Mulayam Singh Yadav death: ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
Mulayam Singh Yadav: యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు.
గురుగ్రామ్: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు ములాయం సింగ్ యాదవ్ సోమవారం గురుగ్రామ్ ఆసుపత్రిలో మరణించారని ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ తెలిపారు. గత కొన్ని రోజులుగా ఎస్పీ నేత పరిస్థితి విషమంగా ఉంది. ఆగస్టు నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ములాయం సింగ్ యాదవ్‌ను పరిస్థితి విషమించడంతో అక్టోబరు 2న ఐసీయూకి తరలించారు.
నవంబర్ 22, 1939న జన్మించిన ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నాయకులలో ఒకరు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు.
10 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు.
ఈ ఏడాది జూలైలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ములాయం రెండో భార్య సాధనా గుప్తా మరణించారు.
ములాయం సింగ్ మొదటి భార్య మాలతీ దేవీ 2003లో మరణించారు. మాలతీదేవి అఖిలేశ్ యాదవ్ తల్లి.
ప్రముఖుల సంతాపం
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు రాజ్ నారాయణ్ వంటి గొప్ప నేతల స్ఫూర్తితో ములాయం సింగ్ యాదవ్ రాజకీయాల్లోకి వచ్చారని సీఎం అన్నారు.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం తన జీవితాంతం నిరుపేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారని సీఎం గుర్తు చేసుకున్నారు. ములాయంసింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ కు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ములాయం మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ములాయం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
టాపిక్