CBDT Chairman | IT దాడులపై సీబీడీటీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. ఈ విషయాన్ని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు చైర్మన్ నితిన్ గుప్తా వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ సంవత్సరం 38% పన్ను వసూళ్లు పెరిగాయని ఆయన తెలిపారు.
CBDT Chairman | ఈ సంవత్సరం ప్రత్యక్ష పన్ను రీఫండ్స్ రూ. 93 వేల కోట్లని నితిన్ గుప్తా శుక్రవారం వెల్లడించారు. గత సంవత్సరం ఇది రూ. 52 కోట్లు మాత్రమేనన్నారు. పన్ను వ్యవస్థను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు.
CBDT Chairman | `ఫేస్‌లెస్ స్కీమ్`
`ఫేస్‌లెస్ స్కీమ్`ను విజయవంతం చేయడానికి చాలా చర్యలు తీసుకున్నామని గుప్తా వెల్లడించారు. ఈ విషయంలో పన్ను వసూలు అధికారులకు కచ్చితంగా పాటించాల్సిన కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేశామన్నారు. పన్ను చెల్లింపుదారులు తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వీడియో కాన్ఫరెన్సింగ్ విధానాన్ని కూడా ప్రారంభించామన్నారు. ఇందుకు సీబీడీటీ (Central Board of Direct Taxes - CBDT) 20 కమిటీలను కూడా ఏర్పాటు చేసిందన్నారు.
CBDT Chairman | దాడులు అందుకే..
ఆదాయపన్ను అధికారులు పన్ను ఎగవేతకు సంబంధించి వ్యక్తులు, సంస్థలపై దాడులు చేసే ముందు తమకు అందిన సమాచారం పూర్తిగా విశ్వసనీయమైనది అని నిర్ధారించుకుంటారని గుప్తా వివరించారు. కక్షసాధింపుతోనే, లేక వేరే ఒత్తిళ్ల వల్లనో దాడులో చేయమని స్పష్టం చేశారు. 2022 జూన్ 27 నుంచి నితిన్ గుప్తా CBDT చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
CBDT Chairman | లక్ష్యం చేరుకుంటాం
ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నిర్దేశించిన లక్ష్యాన్ని కచ్చతంగా చేరుకుంటామని గుప్తా తెలిపారు. బడ్జెట్‌లో రూ. 14.20 లక్షల కోట్ల పన్ను వసూళ్లను ఆర్థికమంత్రి లక్ష్యంగా నిర్దేశించారన్నారు. ఇప్పటివరకు రూ. 4.80 లక్షల కోట్లు వసూలయ్యాయని వెల్లడించారు. జులై 31తో ఐటీ రిటర్న్స్ గడువు ముగిసిందని, ఈ సంవత్సరం గడువును పొడిగించలేదని గుర్తు చేశారు. ఈ సంవత్సరం 6 కోట్లకు పైగా రిటర్న్స్ దాఖలయ్యాయని వెల్లడించారు. రీఫండ్స్‌ను కూడా త్వరగా ఇష్యూ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటివరకు రూ. 93 వేల కోట్లను రీఫండ్ చేశామన్నారు.