Forex reserves slump: ప్రమాదకర స్థాయికి విదేశీ మారకం
భారత విదేశీ మారక నిల్వలు(Forex reserves) ప్రమాదకర స్థాయికి దిగజారాయి. ఆగస్ట్ 19తో ముగిసే వారంలో భారత విదేశీ మారక నిల్వలు రెండేళ్ల కనిష్టానికి తగ్గాయి. దాంతో, రూపాయి బలోపేతానికి ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది.
Forex reserves slump: విదేశీ కరెన్సీ నిల్వల్లో ఒక్కసారిగా తగ్గుదల చోటు చేసుకోవడంతో ఆగస్ట్ 19తో ముగిసే వారానికి భారత విదేశీ మారక నిల్వలు 564.053 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇది రెండు సంవత్సరాల కనిష్టం.
Forex reserves slump: రూపాయి పతనం
రూపాయి పతనం కొనసాగుతుండడంతో దిగుమతులకు చెల్లించాల్సిన మొత్తాలు గణనీయంగా పెరిగాయి. ఆర్బీఐ వారం వారం వెల్లడించే గణాంకాల ప్రకారం.. విదేశీ కరెన్సీ నిల్వలు 501.216 బిలియన్ డాలర్లకు తగ్గాయి. అంతకు ముందు వారంతో పోలిస్తే అది 5.7 బిలియన్ డాలర్లు తక్కువ. భారత విదేశీ మారక నిల్వల్లో విదేశీ కరెన్సీనే ఎక్కువ శాతం ఉంటుంది. గత మూడు వారాలుగా విదేశీ మారక నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. ఆగస్ట్ 12తో ముగిసే వారంలో భారత విదేశీ మారక నిల్వలు 2.24 బిలియన్లు తగ్గాయి.
Forex reserves slump: ఇతర కరెన్సీలు కూడా...
యూరో, పౌండ్, యెన్ తదితర డాలరేతర కరెన్సీల విలువలు కూడా విదేశీమారక నిల్వల్లో భాగమే. వీటిని కూడా అమెరికా డాలర్ల విలువతోనే గణిస్తారు. ఆగస్ట్ 19తో ముగిసే వారంలో భారత విదేశీ మారకంలో ఇతర కరెన్సీలు కూడా భారీగా తగ్గాయి.
Forex reserves slump: గోల్డ్..
బంగారం విషయానికి వస్తే.. భారత్‌లోని బంగారం రిజర్వ్ విలువ ఆగస్ట్ 19తో ముగిసే వారంలో 704 మిలియన్ల డాలర్లు తగ్గి, 39.914 బిలియన్ డాలర్లకు చేరింది. అలాగే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ - ఐఎంఎఫ్( International Monetary Fund ) వద్ద భారత్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(Special Drawing Rights -SDRs) విలువ కూడా గత వారం 146 మిలియన్ డాలర్లు తగ్గి 17.987 బిలియన్ డాలర్లకు చేరింది.