Dawood Ibrahim: గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం; బిడ్డింగ్ లో శివసేన నేత
Dawood Ibrahim: అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన నాలుగు ఆస్తులను ప్రభుత్వం వేలం వేస్తోంది. వాటిలో దావూద్ బాల్యంలో నివసించిన ఇల్లు కూడా ఉంది. వీటి రిజర్వ్ ధరను రూ.19 లక్షలుగా నిర్ణయించారు.
Dawood Ibrahim: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన నాలుగు ఆస్తులను శుక్రవారం వేలం వేస్తున్నారు. వేలం వేస్తున్న నాలుగు ఆస్తుల్లో ఒకటి దావూద్ ఇబ్రహీం తన స్వగ్రామంలో బాల్యంలో గడిపిన ఇల్లు కూడా ఉంది. ఆ ఇల్లు వేలంలో శివసేన (shiv sena) నేత, న్యాయవాది అజయ్ శ్రీవాస్తవ కూడా పాల్గొంటున్నారు.
స్కూల్ నిర్మించాలని..
ఒకవేళ, వేలంతో తనకు దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) బాల్యంలో గడిపిన ఇల్లు లభిస్తే, ఆ ప్రదేశంతో సనాతన ధర్మాన్ని (sanatana dharma) బోధించే పాఠశాలను నిర్మిస్తానని అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇప్పుడు వేలం వేస్తున్ననాలుగు ఆస్తులు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ముంబకే గ్రామంలో ఉన్నాయి. ఇది దావూద్ ఇబ్రహీం స్వగ్రామం. ఈ ఆస్తులను ‘స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్,1976’ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గతంలో కూడా ముంబకే గ్రామంలో దావూద్ నివసించిన ఇల్లు సహా ఈ 4 ఆస్తులను ప్రభుత్వం వేలం వేసింది. ఆ వేలంలో దావూద్ చిన్నప్పుడు నివసించిన ఇల్లు బిడ్డింగ్ లో శివసేన నేత అజయ్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. కానీ, కొన్ని లీగల్ ఇష్యూస్ కారణంగా ఆ ఆస్తిని అతడు పొందలేకపోయాడు.
గత 20 ఏళ్లుగా..
దావూద్‌కు చెందిన పలు ఆస్తులను ప్రభుత్వం గత ఇరవై ఏళ్లుగా వేలం వేస్తూ వస్తోంది. 2000లో దావూద్ ఇబ్రహీం ఆస్తుల్లో ఒకదానిని తొలిసారిగా వేలం వేయగా.. ఆ సమయంలో దావూద్ ఇబ్రహీం అంటే ఉన్న భయంతో ఎవరూ వేలంలో పాల్గొనలేదు. ముంబకే గ్రామంలోని దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇంటితో సహా ఆరు ఆస్తులు 2020లో వేలానికి వచ్చాయి. 2017లో ఇబ్రహీంకు చెందిన హోటల్‌తో సహా దక్షిణ ఢిల్లీలో ఉన్న మూడు విలాసవంతమైన బంగ్లాలను ప్రభుత్వం విక్రయించింది.
విష ప్రయోగం
ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం కట్టుదిట్టమైన భద్రత మధ్య పాకిస్తాన్ లో నివసిస్తున్నాడని సమాచారం. అయితే, ఈ వార్తలను పాకిస్తాన్ ఖండిస్తోంది. కాగా, ఇటీవల, నెల రోజుల క్రితం దావూద్ ఇబ్రహీంపై హత్యా యత్నం జరిగిందని, అతడిపై విష ప్రయోగం చేశారని వార్తలు వచ్చాయి. దాంతో, అతడిని కరాచీలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందించారని తెలిసింది. వందలాది మంది అమాయకుల ప్రాణాలు తీసిన 1993 నాటి ముంబై దాడుల (1993 Mumbai attacks) సూత్రధారి ఈ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం. ప్రస్తుతం ఈ అంతర్జాతీయ ఉగ్రవాది కరాచీలోని సంపన్న నివాస ప్రాంతం క్లిఫ్టన్ ఏరియాలో ఉంటున్నాడని సమాచారం.