్‍లో మళ్లీ కమల వికాసమే.. పీపుల్స్ పల్స్ సర్వే
Gujarat Exit Poll Results 2022: గుజరాత్‍లో మరోసారి బీజేపీదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. మోదీ సొంత ఇలాఖాలో మళ్లీ కమల వికాసమేనని తేల్చాయి. ఆమ్ఆద్మీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది.
Gujarat Exit Poll Results 2022: ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‍లో భారతీయ జనతా పార్టీ (BJP) మరోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. గుజరాత్‍లో సోమవారం రెండో దశ పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి.. వరుసగా ఏడోసారి అధికార పీఠం దక్కించుకుంటుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే స్పష్టం చేసింది. ఆమ్‍ఆద్మీ పార్టీ మూడోస్థానానికే పరిమితం అవుతుందని వెల్లడించింది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ పూర్తి ఫలితాలు ఇవే..
తగ్గని బీజేపీ ఆధిపత్యం
Gujarat Exit Poll Results 2022: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ హవా కొనసాగిందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ తేల్చింది. ప్రధాని మోదీ ఇలాఖాలో కమలం పార్టీకి భారీ మెజార్టీ వస్తుందని తేల్చింది. పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. గుజరాత్‍లో బీజేపీకి 125 నుంచి 143 స్థానాలు దక్కుతాయి. కాంగ్రెస్ పార్టీ 30 నుంచి 48 స్థానాల్లో, ఆమ్‍ఆద్మీ పార్టీ 3 నుంచి ఏడు స్థానాల్లో గెలుస్తాయి. ఇతరులు 2 నుంచి 6 స్థానాల్లో మాత్రమే గెలుస్తారని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది.
గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ - పీపుల్స్ పల్స్ సర్వే
- బీజేపీ: 125 నుంచి 143
- కాంగ్రెస్: 30 నుంచి 48
- ఆమ్‍ఆద్మీ: 3 నుంచి 7
- ఇతరులు: 2 నుంచి 6
21 శాతం వ్యత్యాసంతో..
గుజరాత్‍లో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హవానే కారణం అని పీపుల్స్ పోల్స్ సర్వే చెప్పింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్ల వ్యత్యాసం ఏకంగా 21 శాతం ఉంటుందని అంచనా వెల్లడించింది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేప్రకారం.. బీజేపీకి 46 శాతం, కాంగ్రెస్ పార్టీకి 25 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 16 శాతం, ఇతరులకు 13 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ± 3 శాతం ఉండనుంది. 182 స్థానాలు ఉన్న గుజరాత్ శాసనసభలో అధికారంలోకి రావాలంటే 92 సీట్లు గెలవాలి. ఆ మార్కును ఈసారి కూడా బీజేపీ సునాయాసంగా దాటేస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 16 శాతం ఓట్లు సాధించినా, సీట్లు సాధించడంలో విఫలమైందని పేర్కొంది.
సెంటిమెంట్ మరోసారి..
ప్రధాన మంత్రి మోదీ సొంత రాష్ట్రం కావటంతో మరోసారి అక్కడ సెంటిమెంట్ పని చేసిందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే స్పష్టం చేసింది. ఈ సారి గుజరాత్ లో దాదాపు 30 బహిరంగ సభల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. వరసగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు అమిత్ షా క్షేత్రస్థాయిలో ఉండి వ్యుహాలు రచించారు. దీంతో గుజరాత్‍లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది.
ఓట్ల శాతం తగ్గినా..
గుజరాత్‍లో 2017 లో జరిగిన శాసనసభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓటు శాతం ఈసారి 3.1 శాతం తగ్గిందని పీపుల్ పల్స్ సర్వే పేర్కొంది. కాంగ్రెస్ ఓట్ షేర్ ఏకంగా 16.4 శాతం తగ్గిందని చెప్పింది.