No confidence motion: ఎన్నికల ముందు ‘అవిశ్వాసం’ ఎదుర్కొన్న ప్రధాన మంత్రులు వీరే..
No confidence motion: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. ఎన్నికలు మరో సంవత్సరంలో జరగనుండగా అవిశ్వాసాన్ని ఎదుర్కొన్న ప్రధాన మంత్రుల జాబితాలో మరోసారి ప్రధాని మోదీ చేరారు.
No confidence motion: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. ఎన్నికలు మరో సంవత్సరంలో జరగనుండగా అవిశ్వాసాన్ని ఎదుర్కొన్న ప్రధాన మంత్రుల జాబితాలో మరోసారి ప్రధాని మోదీ చేరారు.
రెండు తీర్మనాలు..
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటిస్తూ కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయి, తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు వేర్వేరుగా అందించిన నోటీసులను స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. మణిపూర్ లో కొనసాగుతున్న హింసపై ప్రధాని మోదీ స్పందించాలని, పార్లమెంట్లో సమగ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అవిశ్వాస తీర్మానాన్ని విపక్షం ప్రవేశపెడ్తోంది. ఈ అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరిగే తేదీ, సమయాన్ని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయిస్తారు. మణిపూర్ పరిస్థితిపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేస్తున్నాయి.
ఏడో ప్రధాని మోదీ..
ఎన్నికలు మరో సంవత్సరంలో జరగనుండగా అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న ఏడో ప్రధానిగా ప్రధాని మోదీ నిలిచారు. గతంలో..
- 1966 ఆగస్ట్ లో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వంపై హెచ్ ఎన్ బహుగుణ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
- 1966 నవంబర్ లో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వంపై ఉమా శంకర్ త్రివేదీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
- 1970 జులై లో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వంపై మధు లిమాయే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
- 1979 జులై లో నాటి మొరార్జీ దేశాయి ప్రభుత్వంపై వైబీ చవాన్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
- 2003 ఆగస్ట్ లో నాటి వాజ్ పేయి ప్రభుత్వంపై సోనియా గాంధీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
- 2018 జులైలో నాటి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కేశినేని శ్రీనివాస్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
అత్యధిక అవిశ్వాసాలు ఇందిరపై
ప్రధానిగా ఇందిరాగాంధీ అత్యధిక అవిశ్వాసాలను ఎదుర్కొన్నారు. ఆమెపై 15 సార్లు లోక్ సభలో అవిశ్వాస తీర్మానం రాగా, అన్నింటిలోనూ ఆమె విజయం సాధించారు. పైన పేర్కొన్న మూడు అవిశ్వాస తీర్మానాలే కాకుండా, మరో 12 అవిశ్వాసాలను ఇందిరా గాంధీ ఎదుర్కొన్నారు. అదులో ఒకటి 1967లో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం అనంతరం ఇప్పటివరకు మొత్తం 27 అవిశ్వాస తీర్మానాలు వచ్చినట్లు పార్లమెంటు రికార్డులు చెబుతున్నాయి. ఇప్పుడు మోదీ ప్రభుత్వంపై వచ్చింది 28వ అవిశ్వాస తీర్మానం. మొరార్జీ దేశాయి మినహా మిగతా ప్రధానులంతా అవిశ్వాసంపై విజయవంతంగా నెగ్గారు. 1979 జులైలో తనపై వచ్చిన అవిశ్వాసంపై చర్చ జరుగుతుండగా, మొరార్జీ దేశాయి రాజీనామా చేశారు.