No more Toll plazas | ``ఇక‌పై టోల్ ప్లాజాలు క‌నిపించ‌వు``-government in process of introducing gps instead of fastag nitin gadkari ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Government In Process Of Introducing Gps Instead Of Fastag: Nitin Gadkari

No more Toll plazas | ``ఇక‌పై టోల్ ప్లాజాలు క‌నిపించ‌వు``

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

జాతీయ ర‌హ‌దారుల‌పై నుంచి త్వ‌ర‌లో టోల్ ప్లాజాలు క‌నుమ‌రుగు కానున్నాయి. టోల్ ప్లాజాల వ‌ల్ల ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్న నేప‌థ్యంలో ప్ర‌త్యామ్నాయాల‌పై ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. ఆధునిక ఉప‌గ్ర‌హ సాంకేతిక‌త సాయంతో నేరుగా కారులో నుంచే టోల్‌ను వ‌సూలు చేసే దిశ‌గా ఆలోచిస్తోంది.

No more Toll plazas | వాహ‌న‌దారుల నుంచి టోల్ ఫీజును వ‌సూలు చేసే టోల్ ప్లాజాలు ర‌హ‌దారులపై స‌ర్వ సాధార‌ణం. త్వ‌ర‌లో అవి కనుమ‌రుగు కానున్నాయి. ఈ వివ‌రాల‌ను కేంద్ర ర‌హ‌దారుల మంత్రి నితిన్ గ‌డ్క‌రీ బుధ‌వారం రాజ్య‌స‌భ‌కు వెల్ల‌డించారు.

ట్రెండింగ్ వార్తలు

No more Toll plazas | ఫాస్టాగ్‌ల స్థానంలో..

ప్ర‌స్తుతం టోల్ ఫీజును టోల్ ప్లాజాల వ‌ద్ద ఫాస్టాగ్‌(FASTag)ల ద్వ‌రా వ‌సూలు చేస్తున్నారు. త్వ‌ర‌లో ఆ FASTag ల స్థానంలో జీపీఎస్ ఆధారిత సాంకేతిక‌త‌ను తీసుకురానున్నారు. ఈ విష‌యంలో రెండు ప్ర‌త్యామ్నాయాల‌ను ప‌రిశీలిస్తున్నారు. అందులో ఒక‌టి కారులో ఉన్న ఉప‌గ్ర‌హ ఆధారిత‌ జీపీఎస్ ద్వారా ప్యాసెంజ‌ర్ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా టోల్ ఫీజును వ‌సూలు చేయ‌డం. మ‌రొక‌టి నెంబ‌ర్ ప్లేట్ల ఆధారంగా టోల్ ఫీజును సేక‌రించ‌డం. నెంబ‌ర్ ప్లేట్‌ల‌కు సంబంధించి ఆధునిక సాంకేతిక‌త మ‌నకు అందుబాటులో ఉంద‌ని కేంద్ర ర‌హ‌దారుల మంత్రి నితిన్ గ‌డ్క‌రీ బుధ‌వారం రాజ్య‌స‌భ‌కు వెల్ల‌డించారు. `నెంబ‌ర్ ప్లేట్ టెక్నాల‌జీ ద్వారా, కంప్యూట‌రైజ్డ్ డిజిట‌ల్ సిస్ట‌మ్ స‌హ‌కారంతో టోల్ ప్లాజాల అవ‌స‌రం లేకుండానే టోల్‌ను వ‌సూలు చేయ‌వ‌చ్చు` అని వివ‌రించారు. దాంతో, టోల్ ప్లాజాల వ‌ద్ద పొడ‌వాటి క్యూల బాధ వాహ‌న‌దారుల‌కు త‌ప్పుతుంద‌న్నారు.

No more Toll plazas | ఆరునెలల్లోనే ఈ మార్పులు..

ఆధునిక సాంకేతిక‌త స‌హ‌కారంతో వాహ‌న దారుల‌కు మ‌రింత మెరుగైన స‌దుపాయాలు క‌ల్పించ‌నున్నామ‌ని నితిన్ గ‌డ్క‌రీ రాజ్య‌స‌భ‌కు తెలిపారు. FASTags, toll plazas ల‌కు ప్ర‌త్యామ్నాయ విధానాల‌ను వ‌చ్చే ఆరు నెల‌ల్లో అమ‌ల్లోకి తీసుకువ‌స్తామ‌ని వెల్ల‌డించారు. రాజ్య‌స‌భ‌లో ప్రశ్నోత్త‌రాల స‌మ‌యంలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు గ‌డ్క‌రీ పై స‌మాచారం ఇచ్చారు. టోల్ ప్లాజాల వ‌ద్ద పొడ‌వాటి క్యూల‌ను, ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌ను తొల‌గించే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. అయితే, ఈ విష‌యంలో ఇంకా అధికారికంగా నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. అలాగే, ఈ ప్ర‌తిపాద‌న‌ను అమ‌లు చేయ‌డానికి ముందుగా పార్ల‌మెంటులో ఒక బిల్లును తీసుకురావాల్సి ఉంద‌న్నారు. ఒక‌వేళ ఎవ‌రైనా టోల్ ఫీ చెల్లించ‌ని ప‌క్షంలో వారిని ఎలా శిక్షించాల‌నే విష‌యాన్ని ఆ బిల్లులో పొందుప‌ర్చాల్సి ఉంద‌న్నారు.

No more Toll plazas | ఫాస్టాగ్ సేవ‌లు ప్ర‌శంస‌నీయం

ఒకే మార్గంలో 60 కిమీల లోపు రెండు టోల్ ప్లాజాలు ఉండ‌కూడ‌ద‌న్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా స‌భ్యులు ప్ర‌స్తావించారు. ఫాస్టాగ్ వ్య‌వ‌స్థ దేశ ర‌వాణా రంగానికి విశేష సేవ చేసింద‌ని గ‌డ్క‌రీ కొనియాడారు. ఒక్కోరోజు టోల్ ఆదాయం రూ. 120 కోట్లు వ‌చ్చిన సంద‌ర్భం కూడా ఉంద‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 5.56 కోట్ల ఫాస్టాగ్‌లు జారీ చేశామ‌న్నారు.

WhatsApp channel